తెలుగు హోం
భారత్‌లో టీకా అమ్మకాలకు ఫైజర్ తీవ్ర యత్నాలు

భారత ఔషధ నియంత్రణ సంస్థ ఆమోదం పొందకుండానే తాను రూపొందించి కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి భారత ప్రభుత్వం ఆర్డర్ చేయాలని ఫైజర్ అభ్యర్థించనుంది. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ సరఫరా తక్కువగా ఉన్నప్పటికీ తాను రూపొందించిన కోవిడ్-19 నిరోధక వ్యాక్సిన్‌ని అధికారిక అనుమతి పొందకుండానే భారత ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు ఫైజర్ ప్రయత్నాలు చేస్తోంది.వాస్తవానికి కోవిషీల్డ్, కోవాక్సిన్ కంటే ముందుగా భారత్‌లో ఫైజర్ అత్యవసర ఉపయోగానికి సంబంధించిన అనుమతి కోసం ఫైజర్ సంస్థ ప్రయత్నించింది. కానీ జనవరిలో అత్యంత చౌకధరతో లభ్యమయ్యే ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ/అస్ట్రాజెనెకా రూపొందించిన కోవిషీల్డ్, భారత్ బయోటెక్ రూపొందించిన కోవాక్సిన్ టీకాలకు భారత ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. అయితే గత డిసెంబర్లోనే ఫైజర్ భారత్ ఆర్డర్లకోసం దరఖాస్తు చేసినప్పటికీ దేశీయంగా రూపొందించిన కోవిషీల్డ్, కోవాక్సిన్ టీకాలకు మాత్రమే అత్యవసర వినియోగానికి భారత్ అనుమతులు మంజూరు చేసింది. అయితే కాస్త ఆలస్యమైనా సరే తాను రూపొందించిన కోవిడ్-19 టీకాను భారత్ కొనుగోలు చేసేలా ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని మరోసారి అభ్యర్థిస్తానని ఫైజర్ ఇంక్ పేర్కొంది.డిసెంబర్లో భారత్‌లో ప్రవేశానికి ఫైజర్ కంపెనీ దరఖాస్తు చేసినప్పటికీ ఆ సంస్థ అధికారులు తమతో తదుపరి సమావేశానికి రావడంలో విఫలమయ్యారని కేంద్ర ప్రభుత్వ డ్రగ్ర్స్ ప్రామాణిక నియంత్రణ సంస్థ పేర్కొంది. వ్యాక్సిన్ భద్రతకు సంబందించిన కనీస స్థానిక నమూనా పరీక్ష కూడా చేయకుండానే భారత్‌లో ఫైజర్ వ్యాక్సిన్ సరఫరా చేయాలని ఆ కంపెనీ చేసిన అభ్యర్థనను భారత డ్రగ్స్ రెగ్యులేటర్ తిరస్కరించింది. భారత్‌లో తాము దాఖలు చేసిన దరఖాస్తులో తమ టీకా 95 శాతం సమర్థతతో పనిచేస్తుందని ఎలాంటి భద్రతా పరమైన సమస్యలు ఉండవని హామీ ఇచ్చినట్లు ఫైజర్ చెబుతోంది. జర్మన్ భాగస్వామి బయోన్ టెక్‌తో కలిసి తాను వృద్ది చేసిన వ్యాక్సిన్‌ను ఇప్పటికే బ్రిటన్, యునైటెడ్ స్టేట్స్, యూరోపియన్ యూనియన్, కెనడా ఆమోదించాయని ఫైజర్ తెలిపింది.భారత్ డ్రగ్స్ రెగ్యులేటర్ అతి తక్కువ సమయంలో సమావేశానికి రావాలని పిలుపునివ్వడం, టైమ్ జోన్ పరిమితుల కారణంగా తాము గత సమావేశాలకు హాజరు కాలేకపోయామని ఫేజర్ సమర్థించుకుంది. భారతదేశంలో ఫైజర్ టీకాను ఉపయోగించేలా భారత ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు తాము ప్రయత్నాలు చేస్తూనే ఉంటామని ఫైజర్ సంస్థ తెలిపింది.అయితే అత్యంత శీతల వాతావరణంలో పైజర్ టీకాను నిల్వచేయవలసి రావడం, టీకా ధర భారీస్థాయిలో ఉండటం అనేవి భారత్‌లో ఫైజర్ ప్రవేశాన్ని అడ్డుకోవచ్చునని భావిస్తున్నారు.