Thursday, 03 Dec, 10.01 am NewsSting

తెలుగు హోం
రేపే గ్రేటర్ కౌంటింగ్‌.. ఫలితాలపై నాయకుల్లో ఆందోళన..

గ్రేటర్‌లోని 150 వార్డుల్లో 1,122 మంది అభ్యర్థులు బరిలో నిలబడగా, వీరిలో విజేతలుగా నిలిచి గ్రేటర్‌ కౌన్సిల్‌లో అడుగు పెట్టేది ఎవరు.. అన్నది శుక్రవారం తేలనుంది. 30 కేంద్రాల్లోని 150 కౌం టింగ్‌ హాళ్లలో శుక్రవారం ఉదయం 8గంటలకు లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. 74.12 లక్షల ఓట్లకుగాను 34.50 లక్షల ఓట్లు పోలయ్యా యి. స్ట్రాంగ్‌ రూమ్‌లు, లెక్కింపు కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. మొదట పోస్టల్‌ బ్యాలెట్లు లెక్కిస్తారు. 2,629 పోస్టల్‌ బ్యాలెట్లు జారీ చేయగా, అందులో ఎన్ని కేంద్రాల వద్దకు చేరుతాయన్నది నేడు తేలనుంది. 8 గంటలలోపు వచ్చే పోస్టల్‌ బ్యాలెట్లను పరిగణనలోకి తీసుకుంటారు. పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు 10 నుంచి 15 నిమిషాల్లో పూర్తవుతుంది. కేవలం 11,818 ఓట్లు పోలైన మెహిదీపట్నం వార్డు ఫలితం మొదట వెలువడే అవకాశం ఉంది. ఒక్కో రౌండ్‌కు 14 వేల ఓట్లు లెక్కించే అవకాశం ఉండగా, అంతకంటే తక్కువ ఓట్లున్న ఈ డివిజన్‌ ఫలితం త్వరగా వస్తుందని అధికారులు చెబుతున్నారు. అత్యధికంగా 37,445 ఓట్లు పోలైన మైలార్‌దేవ్‌పల్లి ఫలితం ఆలస్యంగా వెలువడే అవకాశముంది.

ఫలితాలపై నాయకుల్లో ఆందోళన.. గ్రేటర్‌ వార్‌ ముగిసింది. నాయకుల్లో మరో టెన్షన్‌ మొదలైంది. ఓటింగ్‌ శాతం తగ్గడం ఎవరిని ముంచుతుందో...

అనే ఆందోళన ఒకవైపు నెలకొంది. మరోవైపు నిక్షిప్తమైన ఓటరు తీర్పు ఎటువైపనే భయం వెంటాడుతోంది. ఆయా డివిజన్లకు పార్టీలు నియమించిన ఇన్‌చార్జిల్లో ఇప్పుడు గుబులు మొదలైంది. తేడా వస్తే అధిష్టానం దృష్టిలో పలుచనవుతామని భయపడుతున్నారు.

ఎప్పటిలాగా కాకుండా జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ఈసారి ఒక ఊపుమీద జరిగాయి. ప్రచారంలో చాలామంది కనిపించినా ఓటింగ్‌కు మాత్రం నగర యువత దూరంగా ఉంది. ఓటింగ్‌ శాతం భారీగా తగ్గడంతో మెజారిటీ దేవుడు ఎరుగు... గట్టెక్కితే చాలనే అభిప్రాయంతో డివిజన్ల ఇన్‌చార్జిలు ఉన్నారు.

ఓటర్‌ అంతరంగం అంతుపట్టడం లేదంటున్నారు. ఆయా డివిజన్లకు పార్టీలు నియమించిన ఇన్‌చార్జీల్లో గుబులు మొదలైంది. గ్రేటర్‌ పోరు ప్రతిష్టాత్మకంగా మారడంతో ఈ ఇన్‌చార్జీలు తమ సొంత నియోజకవర్గాల నుంచి పార్టీ కేడర్‌ను దింపి మరీ ప్రచారం చేయించారు. ప్రచారంలో ఉన్న జోష్‌ ఓటింగ్‌లో లేకపోవడం..

వీరికి ఇబ్బందిగా మారింది. స్థానిక నాయకులకు బాధ్యతలు అప్పగించినా... ఓటింగ్‌ శాతాన్ని పెంచలేకపోయామని మధనపడుతున్నారు. ఫలితంలో తేడా వస్తే... తమ రాజకీయ జీవితంపై ఇదొక రిమార్క్‌గా ఎక్కడ మారుతుందోనని ఆందోళన చెందుతున్నారు. పోటీ ముఖ్యంగా టీఆర్‌ఎస్, మజ్లిస్, బీజేపీ మధ్యే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: News sting Telugu
Top