ఇరాన్ ఉరిశిక్షలు: ఇరాన్ మరియు అమెరికా-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మొదలైనప్పటి నుండి మధ్యప్రాచ్యంలో పరిస్థితులు అత్యంత ఆందోళనకరంగా మారాయి. ఐక్యరాజ్యసమితి (UN) తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.
ఇటీవలి ఘర్షణల తర్వాత ఇరాన్ ఇప్పటివరకు 21 మందికి ఉరిశిక్షలు అమలు చేసినట్లు ఈ నివేదిక వెల్లడించింది.
అంతేకాకుండా, భద్రత పేరుతో 4,000 మందికి పైగా వ్యక్తులను జైళ్లలో బంధించారు. శాంతి చర్చలకు ఇరాన్ నిరాకరిస్తుండటంతో ఉద్రిక్తతలు తగ్గకపోగా మరింత పెరుగుతున్నాయి.
21 మందికి మరణశిక్ష ఎందుకు విధించారు? అల్ జజీరా మరియు ఐక్యరాజ్యసమితి నివేదికల ప్రకారం.. ఈ శిక్షల వెనుక వివిధ కారణాలు ఉన్నాయి. జనవరి 2026లో జరిగిన భారీ నిరసనల్లో పాల్గొన్నందుకు 9 మందికి ఉరిశిక్ష విధించగా, ప్రతిపక్ష బృందాలతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపై 10 మందికి, గూఢచారి కార్యకలాపాలకు పాల్పడ్డారన్న నెపంతో ఇద్దరికి ఉరిశిక్ష అమలు చేశారు. దేశ భద్రత కోసమే ఈ చర్యలు తీసుకున్నామని ఇరాన్ ప్రభుత్వం వాదిస్తుండగా, మానవ హక్కుల సంఘాలు దీనిని క్రూరమైన అణచివేతగా అభివర్ణిస్తున్నాయి.
అమానవీయ స్థితిలో 4,000 మంది ఖైదీలు యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు 4,000 మందికి పైగా వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. జైళ్లలో బంధించిన వీరి పట్ల అమానవీయంగా ప్రవర్తిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఖైదీలను మానసికంగా, శారీరకగా హింసిస్తూ బలవంతంగా నేరాలను ఒప్పిస్తున్నారని UN తెలిపింది. చాలా మంది జైళ్ల నుండి కనిపించకుండా పోవడంతో వారి కుటుంబాల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
UN చీఫ్ హెచ్చరిక మానవ హక్కుల విభాగం అధిపతి వోల్కర్ టర్క్ ఇరాన్ చర్యలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధ బాధల్లో ఉన్న ప్రజలపై ఇలాంటి క్రూరత్వం చూపడం తగదని ఆయన అన్నారు. ఉరిశిక్షలను వెంటనే నిలిపివేయాలని, అక్రమంగా అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని ఇరాన్‌ను కోరారు. న్యాయ ప్రక్రియను అనుసరించాలని, తొందరపాటు నిర్ణయాలతో శిక్షలు వేయకూడదని ఆయన డిమాండ్ చేశారు.
ఇరాన్-అమెరికా మధ్య పెరుగుతున్న ఘర్షణ ఫిబ్రవరి చివరలో అమెరికా-ఇజ్రాయెల్ ఉమ్మడి చర్యల తర్వాత పరిస్థితి మరింత విషమించింది. అమెరికా హెచ్చరికలకు ఇరాన్ ఏమాత్రం తలొగ్గడం లేదు. శాంతి చర్చల ప్రతిపాదనలను కూడా ఇరాన్ తిరస్కరించింది. చైనా తర్వాత ప్రపంచంలోనే అత్యధికంగా ఉరిశిక్షలు అమలు చేస్తున్న దేశంగా ఇరాన్ నిలుస్తోంది, ఇది ప్రపంచ వేదికపై ఆ దేశ ప్రతిష్ఠను మరింత దెబ్బతీస్తోంది.

