Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
"మళ్లీ ఒళ్లు గగుర్పొడిచే ప్రమాదం..!" మోక్ష మార్గం సొరంగంలో ఇరుక్కుపోయిన మహిళ.. ప్రాణాల కోసం విలవిల్లాడిన దృశ్యం.. ఇకపై ఇలాంటి పనులు చేయకండి..!!

"మళ్లీ ఒళ్లు గగుర్పొడిచే ప్రమాదం..!" మోక్ష మార్గం సొరంగంలో ఇరుక్కుపోయిన మహిళ.. ప్రాణాల కోసం విలవిల్లాడిన దృశ్యం.. ఇకపై ఇలాంటి పనులు చేయకండి..!!

తిరువణ్ణామలై అరుణాచలేశ్వర ఆలయ గిరిప్రదక్షిణ మార్గంలోని 'ఇడుక్కు వినాయకుడి' ఆలయం సమీపంలో ఉన్న 'మోక్ష మార్గం' అనే అత్యంత ఇరుకైన రాతి మార్గంలో ఓ మహిళా భక్తురాలు ఇరుక్కుపోయిన వీడియో నెట్టింట తీవ్ర కలకలం రేపుతోంది.

ఆ రాళ్ల సందులో ఇరుక్కుపోయిన ఆ మహిళ కదలలేక, ఊపిరాడక తీవ్రంగా అవస్థలు పడగా.. అక్కడున్న ఇతర భక్తులు శ్రమించి ఆమెను సురక్షితంగా బయటకు లాగారు.

ఇంతకుముందు జూలై 24న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మణికంఠ (36) అనే భక్తుడు కూడా ఇదే ఇరుకైన రాతి సందు నుంచి వెళ్లేందుకు ప్రయత్నించి లోపల ఇరుక్కుపోయారు. అగ్నిమాపక సిబ్బంది ఆయన్ను రక్షించి ఆసుపత్రికి తరలించినప్పటికీ, చికిత్స ఫలించక ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన నేపథ్యంలో.. కొన్ని నెలల క్రితం ఓ మహిళ అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడిన ఈ పాత వీడియో ప్రస్తుతం మళ్లీ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

అరుణాచల కొండ చుట్టూ ఉండే 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణ మార్గంలో ఉన్న ఈ ఇడుక్కు వినాయకుడి ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. ఈ రాతి సందు గుండా శరీరాన్ని ఒంచి దూరి వెళ్తే సర్వపాపాలు తొలగిపోయి, జనన మరణ చక్రం నుంచి విముక్తినిచ్చే 'మోక్షం' లభిస్తుందని భక్తులు ప్రగాఢంగా నమ్ముతుంటారు.

అయితే, ఇలాంటి ఇరుకైన సందుల గుండా వెళ్లడం వల్ల మోక్షం వస్తుందని ఎలాంటి పవిత్ర గ్రంథాలలో గానీ, ఆధ్యాత్మిక సిద్ధాంతాలలో గానీ చెప్పలేదని.. ఇదంతా కేవలం స్థానిక నమ్మకాల ఆధారంగా పుట్టుకొచ్చిందేనని పండితులు, పరిశోధకులు చెబుతున్నారు. శాస్త్రీయత లేని ఇటువంటి ప్రమాదకర మూఢనమ్మకాల వల్లే వరుసగా ప్రాణాంతక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.

కాబట్టి, భవిష్యత్తులో ఇలాంటి ప్రాణాంతక ఘటనలు పునరావృతం కాకుండా ఆలయ యాజమాన్యం, ప్రభుత్వం తక్షణమే పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు. ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయడం, ఇరుకైన మార్గాల్లోకి వెళ్లకుండా కట్టడి చేయడం మరియు అక్కడ భద్రతా సిబ్బందిని నియమించడం అత్యవసరమని స్పష్టం చేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Newtelugunews.com