వాషింగ్టన్: మధ్యప్రాచ్యంలో అమెరికా సాగిస్తున్న యుద్ధం 5వ వారంలోకి ప్రవేశించింది. ఈ యుద్ధంపై అమెరికాలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న తరుణంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరకాటంలో పడ్డారు.
ఈ నేపథ్యంలో, ఇరాన్ యుద్ధంపై ట్రంప్ రేపు ఉదయం దేశ ప్రజలను ఉద్దేశించి అత్యంత కీలక ప్రసంగం చేయనున్నట్లు వైట్ హౌస్ ప్రకటించింది.
గత ఫిబ్రవరి 28న ఇరాన్ పై అమెరికా తన దాడులను ప్రారంభించింది. ఇరాన్ లోని వివిధ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ సహా పలువురు కీలక నేతలు మరణించారు. అయినప్పటికీ, లొంగిపోవడానికి నిరాకరిస్తున్న ఇరాన్ నిరంతరం ప్రతిదాడులు చేస్తోంది. దీంతో యుద్ధం ఐదో వారానికి చేరుకోవడమే కాకుండా, అమెరికాకు ఆర్థికంగా, రాజకీయంగా పెను సవాలుగా మారింది.
అత్యంత కీలక ప్రకటన
ఇరాన్ ఘర్షణల నేపథ్యంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 9 గంటలకు (భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం 6:30 గంటలకు) జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. వైట్ హౌస్ ప్రతినిధి కరోలిన్ లీవిట్ ఈ విషయాన్ని ధృవీకరిస్తూ, "రేపు రాత్రి 9 గంటలకు ఇరాన్ పై ట్రంప్ ఒక ముఖ్యమైన జాతీయ ప్రసంగం చేయబోతున్నారు, సిద్ధంగా ఉండండి" అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ప్రజల ఆగ్రహం
అమెరికా-ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య ఘర్షణ రెండో నెలలోకి ప్రవేశిస్తోంది. అయితే ఈ యుద్ధానికి అమెరికాలోనే మద్దతు లభించడం లేదు. ట్రంప్ అనవసరంగా ఈ యుద్ధాన్ని కొనసాగిస్తున్నారని మెజారిటీ అమెరికన్లు భావిస్తున్నారు. ఇటీవల వెలువడిన సర్వే ఫలితాల్లో కూడా ట్రంప్ పై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తేలింది.
అదే సమయంలో, ఇరాన్ వద్ద ఉన్న 'సంవర్థిత యురేనియం' (Enriched Uranium) స్వాధీనం చేసుకోవడానికి అమెరికా సైనికులను ఇరాన్ సరిహద్దుల్లోకి పంపే ప్రణాళికను కూడా ట్రంప్ పరిశీలిస్తున్నారు. ఒకవేళ ఈ ఆపరేషన్ మొదలైతే యుద్ధం మరిన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది. రేడియోధార్మిక పదార్థాలను వెలికితీయడానికి ప్రత్యేక బలగాలను రంగంలోకి దించవచ్చు. అయితే ఇరాన్ భూభాగంలోకి అడుగుపెట్టే అమెరికా దళాలకు డ్రోన్లు మరియు క్షిపణి దాడుల ముప్పు పొంచి ఉంది. ప్రజల వ్యతిరేకత మధ్య ట్రంప్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్నది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేపుతోంది.
దాడుల తీవ్రత
ఇదిలా ఉండగా, మంగళవారం అమెరికా సైన్యం ఇరాన్ లోని ప్రధాన అణు కేంద్రం ఉన్న నగరంపై దాడులు చేసింది. గత జూన్ నెలలో అమెరికాకు చెందిన B-2 బాంబర్లు మరియు జలాంతర్గాముల ద్వారా ఇస్ఫహాన్ అణు కేంద్రంతో సహా మూడు కేంద్రాలపై దాడులు జరిగాయి. ఇరాన్ వద్ద ఉన్న సంవర్థిత యురేనియం గరిష్టంగా ఇక్కడే ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇరాన్ వాదన ఏంటి?
మరోవైపు, ఇరాన్ అధికారులతో చర్చలు జరుగుతున్నాయని, అవి సానుకూలంగా సాగుతున్నాయని ట్రంప్ చెబుతున్నారు. అయితే, ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ ఈ మాటలను పూర్తిగా ఖండించారు. ఘర్షణ మొదలైనప్పటి నుండి ట్రంప్ యంత్రాంగంతో ఎటువంటి చర్చలు జరగలేదని ఆయన స్పష్టం చేశారు. అయితే, అమెరికా మరో దేశం ద్వారా చర్చల కోసం ప్రతిపాదన పంపిందని మాత్రం ఇరాన్ పేర్కొంది.

