కొంతమందికి యూపీఎస్సీ (UPSC) పరీక్ష పాస్ అవ్వడం చాలా కష్టమైన పని, మరికొంతమందికి ఇది సాధ్యమే. ఎంతోమంది 4-5 ప్రయత్నాలు చేసినా విజయం సాధించలేరు, కానీ మరికొందరు తమ మొదటి లేదా రెండో ప్రయత్నంలోనే సక్సెస్ అవుతారు.
అసాధారణ ప్రతిభ గల వారు కూడా ఉంటారు, వీరు రెండు, మూడు సార్లు యూపీఎస్సీని క్రాక్ చేస్తారు. రాజస్థాన్‌కు చెందిన అనుకృతి శర్మ అటువంటి అసాధారణ ప్రతిభావంతుల్లో ఒకరు. ఆమె ఒకసారి కాదు, రెండుసార్లు యూపీఎస్సీని క్రాక్ చేసి, ప్రస్తుతం ఐపీఎస్ అధికారిగా ఉత్తరప్రదేశ్‌లో సేవలందిస్తున్నారు.
ఐపీఎస్ అనుకృతి శర్మ సక్సెస్ స్టోరీ: అనుకృతి శర్మ రాజస్థాన్‌లోని జైపూర్‌లో విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఆమె తన బ్యాచిలర్ ఆఫ్ సిద్ధ మెడిసిన్ అండ్ సర్జరీ (BSMS) డిగ్రీని పూర్తి చేసిన తర్వాత, కోల్‌కతాలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌కి వెళ్లారు. 2012లో టెక్సాస్‌లోని రైస్ యూనివర్శిటీలో వోల్కనో రీసెర్చ్ (Volcano Research) కి సంబంధించిన పీహెచ్‌డీ ప్రోగ్రాంకు ఆమె ఎంపికయ్యారు. తన పరిశోధన సమయంలోనే ఆమెకు నాసా (NASA) నుండి భారీ ప్యాకేజీతో కూడిన ఉద్యోగ అవకాశం లభించింది.
నాసా ఉద్యోగాన్ని వదులుకొని.. శాస్త్రవేత్తగా కెరీర్ బాగుంటుందని ఉపాధ్యాయులు సూచించినప్పటికీ, అనుకృతి ఆ అవకాశాన్ని సున్నితంగా తిరస్కరించి, స్వదేశానికి తిరిగి వచ్చి సివిల్ సర్వీసెస్ పరీక్షల కోసం సిద్ధమవ్వాలని నిర్ణయించుకున్నారు. తన మొదటి రెండు ప్రయత్నాల్లో విఫలమైనప్పటికీ, పట్టుదలతో 2018లో తన నాలుగో ప్రయత్నంలో యూపీఎస్సీ పరీక్షలో విజయం సాధించారు. ఆలిండియా 355వ ర్యాంకు సాధించి, ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (IRS) అధికారిగా ఎంపికయ్యారు.
ఐదో ప్రయత్నంలో ఐపీఎస్ (IPS) అధికారిగా.. ఐఆర్ఎస్ అధికారిగా ఎంపికైనప్పటికీ, తన లక్ష్యం అది కాదని భావించిన అనుకృతి, 2020లో ఐదోసారి మళ్లీ యూపీఎస్సీ పరీక్ష రాశారు. ఈసారి 138వ ర్యాంకు సాధించి ఐపీఎస్ (IPS) అధికారిగా విజయం సాధించారు. తన విజయంలో తల్లిదండ్రులతో పాటు, తన భర్త పాత్ర కూడా ఎంతో ఉందని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె ఉత్తరప్రదేశ్‌లో ఐపీఎస్ అధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

