ఉత్తరప్రదేశ్లోని శామ్లీలో దారుణం చోటుచేసుకుంది. ప్రముఖ హరియాన్వి గాయకుడు, యూట్యూబర్ అంకిత్ బాలియాన్ (35) బుధవారం సాయంత్రం దుండగుల కాల్పుల్లో దారుణంగా హత్యకు గురయ్యారు.
శామ్లీలోని ఓ జిమ్‌లో వర్కౌట్ ముగించుకుని సాయంత్రం సుమారు 7 గంటల సమయంలో బయటకు వచ్చి తన కారు వద్దకు వెళ్తుండగా నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు ఆయనపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దుండగులు దాదాపు 20 రౌండ్ల కాల్పులు జరపగా, తలకు సహా శరీరంలోకి పలు బుల్లెట్లు దూసుకెళ్లడంతో అంకిత్ ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.
శామ్లీలోని బంతికేరా గ్రామానికి చెందిన అంకిత్ బాలియాన్, సింగింగ్ మరియు యాక్టింగ్ కెరీర్ కోసం గత కొన్నేళ్లుగా హర్యానాలోని రోహ్‌తక్, సోనిపట్‌లలో నివసిస్తున్నారు. స్థానిక రాజకీయాలు, తుపాకీ సంస్కృతి, గ్రామీణ నేపథ్యంపై ఆయన పాడిన పాటలకు యూట్యూబ్‌లో విశేష ఆదరణ ఉంది. ముఖ్యంగా ఆయన పాడిన 'భరీ కోర్ట్ మే గోలీ మారేంగే మేరీ జాన్' అనే పాట ఎంతో ప్రాచుర్యం పొందింది. ఆ పాటలో తుపాకీ కాల్పుల గురించి ప్రస్తావించినట్లే, నిజ జీవితంలో కూడా ఆయన తూటాల వర్షానికి బలవ్వడం తీవ్ర విషాదాన్ని నింపింది.
ఈ హత్య సమాచారం తెలియడంతో అంకిత్ కుటుంబసభ్యులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతదేహంతో ఢిల్లీ-ముజఫర్‌నగర్ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలని, అప్పటివరకు అంత్యక్రియలు నిర్వహించేది లేదని భీష్మించారు. రంగంలోకి దిగిన పోలీసులు పాత కక్షలా లేక రాబోయే పంచాయతీ ఎన్నికల నేపథ్యమా అనే కోణాల్లో కేసు నమోదు చేసుకుని దర్యాప్తును వేగవంతం చేశారు.

