కరీంనగర్: నాలుగేళ్ల వయసున్న కన్న కూతుళ్లను తండ్రి మరియు అతని కుటుంబ సభ్యులు కలిసి అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటనలో వెలుగులోకి వస్తున్న విషయాలు సభ్య సమాజాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి.
తెలంగాణలోని కరీంనగర్ జిల్లా జూబ్లీనగర్ గ్రామంలో ఈ జంట హత్యలు జరిగాయి. నాలుగేళ్ల గీతాన్విక, గీతాంషి అనే కవల పిల్లలను తండ్రి శ్రీశైలం (28) బావిలో పడేసి చంపేశాడు. తనకు మగపిల్లవాడు కావాలనే కోరిక ఉండటం, ఆడపిల్లలు పుట్టారనే కక్షతోనే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
నెలల తరబడి సాగిన కుట్ర
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇది ఆవేశంలో చేసిన హత్య కాదు, నెలల తరబడి పక్కాగా వేసిన ప్లాన్. ఎం.కామ్ చదివి మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న శ్రీశైలం, తన తల్లిదండ్రులు అశోక్, లావణ్య మరియు సోదరుడు రాకేష్‌తో కలిసి ఈ హత్యకు కుట్ర పన్నాడు. 2020లో వివాహం చేసుకున్న శ్రీశైలంకు మొదటి నుంచీ మగపిల్లాడే కావాలనే పట్టుదల ఉండేది. 2022లో కవల ఆడపిల్లలు పుట్టినప్పుడు కనీసం ఆసుపత్రికి వెళ్లి వారి ముఖం చూడటానికి కూడా అతను ఇష్టపడలేదని పోలీసులు తెలిపారు.
ఆస్తి పోతుందనే ఆవేదన
సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎ. నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. "తనకు ఉన్న సుమారు 2 కోట్ల రూపాయల ఆస్తి ఆడపిల్లల పెళ్లిళ్లకు ఖర్చయిపోతుందని, తను రిక్తహస్తాలతో మిగిలిపోతాననే భయం శ్రీశైలంలో ఉంది. అతని తల్లిదండ్రులు కూడా ఇదే విషయాన్ని నూరిపోశారు" అని తెలిపారు. ఏప్రిల్ 3వ తేదీ మధ్యాహ్నం ఈ ఘోరం జరిగింది. భార్య మౌనికను ఇంట్లో మటన్ కర్రీ వండమని చెప్పి, పిల్లలను ఆడించుకుంటానని చెప్పి పొలం దగ్గరికి తీసుకెళ్లాడు.
అక్కడ ఎవరూ లేని సమయం చూసి.. మొదట గీతాన్వికను బావిలోకి తోసేశాడు. ఆ చిన్నారి నీటిలో మునిగి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. రెండో కూతురు గీతాంషి నీటిలో పడి ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతుంటే, శ్రీశైలం బావిలోకి దిగి ఆమెను స్వయంగా తన చేతులతో నీటిలో అదిమి పట్టి ఊపిరాడకుండా చేసి చంపేశాడు.
డ్రామా ఆడి దొరికిపోయాడు
హత్య తర్వాత ఏమీ తెలియనట్లుగా, గడ్డి కోయడానికి వెళ్లినప్పుడు పిల్లలు ప్రమాదవశాత్తు బావిలో పడిపోయారని గ్రామస్థులను, భార్యను నమ్మించే ప్రయత్నం చేశాడు. కానీ అతని మాటల్లో తేడాలను గమనించిన గ్రామస్థులు అతడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అక్కడ నుంచి తప్పించుకుని బంధువుల ఇంట్లో దాక్కున్న శ్రీశైలంను పోలీసులు అరెస్ట్ చేశారు. కేవలం ఆడపిల్లలు అనే కారణంతో ఇంతటి పాశవిక హత్యలు చేయడం అత్యంత దారుణమని పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో శ్రీశైలంతో పాటు అతని తల్లిదండ్రులు, సోదరుడిని కూడా పోలీసులు కటకటాల్లోకి నెట్టారు.

