Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మొటిమలు ఎందుకు వస్తాయి. రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తులు

మొటిమలు ఎందుకు వస్తాయి. రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తులు

కౌమారదశలో ప్రవేశించే వారికే మొటిమల సమస్య ఉంటుందనుకుంటారు చాలామంది. నిజానికి, నలభై ఏళ్లు పైబడినవారికీ వస్తాయివి. కేవలం ముఖంపైనే కాదు.. చేతులు, ఛాతి, వీపు వంటి భాగాలపైనా మొటిమలు వస్తాయి. నాలుగు స్థాయుల్లో వేధించే ఈ సమస్య తీవ్రత కొందరిలో ఎక్కువగా ఉంటుంది. మొటిమలు వచ్చి తగ్గడంతో పాటు.. కొందరికి మచ్చలు పడితే.. మరికొందరికి గుంటల దాకా దారితీస్తాయి. అవి తగ్గడానికి చాలా సమయం పడుతుంది. ఎంతో బాధించే వీటి రాకకు కారణాలనేకం.
హార్మోన్లలో చోటుచేసుకునే మార్పులు..
చర్మంలో నూనె గ్రంథుల పనితీరు,
బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్‌ వంటివి ఇందుకు ప్రధాన కారణాలు.
పరోక్షంగా ఒత్తిడితోనూ కొన్నిసార్లు వస్తుంటాయి.

పీసీఓడీ (పాలిసిస్టిక్‌ ఓవరీస్‌) సమస్య,
కొన్నిరకాల ఉత్ప్రేరకాలు,
గర్భనిరోధక మాత్రలు,
క్షయకు వాడే మందులు.. వంటివీ ఈ సమస్యకు దారితీస్తాయి.

మొటిమలు త్వరగా నయం కావాలంటే.. కొన్నిరకాల పీల్స్‌, లేజర్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అలాంటివాటిల్లో శాలిసిలిక్‌ యాసిడ్‌, మాండలిక్‌ యాసిడ్‌, గ్త్లెకోలిక్‌ యాసిడ్‌ ఉన్న పీల్స్‌ ఎంచుకోవాలి. ఈ చికిత్సను రెండు వారాలకోసారి ఆరు నుంచి ఎనిమిది విడతల వారీగా చేస్తారు. ఈ చికిత్సతో పాటు మందులు కూడా సూచిస్తారు వైద్యులు. అప్పుడే ఫలితం త్వరగా ఉంటుంది. పరిస్థితిని బట్టి లేజర్‌ చికిత్స కూడా మరో ప్రత్యామ్నాయం.
లేజర్‌ చికిత్సలున్నాయ్‌.

మొటిమలతో జాగ్రత్తలు :
చూడటానికి మొటిమలు చిన్నగానే ఉంటాయి గానీ యుక్తవయసు పిల్లలను తెగ ఇబ్బంది పెడతాయి. సౌందర్యపరంగానే కాదు.. మానసికంగానూ వేధిస్తాయి. అందుకే ముఖంపై ఒక్క మొటిమ కనబడినా వెంటనే గిల్లేస్తుంటారు. నిజానికి ఇలా గిల్లటం వల్ల మొటిమలు తగ్గకపోగా మరింత తీవ్రమయ్యే ప్రమాదముంది. కాబట్టి మొటిమలు గలవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం తప్పనిసరి.

ముఖంపై నూనె లేదా జిడ్డుగా ఉండే ఎలాంటి పదార్థాలనూ రాయకూడదు. ఇలాంటివి చర్మంలోని తైల గ్రంథులు మూసుకునేలా చేసి మొటిమలను మరింత తీవ్రం చేస్తాయి. తప్పనిసరైతేనే ముఖానికి మేకప్‌ వేసుకోవాలి. అలాగే పడుకునేప్పుడు మేకప్‌ను పూర్తిగా కడుక్కోవాలి.

రోజూ షాంపూతో తలస్నానం చేయటం వల్ల ముఖం జిడ్డుబారకుండా ఉంటుంది. తలకు నూనె, క్రీముల వంటివి వాడితే.. అవి ముఖమంతా విస్తరించి, మొటిమలు ఉద్ధృతం కావటానికి దోహదం చేస్తాయి.

మొటిమల సమస్య తీవ్రంగా గలవారిలో కొందరికి తైలగ్రంథుల మార్గంలో అధికంగా నూనె పేరుకుపోవటం వల్ల పసుపురంగులో గానీ నల్లగా గానీ ముఖంపై చిన్న బుడిపెలు (బ్లాక్‌హెడ్స్‌) ఏర్పడుతుంటాయి. వీటిని గిల్లటం మంచిది కాదు. దీంతో మొటిమలు తగ్గటం ఆలస్యమవుతుంది.

రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే చర్మ సౌందర్యం కూడా మెరుగుపడుతుంది. ఇది మొటిమలు తగ్గేందుకూ దోహదం చేస్తుంది.

కొందరు మొటిమలు తగ్గేందుకు వేసుకునే మందులను వెంటనే ఆపేస్తుంటారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇలాంటి మందులు పూర్తి ప్రభావం చూపేందుకు 8 వారాల వరకు సమయం పడుతుందని గుర్తించాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Newtelugunews.com