మధ్యప్రదేశ్లోని బాలాఘాట్ జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లికాని యువతి గర్భం దాల్చిన విషయాన్ని గోప్యంగా ఉంచేందుకు పుట్టిన శిశువును సజీవంగా పశువుల పెంట కుప్పలో పూడ్చిపెట్టారు.
ఈ దారుణ ఘటనకు పాల్పడిన అనంతరం కుటుంబ పరువు పోయిందనే మనస్తాపంతో చిన్నారి తాత పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించినట్లు పోలీసులు ఆదివారం వెల్లడించారు.
వారసెవోని పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి సమయంలో శిశువు రోదనలు విన్న గ్రామస్తులు ఆ ఇంటి కుటుంబ సభ్యులను ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెప్పారు. దీంతో గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆశా వర్కర్ జోక్యం చేసుకుని ఆ ఇంటిలోని పెళ్లికాని యువతి బిడ్డకు జన్మించినట్లు వెల్లడించింది. దీనిపై గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు, నైబ్ తహశీల్దార్, వైద్య బృందం శనివారం ఆ గ్రామానికి చేరుకుని పేడ కుప్పలో పూడ్చిపెట్టిన నవజాత శిశువు మృతదేహాన్ని వెలికితీశారు. చిన్నారి నోరు, మెడకు గుడ్డ కట్టి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నివేదిక వస్తేనే మృతికి అసలు కారణాలు తెలుస్తాయని వారసెవోని ఎస్‌డీఓపీ అభిషేక్ చౌదరి వెల్లడించారు. ఈ ఘటన జరిగిన తర్వాత తీవ్ర మనోవేదనకు గురైన యువతి తండ్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

