Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అరెరే.. ఆశ్చర్యం కానీ నిజం..! అర్ధరాత్రి కుక్కలను వెంటాడి వేటాడిన చిరుతపులి.. నోటికి చిక్కిన కుక్కపిల్ల.. అయినా తినకుండా వదిలేసి వెళ్లిన వైనం.. ఆశ్చర్యపరిచే విచిత్ర వీడియో!

అరెరే.. ఆశ్చర్యం కానీ నిజం..! అర్ధరాత్రి కుక్కలను వెంటాడి వేటాడిన చిరుతపులి.. నోటికి చిక్కిన కుక్కపిల్ల.. అయినా తినకుండా వదిలేసి వెళ్లిన వైనం.. ఆశ్చర్యపరిచే విచిత్ర వీడియో!

హారాష్ట్రలోని పాల్ఘర్ ప్రాంతంలో నమోదైన ఒక విచిత్రమైన, ఆశ్చర్యకరమైన సీసీటీవీ దృశ్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

సాధారణంగా అటవీ ప్రాంతాల నుంచి జనావాసాల్లోకి చొరబడే చిరుతలు కంటపడిన మూగజీవాలను వెంటనే వేటాడి చంపి తినేయడం సర్వసాధారణం.

అయితే అందుకు పూర్తి విరుద్ధంగా, ఒక చిరుతపులి కుక్కపిల్లను నోట కరుచుకున్నప్పటికీ దానికి ఎలాంటి హానీ చేయకుండా సురక్షితంగా వదిలేసి వెళ్లిన ఆశ్చర్యకర ఘటన స్థానికులను విస్మయానికి గురిచేస్తోంది.

పాల్ఘర్ జిల్లాలోని వంగావ్, భావ్డా పరిసర ప్రాంతాల్లో గత కొద్ది రోజులుగా చిరుతల సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ప్రాంతంలో ఇప్పటికే పలు పెంపుడు జంతువులను చిరుత చంపేయడంతో స్థానిక ప్రజలు, రైతులు తీవ్ర భయాందోళనల్లో గడుపుతున్నారు. ఈ క్రమంలో ఆగస్టు 30 అర్ధరాత్రి వేళ, భావ్డా ప్రాంతంలోని ప్రసిద్ధ గణపతి ఆలయం సమీపంలో కొన్ని కుక్కలు తిరుగుతున్నాయి.

ఆ సమయంలో అక్కడికి హఠాత్తుగా వచ్చిన ఒక చిరుతపులి ఆ కుక్కలను వెంటాడింది. చిరుతను చూసి భయపడిన పెద్ద కుక్కలు అక్కడి నుంచి పరుగులు తీసి తప్పించుకున్నాయి. కానీ వేగంగా పరిగెత్తలేక వెనకబడిపోయిన రెండు చిన్న కుక్కపిల్లల్లో ఒకదానిని ఆ చిరుతపులి నోటితో పట్టుకుంది.

చిక్కిన ఆహారాన్ని చిరుతపులి వెంటనే చంపేస్తుందని భావించినప్పటికీ, అది ఆ కుక్కపిల్లకు ఎలాంటి గాయం చేయకుండా సురక్షితంగా కిందకు వదిలేసి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆలయం వెలుపల అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డైన ఈ దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట దావానలంలా వ్యాపిస్తున్నాయి. అత్యంత క్రూరమైన అడవి మృగం తన నోటికి చిక్కిన ఆహారం పట్ల చూపిన ఈ 'దయ' నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

చిరుత చేసిన ఈ వింత ప్రవర్తన నెట్టింట ఆశ్చర్యాన్ని కలిగించినప్పటికీ, స్థానిక ప్రజల్లో మాత్రం భయం వీడలేదు. ఈ ప్రాంతంలో చిరుతల సంచారం నానాటికీ పెరుగుతుండటంతో తమ భద్రతను కాపాడాలని, అటవీశాఖ అధికారులు తక్షణమే స్పందించి ఆ చిరుతను బంధించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Newtelugunews.com