ఉత్తరప్రదేశ్‌లో ఒక సాధారణ మిస్సింగ్ కేసు విచారణలో మైండ్ బ్లోయింగ్ మర్డర్ మిస్టరీ వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ తన భర్తతో కలిసి.. తన ప్రియుడిని అత్యంత పక్కా ప్లాన్‌తో అంతమొందించింది.
సినిమా స్టైల్‌లో హత్య చేయడమే కాకుండా, పోలీసులకు దొరకకుండా సాక్ష్యాధారాలు ఎలా నాశనం చేయాలో యూట్యూబ్ వీడియోలు చూసి మరీ నేర్చుకున్న ఈ కిరాతక జంట ఉదంతం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
మిస్సింగ్ కేసుగా మొదలై..
యూపీలోని ఫతేపూర్ జిల్లాకు చెందిన విజయ్ నిషాద్ అనే వ్యక్తి మే 8వ తేదీన అకస్మాత్తుగా కనిపించకుండా పోయాడు. అతను ఎంతకూ ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు మే 11న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విజయ్ చివరి లొకేషన్, కాల్ డేటా (CDR) ఆధారంగా విచారణ జరపగా.. కిరణ్ దేవి అనే మహిళపై పోలీసులకు బంధువులు, సాంకేతిక ఆధారాల ద్వారా అనుమానం వచ్చింది. ఈ క్రమంలోనే కిరణ్ దేవి, ఆమె భర్త కామ్తా ప్రసాద్ లను పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించడంతో అసలు నిజం బయటపడింది.
వివాహేతర సంబంధమే కారణం
పోలీసుల కథనం ప్రకారం.. విజయ్, కిరణ్ దేవిల మధ్య గత కొన్ని నెలలుగా వివాహేతర సంబంధం సాగుతోంది. ఈ విషయం భర్త కామ్తా ప్రసాద్‌కు తెలిసింది. దీంతో భార్యపై, ఆమె ప్రియుడిపై అతను తీవ్రమైన కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా విజయ్‌ను అడ్డు తప్పించాలని భార్యతో కలిసే స్కెచ్ వేశాడు. ప్లాన్ ప్రకారం.. ఒకరోజు కిరణ్ దేవితో విజయ్‌కు ఫోన్ చేయించి తమ ఇంటికి రప్పించారు. విజయ్ రాగానే అక్కడే కాపుగా ఉన్న భర్త కామ్తా ప్రసాద్ అతనిపై ఒక్కసారిగా దాడి చేసి ప్రాణాలు తీశాడు.
శవాన్ని ముక్కలుగా నరికి..
హత్య చేసిన తర్వాత శవాన్ని ఎలా వదిలించుకోవాలో తెలియక ఈ జంట తమ స్మార్ట్‌ఫోన్లలో గూగుల్, యూట్యూబ్‌లను ఆశ్రయించారు. నిందితుల మొబైల్ ఫోన్లను పరిశీలించిన పోలీసులకు వారి సెర్చ్ హిస్టరీ చూసి ఫ్యూజులు ఎగిరిపోయాయి. వారు ఇంటర్నెట్‌లో హత్య కేసుల దర్యాప్తు ఎలా జరుగుతుంది? మర్డర్ కేసుల్లో శిక్షలు, జైలు శిక్షల నిబంధనలు ఎలా ఉంటాయి? మహిళా నేరస్థులకు ఉరిశిక్ష పడుతుందా? శవాన్ని ఎలా మాయం చేయాలి? సాక్ష్యాలను ఎలా నాశనం చేయాలి? వంటి అంశాలపై వందల సార్లు శోధించినట్లు తేలింది. మొదట చీకట్లో శవాన్ని బస్తాలో కుక్కి తీసుకెళ్లాలని చూశారు. కానీ వీలు కాకపోవడంతో.. మార్కెట్ నుంచి రంపం (Saw), గ్రైండర్ బ్లేడ్‌ను కొనుగోలు చేశారు. వాటి సాయంతో విజయ్ శవాన్ని ముక్కలు ముక్కలుగా నరికారు.
కాన్పూర్ అడవుల్లో దహనం
ముక్కలు చేసిన శేష భాగాలను పక్కనే ఉన్న కాన్పూర్ నగర్ జిల్లాలోని ఒక అటవీ ప్రాంతానికి బైక్‌పై తరలించారు. అక్కడ ఎవరికీ అనుమానం రాకుండా ఆ శరీర భాగాలకు నిప్పుపెట్టి తగలబెట్టారు. అలాగే విజయ్ గుర్తింపు దొరకకుండా ఉండేందుకు అతని మొబైల్ ఫోన్, పాన్ కార్డ్, ఏటీఎం కార్డ్, షూస్ వంటి వ్యక్తిగత వస్తువులను వేర్వేరు ప్రాంతాల్లో పడేశారు. చివరకు నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి సగం కాలిన మానవ అస్థిపంజర అవశేషాలు, బూడిదైన బట్టలు, హత్యకు ఉపయోగించిన రంపం, గ్రైండర్ బ్లేడ్, మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. భార్యాభర్తలిద్దరినీ అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.

