ఫారో దీవుల తీరంలో వందలాది తిమింగలాలు, డాల్ఫిన్లు దారుణంగా హత్యకు గురయ్యాయి. ప్రతి ఏటా జరిగే ఈ వేటలో భాగంగా సముద్రపు నీరు రక్తం రంగులోకి మారిపోయింది.
స్థానికంగా 'ది గ్రైండ్' (the grind) అని పిలిచే ఈ వేటలో భాగంగా, గత వారం 700కు పైగా జంతువులను తీరానికి తరలించి, కొక్కేలు మరియు పొడవైన కత్తులతో చంపేశారు.
భీతావహ దృశ్యాలు: ఈ వేటలో జంతువుల వెన్నెముకను త్వరగా తెంచి, బాధను తగ్గించేందుకు ఉపయోగించాల్సిన ప్రత్యేక పరికరాలు లేకపోవడంతో, జంతువులు తీవ్ర చిత్రహింసలకు గురయ్యాయి. 'సీ షెపర్డ్' అనే సంస్థ లెక్కల ప్రకారం, టోర్షావ్న్‌లో 402 పైలట్ తిమింగలాలు, నాలుగు బాటిల్‌నోస్ డాల్ఫిన్లు, స్కాలాబోట్నర్‌లో 168 వైట్-సైడెడ్ డాల్ఫిన్లు, హ్వాల్విక్‌లో 132 వైట్-సైడెడ్ డాల్ఫిన్లు.. మొత్తం 706 జంతువులు చనిపోయాయి. మే 27న సముద్ర తీరం అంతా రక్తం రంగులో మారిపోగా, పదుల సంఖ్యలో కళేబరాలు బీచ్‌లలో పడి ఉండటం చూసేవారికి కంటికి కడుపు చెక్కలయ్యేలా ఉంది. చిన్న పిల్లలు కూడా ఈ దారుణాన్ని చూస్తుండటం గమనార్హం.
వివాదం ఎందుకు? ఈ 'గ్రైండ్రాప్' వేట శతాబ్దాలుగా డెన్మార్క్ ఆధీనంలోని ఈ దీవుల్లో జరుగుతోంది. తిమింగలాల వేట అనేది ఆహారాన్ని సేకరించడానికి ఒక స్థిరమైన మార్గమని, ఇది స్థానిక సంస్కృతిలో భాగమని స్థానికులు వాదిస్తారు. అయితే, ఈ సంవత్సరం ఫారో పార్లమెంటు, జంతు సంక్షేమ చట్టాల కంటే స్థానిక వేట నియమాలకే ప్రాధాన్యత ఇస్తూ తీర్మానం చేయడంపై అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నిరసనలు: ప్రపంచవ్యాప్తంగా జంతు హక్కుల కార్యకర్తలు, 'పీటా' (PETA) వంటి సంస్థలు ఈ ఊచకోతను తక్షణమే నిషేధించాలని డిమాండ్ చేస్తున్నాయి. తిమింగలాలు, డాల్ఫిన్లు అత్యంత తెలివైన జంతువులని, అవి మనుషుల వలె నొప్పిని, భయాన్ని అనుభవిస్తాయని, అటువంటి వాటిని క్రూరంగా చంపడం అమానుషమని వారు ఆరోపిస్తున్నారు.

