Thursday, 03 Dec, 10.25 am NewsSting

తెలుగు హోం
కరోనా టీకా వచ్చేసినట్లే.. ఫైజర్‌కు బ్రిటన్ పచ్చజెండా

ప్రపంచంలో కరోనా వైరస్‌కు టీకా వినియోగాన్ని ఆమోదించిన తొలి దేశంగా బ్రిటన్ చరిత్ర సృష్టించింది. గత ఆరేడునెలలుగా ప్రపంచాన్ని ఊరిస్తూ వచ్చిన కరోనా వైరస్ నిరోధక టీకా వచ్చేసినట్లేనని బ్రిటిన్ కంపెనీ ఫైజర్‌- బయో ఎన్‌ టెక్‌ ప్రకటించేసింది. మొదటినుంచి ఆశలు రేపుతున్న ఫైజర్ టీకా అత్యవసర వినియోగానికి బ్రిటన్ ప్రభుత్వం అనుమతులు ఇచ్చేసింది. దీంతో కరోనా వ్యాక్సిన్ మొట్టమొదటగా మార్కెట్లో ప్రవేశపెడుతున్న తొలిదేశంగా బ్రిటన్‌ భారీ వ్యాపారం, కోట్లాది పౌండ్ల సంపద మేటపడనుందని అంచనా.ఫైజర్‌- బయో ఎన్‌ టెక్‌ రూపొందించిన ఫైజర్‌ వ్యాక్సిన్‌ కు బ్రిటన్‌కు చెందిన ఔషధ నియంత్రణా సంస్థ ఎంహెచ్‌ఆర్‌ఏ ఆమోదం తెలిపిన నేపథ్యంలో బ్రిటిష్ ప్రభుత్వం ఈ టీకా అత్యవసర వినియోగానికి ఆమోద ముద్ర వేసింది. వచ్చే వారం నుంచి వ్యాక్సినేషన్‌కు ఏర్పాట్లు చేస్తున్నట్లు హెల్త్‌ సెక్రటరీ మాట్‌ హాంకాక్‌ చెప్పారు. టీకా అధ్యయనాల్లో 95 శాతం ప్రభావశీలత చూపిందన్నారు. టీకా పంపిణీ మంత్రి నదీమ్‌ మాట్లాడుతూ కరోనాపై పోరాటంలో ఇది అతిపెద్ద అడుగు అని చెప్పారు.కంపెనీ సమర్పించిన డేటా విశ్లేషణను నిపుణులు పరిశీలించిన అనంతరం వ్యాక్సిన్‌కు ఉండాల్సిన ప్రమాణాలను, రక్షణ నియమాలను ఈ టీకా అందుకున్నట్లు ఎంహెచ్‌ఆర్‌ఏ భావించి, ప్రజల్లో వాడకానికి అనుమతినిచ్చిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. టీకాను ముందుగా తీసుకునే ప్రాధామ్య వర్గాలు అనుసరించాల్సిన సూచనలను ప్రభుత్వం విడుదల చేయనుందన్నారు.

వైద్యులు, వయోవృద్ధుల్లాంటి వారిని ప్రాధామ్య వర్గాలుగా పరిగణిస్తారు. వచ్చేవారం నుంచి యూకే మొత్తం టీకా పంపిణీ ప్రారంభం అవుతుంది. అయితే టీకా విజయవంతం కావాలంటే ప్రజలంతా తమకు నిర్ధేశించిన పాత్రను సమర్ధవంతంగా పోషించాలి అని బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటివరకు దాదాపు 4కోట్ల డోసులను ప్రభుత్వం ఆర్డరు చేసింది.

వ్యాక్సినేషన్‌లో భాగంగా 21 రోజుల వ్యవధితో రెండుమార్లు టీకా ఇస్తారు. అయితే టీకాను అత్యంత శీతల ఉష్ణోగ్రతల వద్ద భద్రపరచడం అతిపెద్ద సవాలని హాంకాక్‌ అభిప్రాయపడ్డారు. తొలి దశలో ముందుగా 8 లక్షల వ్యాక్సిన్‌షాట్స్‌ అందుబాటులో ఉంటాయని, క్రమంగా నెలాఖరుకు మిగిలిన డోసులు అందుబాటులోకి వస్తాయని వివరించారు. టీకాను ఫైజర్‌ ఎంత వేగంగా ఉత్పత్తి చేస్తే అంత వేగంగా వ్యాక్సినేషన్‌ కొనసాగుతుందన్నారు.

టీకాలు అందుబాటులోకి వస్తుండడం సంతోషకరమైన అంశమని బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్ చెప్పారు. కానీ ఇంతటితో కరోనాపై పోరాటం, కరోనా వ్యాప్తి ఆగిపోతాయని భావించరాదని ప్రజలను హెచ్చరించారు. సైన్స్ రంగంలో కాంతిపుంజాల వంటి నిపుణులు కరోనా టీకాను ఆవిష్కరించారు కానీ దాని సరఫరా సంపంధించిన సవాళ్లు ఇంకా మిగిలే ఉన్నాయని వ్యాఖ్యానించారు.ఏది ఏమైనా ఒక్కో వ్యాక్సిన్‌ కనుగొనడానికి రెండు నుంచి పదేళ్ల సమయం పడుతుండగా కేవలం 10 నెలల్లోనే కరోనా వ్యాక్సిన్‌ను అతివేగంగా రూపొందించిన ఘనత ఫైజర్ బయోఎంటెక్ దక్కించుకుంది. వ్యాక్సిన్ పరుగుపందెంలో రష్యా మాస్కో ఒకవైపు ఫైజర్‌ వ్యాక్సిన్‌కు బ్రిటన్‌ ప్రభుత్వం ఆమోదం తెలపగా, మరోవైపు స్పుత్నిక్‌ వీ వ్యాక్సినేషన్‌కు రష్యా అనుమతినిచ్చింది.

వచ్చే వారం నుంచి వ్యాక్సినేషన్‌ ప్రారంభించాలని దేశాధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఆదేశించారు. డిసెంబర్‌లో పెద్ద ఎత్తున వ్యాక్సిన్‌ను పంపిణీ చేస్తామని అధికారులు చెప్పారు. రష్యా 20 లక్షల డోస్‌లను ఉత్పత్తి చేసినట్లు సమాచారం. మరోవైపు ఇప్పటికే లక్ష మందికిపైగా ఈ వ్యాక్సిన్‌ను ఇచ్చినట్లు ఆరోగ్య శాఖ మంత్రి మిఖైల్‌ చెప్పడం గమనార్హం. ఇది చదవండి: కీలక దశకు చేరుకున్న దేశీయ వ్యాక్సిన్‌.. 26 వేలమందిపై ప్రయోగం

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: News sting Telugu
Top