Dailyhunt
"యుద్ధం వల్ల అమెరికాకు వచ్చే లాభమేంటి?" ఇరాన్ అధ్యక్షుడు సంధించిన ప్రశ్న.. ప్రపంచ రాజకీయాల్లో అసలు గుట్టు ఇదే!

"యుద్ధం వల్ల అమెరికాకు వచ్చే లాభమేంటి?" ఇరాన్ అధ్యక్షుడు సంధించిన ప్రశ్న.. ప్రపంచ రాజకీయాల్లో అసలు గుట్టు ఇదే!

ధ్యప్రాచ్యంలో యుద్ధం ఐదో వారంలోకి ప్రవేశించిన తరుణంలో, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ అమెరికా ప్రజలకు ఒక లేఖ రాశారు. అందులో ఆయన అమెరికన్లను పలు ప్రశ్నలు అడిగారు.

ముఖ్యంగా ఇజ్రాయెల్ ప్రయోజనాల కోసమే అమెరికా ఈ యుద్ధంలో పాల్గొంటోందని, దీనివల్ల అమెరికాకు కానీ, అక్కడి ప్రజలకు కానీ ఎటువంటి లాభం లేదని ఆయన విమర్శించారు.

గత ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ ఉమ్మడి దాడులతో ప్రారంభమైన ఈ యుద్ధం అంతర్జాతీయ స్థాయిలో గందరగోళాన్ని సృష్టించింది. ఈ పోరాటం ఒకటి రెండు వారాల్లోనే ముగిసిపోతుందని అందరూ భావించినప్పటికీ, నెల రోజులు దాటినా ఇంకా కొనసాగుతూనే ఉంది. దీనివల్ల ప్రాణ, ఆస్తి నష్టం అంతకంతకూ పెరుగుతోంది.

ఇరాన్ అధ్యక్షుడి ప్రశ్నలు: యుద్ధాన్ని ముగించే దిశగా ఇరాన్‌తో చర్చలు జరుగుతున్నాయని, అవి సానుకూలంగా ఉన్నాయని ట్రంప్ పేర్కొన్నప్పటికీ, ఇరాన్ మాత్రం ఆ వార్తలను ఖండించింది. యుద్ధం మొదలైనప్పటి నుండి తాము ఎటువంటి చర్చల్లోనూ పాల్గొనలేదని స్పష్టం చేస్తూనే, అధ్యక్షుడు పెజెష్కియాన్ ఈ లేఖను విడుదల చేశారు.

ఇజ్రాయెల్ మాటే వింటున్న ట్రంప్: మధ్యప్రాచ్యంలో ప్రస్తుతం ట్రంప్ సాగిస్తున్న ఈ దాడులు నిజంగా అమెరికా ప్రయోజనాల కోసమేనా? అని ఆయన ప్రశ్నించారు. అమెరికా యుద్ధ నేరాలకు పాల్పడుతోందని, కేవలం ఇజ్రాయెల్ చెప్పినట్లుగా ట్రంప్ నడుచుకుంటున్నారని ఆరోపించారు. తన సోషల్ మీడియా ఖాతాలో ఈ లేఖను పోస్ట్ చేసిన ఆయన మరిన్ని ప్రశ్నలను సంధించారు.

"ఇరాన్ యొక్క ఇంధన మరియు పారిశ్రామిక కేంద్రాలతో సహా కీలకమైన మౌలిక సదుపాయాలపై దాడులు చేయడం సైనిక చర్య ఎలా అవుతుంది? ఇది నేరుగా ఇరాన్ ప్రజలను లక్ష్యంగా చేసుకుని చేస్తున్న దాడి. ఇది కేవలం యుద్ధ నేరం మాత్రమే కాదు, ఇరాన్ వెలుపల కూడా దీర్ఘకాలిక ప్రభావాలను చూపుతుంది. ఇటువంటి చర్యలు అంతర్జాతీయంగా అస్థిరతను కలిగిస్తాయి, మరణాల సంఖ్యను పెంచుతాయి మరియు ఆర్థిక వ్యవస్థలను చిన్నాభిన్నం చేస్తాయి. ఇది యుద్ధం ఏళ్ల తరబడి కొనసాగేలా చేస్తుంది." అని ఆయన పేర్కొన్నారు.

అమెరికాకు ఏం లాభం? "నేను అమెరికా ప్రజలను ఒక్కటే అడగాలనుకుంటున్నాను. అమెరికా ప్రయోజనాల కోసమే ఈ యుద్ధం చేస్తున్నామని ట్రంప్ చెబుతున్నారు. కానీ నిజంగా దీనివల్ల అమెరికన్లకు వచ్చే లాభమేంటి? ఈ యుద్ధాన్ని సమర్థించుకోవడానికి ఇరాన్ నుండి మీకు ఏదైనా ముప్పు ఉందా? కేవలం ఇజ్రాయెల్ ప్రతినిధిగా, వారి మాట వినే అమెరికా ఈ యుద్ధంలో పాల్గొంటోంది. మరి 'అమెరికా ఫస్ట్' అనే నినాదం ఈ యుద్ధంలో ఎక్కడ ఉంది?" అని ఆయన నిలదీశారు.

మీరు మా శత్రువులు కాదు: సాధారణ అమెరికన్లు ఇరాన్‌కు శత్రువులు కారని ఆయన స్పష్టం చేశారు. "ఘర్షణ కావాలా లేదా సత్సంబంధాలు కావాలా అని తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది. ఈ నిర్ణయమే భవిష్యత్తు తరాల గమనాన్ని మారుస్తుంది. గతంలో ఇరాన్‌పై ఎందరో దాడులు చేశారు, కానీ వారంతా చరిత్రలో కళంకితులుగా మిగిలిపోయారు. ఇరాన్ మాత్రం నేటికీ ఆత్మగౌరవంతో గర్వంగా నిలబడే ఉంది" అని పెజెష్కియాన్ తన లేఖను ముగించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Newtelugunews.com