భారతదేశంలో ఇంధన వినియోగం రాష్ట్రాల వారీగా భారీ వ్యత్యాసాలను కలిగి ఉంది. కొన్ని ప్రాంతాలలో తలసరి పెట్రోల్ వినియోగం జాతీయ సగటు కంటే కొన్ని రెట్లు ఎక్కువగా నమోదైంది.
కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ పరిధిలోని పెట్రోలియం ప్లానింగ్ & అనాలిసిస్ సెల్ (PPAC) ఈ గణాంకాలను వెల్లడించింది. 2024-25 PPAC డేటా ప్రకారం, భారతదేశ సగటు రోజువారీ పెట్రోల్ వినియోగం ప్రతి 100 మందికి సుమారు 10.4 లీటర్లుగా ఉంది. అయితే, పర్యాటకం, పట్టణీకరణ మరియు రవాణా సాంద్రత ఆధారంగా రాష్ట్రాల మధ్య ఈ గణాంకాల్లో చాలా తేడాలు ఉన్నాయని NDTV నివేదించింది.
గోవా అగ్రస్థానం.. బీహార్ అట్టడుగున
ఈ జాబితాలో గోవా మొదటి స్థానంలో నిలిచింది. ఇక్కడ ప్రతి 100 మందికి రోజువారీ పెట్రోల్ వినియోగం 52.4 లీటర్లుగా నమోదైంది. ఇది జాతీయ సగటు కంటే దాదాపు ఐదు రెట్లు ఎక్కువ. ఆ తర్వాత పుదుచ్చేరి (41 లీటర్లు), చండీగఢ్ (37.8 లీటర్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. పర్యాటకుల రాక ఎక్కువగా ఉండటం, వాహనాల సాంద్రత మరియు అద్దె వాహనాల వినియోగం ఈ ప్రాంతాల్లో పెట్రోల్ వినియోగం పెరగడానికి ప్రధాన కారణాలని అధికారులు విశ్లేషిస్తున్నారు.
మరోవైపు, బీహార్ అత్యల్ప వినియోగంతో చివరి స్థానంలో ఉంది. ఇక్కడ ప్రతి 100 మందికి రోజుకు కేవలం 3.3 లీటర్ల పెట్రోల్ మాత్రమే వినియోగమవుతోంది. పశ్చిమ బెంగాల్ (5.1 లీటర్లు) కూడా తక్కువ వినియోగం ఉన్న రాష్ట్రాల జాబితాలో ఉంది.
డీజిల్ వినియోగం వేరేలా ఉంది
డీజిల్ విషయానికి వస్తే జాతీయ సగటు ప్రతి 100 మందికి రోజుకు 21 లీటర్లు. అయితే, అత్యధిక వినియోగం అండమాన్ నికోబార్ దీవులలో (144 లీటర్లు) నమోదైంది. ఆ తర్వాత లడఖ్ (111 లీటర్లు), పుదుచ్చేరి అగ్రస్థానంలో ఉన్నాయి. బీహార్‌లో అత్యల్పంగా 6 లీటర్లు, ఢిల్లీలో 8 లీటర్ల డీజిల్ వినియోగం నమోదైంది.
ఇంధన ధరలు పెరిగే అవకాశం
పశ్చిమ ఆసియా (West Asia) సంక్షోభం ఇలాగే కొనసాగితే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచక తప్పకపోవచ్చని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా బుధవారం తెలిపారు. హార్ముజ్ జలసంధి దిగ్బంధనం కారణంగా అంతర్జాతీయంగా సరఫరా దెబ్బతిని ధరలపై ఒత్తిడి పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు.
దీనిని దృష్టిలో ఉంచుకుని, విదేశీ మార్పిడి నిల్వలను ఆదా చేసేందుకు పౌరులు ఇంధన వినియోగాన్ని తగ్గించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం పిలుపునిచ్చారు. సాధ్యమైనంత వరకు మెట్రో రైళ్లు, ఎలక్ట్రిక్ వాహనాలు ఉపయోగించాలని, కార్‌పూలింగ్ మరియు వర్క్ ఫ్రమ్ హోమ్ (WFH) వంటి చర్యలను పాటించాలని ఆయన సూచించారు.

