Dailyhunt
ఊహించని ప్రమాదం.. ఓ వ్యక్తి ముఖమే మారిపోయింది!

ఊహించని ప్రమాదం.. ఓ వ్యక్తి ముఖమే మారిపోయింది!

రాజస్థాన్ లోని బికనీర్ కు చెందిన కర్ణీ బిష్ణోయ్ అనే 38 ఏళ్ల వ్యక్తి గత ఏడాది సెప్టెంబర్ లో ఆఫీసు నుంచి ఇంటికి వెళ్తుంటే ఓ ఎద్దు దాడి చేసింది. కొట్లాడుకుంటున్న ఎద్దులు వెళ్లిపోయేంత వరకు ఆగుదామనుకున్న బిష్ణోయ్.. కారును ఆపాడు. కిటికీ అద్దం తీశాడు. అంతే, ఆ ఎద్దుల్లో ఒకటి కొమ్ముతో బిష్ణోయ్ మొహంపై కుమ్మేసింది. కుడి కన్ను, ముక్కు, నోటిని చీల్చేసింది. కారు నుంచి విసిరి అవతలకు పారేసింది. తీవ్రగాయాలైన బిష్ణోయ్ ను వెంటనే పక్కనే ఉన్న సహోద్యోగి బికనీర్ లోని స్థానిక ఆసుపత్రికి తరలించారు.

అయితే, వారు కొన్ని కుట్లు వేసి, అంతకు మించి తామేమీ చేయలేమని చేతులెత్తేశారు. దీంతో సాకేత్ లోని మ్యాక్స్ ఆసుపత్రికి తరలించారు.

అక్కడ అతడిని పరిశీలించిన వైద్యులు కంగు తిన్నారు. వెంటనే న్యూరో, ప్లాస్టిక్ సర్జన్లను పిలిపించారు. కరోనా నిబంధనలను పాటిస్తూ దాదాపు 10 గంటల పాటు శస్త్రచికిత్స చేసి మొహంలో విరిగిపోయిన ఎముకలు, కండ, ముక్కు భాగాలను అతికించారు. మామూలు మనిషి ముఖంలా మార్చారు.

అయితే, అతడి కుడివైపు ఎలాంటి కదలికలు లేకపోవడంతో నాలుగు నెలల తర్వాత మరో శస్త్రచికిత్స చేశారు. కండరాల మధ్య నాడీకణాల పనితీరును మెరుగుపరిచేందుకు ఆపరేషన్ చేశారు. దీంతో మామూలుగానే అతడి కుడివైపు ముఖంలో కదలికలు మొదలయ్యాయి. మున్ముందు మరికొన్ని శస్త్రచికిత్సలు చేయాల్సిన అవసరం ఉందని, కృత్రిమ కన్నును పెట్టాల్సి ఉందని, ముఖంపై మచ్చలను తొలగించాల్సి ఉందని వైద్యులు తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Newtelugunews.com