Tuesday, 29 Dec, 4.11 pm NTV Telugu

హోమ్
2020 రౌండప్: విషాదాంతాలు

ఎప్పటిలానే ఈ యేడాది కూడా చిత్రసీమను వీడి పలువురు ప్రముఖులు దివికేగారు. వయోభారంతో తనువు చాలించిన వారు కొందరైతే, కరోనా మహమ్మారి బారిన పడి కన్నుమూసిన వారు మరికొందరు. మరీ ముఖ్యంగా ఈసారి సినీ సంగీత కుటుంబానికి తీరని దుఃఖం చేకూరింది. గాన గాంధర్వుడి ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం మొదలు కొని సంగీత దర్శకులు రాజన్, వాజిద్ తో పాటు సీనియర్ లిరిక్ రైటర్స్ సైతం తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. బాధాకరం ఏమంటే... ఎంతోమంది బుల్లి తెర నటీనటులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇక బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య బాలీవుడ్ ను కుదిపేసింది.

జనవరి

6వ తేదీ ప్రముఖ సినీ, నాటక, కథా రచయిత ఆదివిష్ణు (80) అనారోగ్యంతో కన్నుమూశారు. జంధ్యాల దర్శకత్వం వహించిన 'అహ నా పెళ్ళంట, వివాహ భోజనంబు, జయమ్ము నిశ్చయమ్మురా, ప్రేమా జిందాబాద్' వంటి 40 చిత్రాలకు ఆయన రచన చేశారు. 'సుందరి - సుబ్బారావు' చిత్రానికి బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ గా నంది అవార్డు అందుకున్నారు.

13వ తేదీ ప్రముఖ కథారచయిత, ఆకాశవాణి విశ్రాంత ఉద్యోగి దివి వెంకట్రామయ్య హఠాన్మరణం చెందారు. 'బంగారు కలలు' చిత్రానికి సహ రచయితగా వ్యవహరించిన ఆయన 'పంతులమ్మ' చిత్రానికి మాటలు రాశారు.

28వ తేదీ 'మను', 'ఫలక్ నుమా దాస్' తదితర చిత్రాల్లో నటించిన జాన్ కొట్టాలీ గుండెపోటుతో కన్నుమూశారు.

ఫిబ్రవరి

11వ తేదీ సీనియర్ పాత్రికేయులు, బహు గ్రంధకర్త పసుపులేటి రామారావు కన్నుమూశారు.

15వ తేదీ చిరంజీవి తొలి చిత్రం 'పునాదిరాళ్ళు' దర్శకుడు గూడపాటి రాజ్ కుమార్ కన్నుమూశారు. చిరంజీవికి ఇది తొలి చిత్రమే అయినా... 7వ సినిమాగా విడుదలైంది. రాజ్ కుమార్ ఆ తర్వాత 'ఈ సమాజం మాకొద్దు', 'మన వూరి గాంధీ', 'ఇంకా తెలవారదేమి', 'తాండవకృష్ణ తారంగం', 'మా సిరిమల్లి' చిత్రాలు రూపొందించారు.

మార్చి

8వ తేదీ 'టు టౌన్ రౌడీ, పవిత్ర బంధం, పెళ్ళి చేసుకుందాం, ఘర్షణ' వంటి చిత్రాలను నిర్మించిన వారిలో ఒకరైన చామర్తి వెంకట్రాజు (72) చెన్నైలో అనారోగ్యంతో కన్నుమూశారు. జి. శివరాజుతో కలిసి ఆయన 'గూండా రాజ్యం, నియంత, అహంకారి, ఆదర్శం, ఆరంభం' చిత్రాలను నిర్మించారు. 'శ్రీమతి వెళ్లొస్తా, చక్రం' కూడా ఆయన నిర్మించిన సినిమాలే!

17 వ తేదీ సీనియర్ నటుడు ఇంతియాజ్ ఖాన్ (77) ముంబైలో కన్నుమూశారు. అంజాద్ ఖాన్ కు సోదరుడైన ఇంతియాజ్ రంగస్థలం నుండి చిత్రసీమలోకి అడుగుపెట్టారు. ప్రముఖ బుల్లితెర నటి కృతికా దేశాయ్ ఈయన భార్య.

22వ తేదీ ప్రముఖ దర్శకుడు విసు (72) అనారోగ్యంతో చెన్నయ్ లో కన్నుమూశారు. బాలచందర్ శిష్యుడైన విసు 'ఆడదే ఆధారం'తో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం. 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' చిత్రానికీ ఆయన దర్శకత్వం వహించారు.

25 వ తేదీ బాలీవుడ్ సీనియర్ నటి నిమ్మి (88) శ్వాస సంబంధ వ్యాధితో ముంబైలో కన్నుమూశారు. ఆమె రాజ్ కపూర్ 'బర్సాత్' మూవీతో వెండితెరకు పరిచయం అయ్యారు. ఆమె అసలు పేరు నవాబ్ బానో. పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషించిన నిమ్మి 1965లో స్క్రిప్ట్ రైటర్ అలీ రాజాను పెళ్ళాడారు.

28 వ తేదీ ప్రముఖ దర్శకుడు సుకుమార్ స్నేహితుడు, 'అమరం అఖిలం ప్రేమ' నిర్మాత వి.ఇ.వి.కె.డి.ఎస్. ప్రసాద్ గుండెపోటుతో మరణించారు.

ఏప్రిల్

కరోనా కారణంగా కొద్ది రోజుల క్రితం హాలీవుడ్ నటుడు మార్క్ బ్లమ్ కన్నుమూశారు.

1వ తేదీ 'స్టార్ వార్స్' ఫేమ్ ఆండ్రూ జాక్ (76) సైతం కరోనాతో తనువు చాలించారు.

6 వ తేదీ బుల్లితెర నటి, దేవదాసు కనకాల కుమార్తె శ్రీలక్ష్మి (45) క్యాన్సర్ తో కన్నుమూశారు. 'రాజశేఖర చరితము' సీరియల్ తో బుల్లితెరలోకి అడుగుపెట్టిన శ్రీలక్ష్మి 'అగ్నిపూలు, ఆకాశగంగ, రుతురాగాలు' వంటి సీరియల్స్ లో నటించారు.

14 వ తేదీ సుప్రసిద్థ రచయిత, సి. ఎస్. రావు (85) హైదరాబాద్ లో తుది శ్వాస విడిచారు. 'ప్రాణం ఖరీదు, కుక్కకాటుకు చెప్పు దెబ్బ, ఊరుమ్మడి బతుకులు, నాయకుడు - వినాయకుడు, మల్లెమొగ్గలు' చిత్రాలకు ఈయన కథను అందించారు. 'సరదా రాముడు, సొమ్మొకడిది సోకొకడిది' చిత్రాలలో నటించారు.

16 వ తేదీ టామ్ అండ్ జెర్రీ చిత్రాల రచయిత, దర్శకుడు జీన్ డయిచ్ (96) ఫ్రాగ్ లో చనిపోయారు. జీన్ 1960లో రూపొందించిన 'మున్రో' షార్ట్ షార్ట్ ఫిల్మ్ ఆస్కార్ అవార్డును గెలుచుకుంది.

18 వ తేదీ తొలితరం సెలబ్రిటీ జర్నలిస్ట్, లేడీ ఎడిటర్ గుల్షన్ యులింగ్ (92) కరోనా కారణంగా ఇంగ్లాడ్ లో చనిపోయారు.

29 వ తేదీ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ (53) అనారోగ్యంతో ముంబైలో కన్నుమూశారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ డ్రామాలో శిక్షణ పొందిన ఆయన 'సలామ్ బొంబే'లో నటించారు. 'పాన్ సింగ్ తోమార్' చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు. 2011లో పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యారు. తెలుగులో 'సైనికుడు' చిత్రంలో నటించారు.

30 వ తేదీ రాజ్ కపూర్ తనయుడు, ప్రముఖ నటుడు రిషి కపూర్ (67) కాన్సర్ తో చనిపోయారు. 'మేరా నామ్ జోకర్' చిత్రంలో నటనకు గానూ ఉత్తమ బాలనటుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు. 1973లో 'బాబీ'తో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. నటి నీతూసింగ్ ను వివాహం చేసుకున్నారు. రణబీర్ సింగ్ వీరి కుమారుడు.

మే

15 వ తేదీ పలు టీవీ కార్యక్రమాలను నిర్వహించిన మన్ మీత్ గ్రేవాల్ (32) నవీ ముంబైలోని తన ఇంటిలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదే రోజున అమెరికన్ నటుడు, కమెడియన్, రచయిత ఫెడ్రిక్ చార్లెస్ విల్లాడ్ (86) అనారోగ్యంతో లాస్ ఏంజెల్స్ లో కన్నుమూశారు.

22 వ తేదీ సీనియర్ నటీమణి వాణిశ్రీ కుమారుడు అభినయ వెంకటేశ కార్తీక్ (36) తన తండ్రికి చెందిన ఫామ్ హౌస్ లో బలవన్మరణానికి పాల్పడ్డాడు.

23 వ తేదీ మిమిక్రీ కళాకారుడు, హాస్య నటుడు వి. హరికిషన్ (57) గుండెపోటుతో కన్నుమూశారు.

24 వ తేదీ హిందీ నటుడు మోహిత్ బాగేల్ (26) కాన్సర్ తో కన్నుమూశారు. 'రెడీ, గలీగలీ చోర్ హౌ, ఇక్కీస్ తొప్పన్ కి సలామీ' చిత్రాలలో ఆయన నటించాడు.

25 వ తేదీ టీవీ నటి ప్రేక్ష మెహతా (25) ఇండోర్ లోని నివాసంలో ఆత్మహత్య చేసుకుంది.

28 వ తేదీ కన్నడ నటి చందన (29) విషం తాగి ఆత్మహత్య చేసుకుంది.

29 వ తేదీ హిందీ సినీ గీత రచయిత యోగేశ్ గౌర్ (77) అనారోగ్యంతో చనిపోయారు. హృషికేష్ ముఖర్జీ, బసు ఛటర్జీ చిత్రాలకు ఆయన పలు గీతాలు రాశారు.

జూన్

1 వ తేదీ బాలీవుడ్ సంగీత ద్వయం సాజిద్ - వాజిద్ లో ఒకరైన వాజిద్ ఖాన్ (42) అనారోగ్యంతో ముంబైలో కన్నుమూశారు. కరోనా కారణంగా ఆయన చనిపోయినట్టు తెలిసింది.

3 వ తేదీ బాలీవుడ్ గీత రచయిత అన్వర్ సాగర్ (70) కన్నుమూశారు. 'యారానా, స్వప్నే సజన్ కే', 'ఖిలాడీ' మై ఖిలాడీ తు అనారీ, విజయ్ పథ్ తదితర చిత్రాలకు ఆయన పాటలు రాశారు.

4 వ తేదీ 'రజనీ గంథ, చోటీసీ బాత్, చిత్ చోర్, ఖట్టా మీఠా, దిల్లగీ' తదితర చిత్రాలు రూపొందించిన బసు ఛటర్జీ (93) అనారోగ్యంతో ముంబైలో కన్నుమూశారు. 1969లో 'సారా ఆకాశ్'తో ఆయన దర్శకుడయ్యారు. దూరదర్శన్ కోసం 'రజనీ', 'భ్యూమ్ కేష్ భక్షి' సీరియల్స్ తీశారు. ఇదే రోజున 'కర్మయోగి, రాజ్ తిలక్' చిత్రాల నిర్మాత అనిల్ సూరి (77) కరోనా కారణంగా కన్నుమూశారు.

7 వ తేదీ ప్రముఖ నటుడు అర్జున్ సర్జా మేనల్లుడు చిరంజీవి (39) బెంగళూరులో గుండెపోటుతో కన్నుమూశారు. దాదాపు 20 చిత్రాలలో నటించిన చిరంజీవి 2018లో నటి మేఘనా రాజ్ ను వివాహం చేసుకున్నాడు.

9 వ తేదీ జూనియర్ ఆర్టిస్ట్ హరీశ్ గౌడ్ సోమాజీగూడలోని ఓ ఆస్పత్రిలో కన్నుమూశారు. ఇదే రోజున అనువాద చిత్రాల నిర్మాత, ఎడిటర్ గబ్బిట మధు, పబ్లిసిటీ డిజైనర్ ముగడ భాస్కర్ (68), తమిళ యువ దర్శకుడు బాలమిత్రన్ (39) చెన్నైలో అనారోగ్యంతో చనిపోయారు.

13 వ తేదీ ప్రముఖ ఛాయాగ్రాహకుడు బి. కణ్ణన్ (69) అనారోగ్యంతో చెన్నైలో కన్నుమూశారు. తమిళ సినీ దిగ్గజం భీమ్ సింగ్ ఈయన తండ్రి. 'అళైగళ్ ఒయ్ వదిల్లై'కి గానూ ఉత్తమ ఛాయాగ్రాహకుడిగా జాతీయ అవార్డును అందుకున్నారు.

16 వ తేదీ 'నాంపల్లి స్టేషన్ కాడి రాజాలింగో' గీత రచయిత రాచపల్లి ప్రభు గుండెపోటుతో కన్నుమూశారు.

18 వ తేదీ మలయాళ సినీ రచయిత, దర్శకుడు సచ్చిదానందన్ (48) అనారోగ్యంతో త్రిస్సూర్ లో కన్నుమూశారు. రచయితగా చిత్రసీమలోకి అడుగుపెట్టిన సచి 'అనార్కలీ, అయ్యప్పన్ కోషియుమ్' చిత్రాలు రూపొందించారు.

22 వ తేదీ హాలీవుడ్ దర్శకుడు జోల్ షూమాకర్ (80) న్యూయార్క్ లో కన్నుమూశారు. 'ద ఇన్ క్రెడిబుల్ ష్రింకింగ్ ఉమెన్'తో దర్శకుడు అయిన జోల్ 'బ్యాట్ మ్యాన్ ఫరెవర్, బ్యాట్ మ్యాన్ అండ్ రాబిన్స్' తదితర చిత్రాలు రూపొందించారు.

జులై

3 వ తేదీ ప్రముఖ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ (71) గుండెపోటుతో ముంబైలో కన్నుమూశారు. ఆమె అసలు పేరు నిర్మల నాగ్ పాల్. 1974లో 'గీతా మేరే నామ్' చిత్రంతో నృత్యదర్శకురాలిగా మారి, నాలుగు దశాబ్దాలలో రెండు వేల పాటలకు నృత్యరీతులు సమకూర్చారు. మూడు జాతీయ అవార్డులతో పాటు ఓ నంది అవార్డును సరోజ్ ఖాన్ అందుకున్నారు. ఇదే రోజున ఈతరం ఫిలిమ్స్ బ్యానర్ లో నిర్మితమైన చిత్రాలకు సమర్పకునిగా వ్యవహరించిన పోకూరి రామారావు (64) అనారోగ్యంతో కన్నుమూశారు.

5 వ తేదీ హాలీవుడ్ నటుడు నిక్ కార్డెరో (41) కరోనా కారణంగా కన్నుమూశారు. 'ఏ స్టాండప్ గై, గోయింగ్ ఇన్ స్టయిల్, ఇన్ సైడ్ గేమ్' తదితర చిత్రాల్లో ఆయన నటించాడు.

6 వ తేదీ ఆస్కార్ అవార్డ్ గ్రహీత, హాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్ ఎన్నియో మోరికోన్ (91) కన్నుమూశారు. 2015లో 'ది హేట్ ఫుల్ ఎయిట్' కి బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో ఆయన అవార్డ్ అందుకున్నారు.

7 వ తేదీ బాలీవుడ్ దర్శక నిర్మాత హరీష్ షా (76) నోటి క్యాన్సర్ తో చనిపోయారు. 'మేరే జీవన్ సాథీ, కాలా సోనా, రామ్ తేరే కిత్నే నామ్' చిత్రాలను హరీశ్‌ షా నిర్మించారు. 'ధన్ దౌలత్, జల్ జలా, అబ్ ఇన్సాఫ్ హోగా' చిత్రాలను ఆయన రూపొందించారు. 2003లో వచ్చిన 'జాల్ : ద ట్రాప్' నిర్మాతగా ఆయన చివరి సినిమా. ఇదే రోజున కన్నడ నటుడు సుశీల్ గౌడ ఆత్మహత్య చేసుకున్నాడు. 'అంతఃపుర' టెలివిజన్ కార్యక్రమంతో అతను పాపులారిటీ సంపాదించుకున్నాడు.

8 వ తేదీ బాలీవుడ్ కు చెందిన ప్రముఖ హాస్య నటుడు జగ్ దీప్ (81) వయోభారంతో కన్నుమూశాడు. 'షోలే' చిత్రంలోని సుర్మా భూపాలీ పాత్రతో పాపులారిటీ సంపాదించుకున్న జగ్ దీప్ 400 చిత్రాలలో నటించాడు.

12 వ తేదీ 2016లో 'హై అప్నా దిల్ తో ఆవారా' చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన టీవీనటి దివ్యా చౌక్సి క్యాన్సర్ తో కన్నుమూశారు.

15 వ తేదీ సీనియర్ నిర్మాత కిలారు ముఖర్జీ (77) అనారోగ్యంతో చనిపోయారు. 'ఇద్దరూ ఇద్దరే, నిప్పులాంటి నిజం, నయా కదమ్, మట్టి మనుషులు, తదితర చిత్రాలను నిర్మించారు బి. నరసింగరావు దర్శకత్వం వహించిన 'మట్టిమనుషులు' చిత్రం ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా అవార్డును అందుకుంది.

19 వ తేదీ ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రజత్ ముఖర్జీ కిడ్నీ సంబంధ వ్యాధితో జైపూర్ లో కన్నుమూశారు. 'ప్యార్ తునే క్యా కియా, లవ్ ఇన్ నేపాల్‌, రోడ్' తదితర చిత్రాలను ఆయన రూపొందించారు. 'ఇష్క్ కిల్స్' అనే టీవీ సీరిస్ నూ ఆయన డైరెక్ట్ చేశారు.

25 వ తేదీ హాలీవుడ్ నటుడు జాన్ సాక్సన్ (83) న్యూమోనియాతో లాస్ ఏంజెల్స్ లో చనిపోయారు. 'ఎంటర్ ద డ్రాగన్, ఏ నైట్ మేర్ ఆన్ ఎల్మ్ స్ట్రీట్' సినిమాలు ఆయనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఇదే రోజున సీనియర్ నటుడు మంచాల సూర్యనారాయణ గుండెపోటుతో కన్నుమూశారు. 'వివాహభోజనంబు' చిత్రంతో వెండితెరకు పరిచయం అయిన మంచాల పలు టీవీ సీరియల్స్ లో నటించారు.

26 వ తేదీ సీనియర్ నిర్మాత కందేపి సత్యనారాయణ బెంగళూరులో గుండెపోటుతో కన్నుమూశారు. తెలుగు, తమిళ భాషల్లో దాదాపు 40 చిత్రాలను ఆయన అనువదించారు. 'పాండురంగ మహత్మ్యం' డబ్బింగ్ చిత్రంతో కెరీర్ ప్రారంభించిన కందేపి 'కొంగుముడి, శ్రీవారు, సక్కనోడు, మాయామోహిని' చిత్రాలు నిర్మించారు.

28 ప్రముఖ నటుడు, రచయిత, పాత్రికేయుడు, సంగీత, నాటక కర్త రావి కొండలరావు (88) గుండెపోటుతో కన్నుమూశారు. దాదాపు 600 చిత్రాలలో నటించిన రావి కొండలరావు ఉత్తమ కథా రచయితగా, పుస్తక రచయితగా, సహాయ నటుడిగా నంది అవార్డులు అందుకున్నారు. ఇదే రోజున ముంబైలో సీనియర్ బాలీవుడ్ నటీమణి కుమ్ కుమ్ (86) అనారోగ్యంతో కన్నుమూశారు. దాదాపు వంద చిత్రాలలో నటించిన ఆమె 'మిస్టర్ ఎక్స్ ఇన్ బొంబే, మదర్ ఇండియా, సన్ ఆఫ్‌ ఇండియా, ఆంఖే' చిత్రాలలో కీలక పాత్రలు పోషించారు.

ఆగస్ట్

3వ తేదీ ప్రజా వాగ్గేయ కారుడు వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో కన్నుమూశారు. ఆర్. నారాయణమూర్తి, టి. కృష్ణ, దాసరి నారాయణరావు, మాదాల రంగారావు రూపొందించిన చిత్రాలకు వంగపడు పాటలు రాశారు.

6 వ తేదీ టీవీ నటుడు సమీర్ శర్మ (44) ముంబైలోని ఇంటిలో ఆత్మహత్య చేసుకున్నారు. 'క్యోంకీ సాస్ భీ కభీ బహుథీ, లెఫ్ట్ రైట్ లెఫ్ట్' సీరియల్స్ లో సమీర్ నటించాడు.

7 వ తేదీ సీనియర్ దర్శకుడు ఎన్.బి. చక్రవర్తి అనారోగ్యంతో కన్నుమూశారు. 'సంపూర్ణ ప్రేమాయాణం, కత్తుల కొండయ్య, నిప్పులాంటి మనిషి, కాష్మోరా' చిత్రాలను చక్రవర్తి రూపొందించారు. సంగీత దర్శకుకు పెండ్యాలకు ఈయన అల్లుడు.

11వ తేదీ కవి, గీత రచయిత రాహత్ ఇందోరి గుండె సంబంధిత వ్యాధితో చనిపోయారు. 'కరీబ్, మిషన్ కాశ్మిర్, మీనాక్షి, మర్డర్' తదితర చిత్రాలకు ఆయన పాటలు రాశారు.

17 వ తేదీ మరాఠీ చిత్రం 'డోంబివలి ఫాస్ట్' దర్శకుడు నిషికాంత్ కామత్ హైదరాబాద్ ఏజీఎమ్ హాస్పిటల్ లో కన్నుమూశారు. 'ముంబై మేరీ జాన్, ఫోర్స్, లై భారీ, మదారి, దృశ్యం' చిత్రాలకు నిషికాంత్ దర్శకత్వం వహించాడు. ఇదే రోజున హిందుస్తానీ సంగీత విద్వాంసుడు పండిట్ జశ్ రాజ్ (90) అమెరికాలోని న్యూజెర్సీలో గుండెపోటుతో కన్నుమూశారు. శాంతారాం దర్శకత్వం వహించిన 'లడకీ సహయాద్రి'కి జశ్ రాజ్ ఓ పాట పాడారు. ఆ తర్వాత 'బీర్బల్ మై బ్రదర్, 1920' చిత్రాలలో పాటలు పాడారు.

19 వ తేదీ కె.ఎఫ్.సి. పంపిణీ సంస్థ భాగస్వామి, సహ నిర్మాత గుండాల కమలాకర్ రెడ్డి (48) రోడ్డు ప్రమాదంలో చనిపోయారు.

23 వ తేదీ సీనియర్ దర్శకుడు ఏ. బి. రాజ్ (95) అనారోగ్యంతో కన్నుమూశారు. తమిళ, మలయాళ, సింహళ భాషల్లో ఆయన పలు చిత్రాలు రూపొందించారు.

28 వ తేదీ 'బ్లాక్ పాంథర్' స్టార్ చాడ్విక్ బోస్మన్ (43) క్యాన్సర్ తో కన్నుమూశారు. 'అవెంజర్స్ ఎండ్ గేమ్, కెప్టెన్ అమెరికా సివిల్ వార్' చిత్రాలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.
31 వ తేదీ ప్రముఖ సినీ పంపిణీ సంస్థ నవయుగ ఫిలిమ్స్ కు చెందిన కాట్రగడ్డ నరసయ్య (94) విజయవాడలో కన్నుమూశారు.

సెప్టెంబర్

6 వ తేదీ సీనియర్ సంగీత దర్శకుడు ఎస్. మొహిందర్ (94) అనారోగ్యంతో కన్నుమూశారు. 1950, 60లలో దాదాపు యాభై చిత్రాలకు మొహిందర్ స్వరాలు అందించాడు.

7 వ తేదీ 'లవకుశ' చిత్రంలో లవుడుగా నటించిన నాగరాజు (71) హైదరాబాద్ లో చనిపోయారు. 'శ్రీకృష్ణసత్య, శ్రీరామ పట్టాభిషేకం, సంపూర్ణ రామాయణం, సిపాయి కూతురు, టైగర్ రాముడు, ఉమ్మడి కుటుంబం' తదితర చిత్రాలలో ఆయన నటించారు.

8 వ తేదీ సీనియర్ నటుడు జయప్రకాశ్ రెడ్డి (74) గుంటూరులో గుండెపోటుతో కన్నుమూశారు. 'ప్రేమించుకుందాం రా' చిత్రంతో సూపర్ హిట్ ను అందుకున్న జయప్రకాశ్ రెడ్డి ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు.

9 వ తేదీ 'మనసు మమత, మౌనరాగం' సీరియల్స్ తో గుర్తింపు తెచ్చుకున్న శ్రావణి (26) అనుమానాస్పద స్థితిలో మరణించింది.

10 వ తేదీ తమిళనటుడు వడివేలు బాలాజీ (42) గుండెపోటుతో కన్నుమూశారు.

12 వ తేదీ ప్రముఖ గాయని అనురాధా ఫౌడ్వాల్ కుమారుడు ఆదిత్య (35) అనారోగ్యంతో కన్నుమూశాడు. తెలుగులో 'శ్రీసాయి మహిమ' చిత్రానికి ఆదిత్య స్వరాలు సమకూర్చాడు.

14 వ తేదీ తమిళనటుడు ఫ్లోరెంట్ ఫెరీరా (67) అనారోగ్యంతో కన్నుమూశారు.

21 వ తేదీ ప్రముఖ నటుడు నాగభూషణం భార్య, 'రక్తకన్నీరు' సీత (87) కన్నుమూశారు. 2002లో 'నేనే రా పోలీస్'లో ఆవిడ చివరిగా నటించారు.

22 వ తేదీ అలనాటి హిందీ నటి ఆశాలత వబ్గాంకర్ (79) సతారతో కన్నుమూశారు. 'వో సాత్ దిన్, అంకుష్, నమక్ హలాల్' తదితర చిత్రాలలో ఆమె నటించారు.

23 వ తేదీ కరోనా కారణంగా ప్రముఖ తెలుగు హాస్యనటుడు వేణుగోపాల్ కన్నుమూశారు. ఇదే రోజున దాదాపు 200 చిత్రాల్లో నటించిన కన్నడ హాస్యనటుడు రాక్ లైన్ సుధాకర్ 'షుగర్ లెస్' మూవీ సెట్స్ పై కుప్పకూలి ప్రాణాలు వదిలారు. అలానే హిందీనటుడు, రంగస్థల కళాకారుడు భూపేష్ కుమార్ పాండ్య ఊపిరితిత్తుల క్యానర్స్ తో కన్నుమూశారు.

25 వ తేదీ ప్రముఖ గాయకుడు, పద్మ భూషణ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కన్నుమూశారు. నాలుగున్నర దశాబ్దాల సినీ ప్రయాణంలో 40 వేల పాటలు పాడారు. గాయకుడిగా, నటుడిగా, నిర్మాతగా, వ్యాఖ్యాతగా, సంగీత దర్శకుడిగా, డబ్బింగ్ కళాకారుడిగా బహుముఖీన ప్రజ్ఞను బాలసుబ్రహ్మణ్యం ప్రదర్శించారు.

28 వ తేదీ గీత రచయిత అభిలాష్ (74) అనారోగ్యంతో కన్నుమూశారు. 'రఫ్తార్, ఆవారా లడ్కీ, సావన్ కో ఆనే దో, జీతే హై షాన్ సే' వంటి చిత్రాలకు ఆయన పాటలు రాశారు.

అక్టోబర్

4వ తేదీ సీనియర్ నటుడు, దర్శకుడు విశాల్ ఆనంద్ అనారోగ్యంతో ముంబైలో కన్నుమూశారు. ప్రముఖ నటుడు దేవానంద్ కు విశాల్ మేనల్లుడు.
9వ తేదీ సీనియర్ దర్శకుడు విజయా రెడ్డి (84) అనారోగ్యంతో బెంగళూరులో కన్నుమూశారు. దాదాపు యాభై చిత్రాలను కన్నడలో డైరెక్ట్ చేసిన విజయా రెడ్డి 6 తెలుగు, 17 హిందీ చిత్రాలు రూపొందించారు. 'రంగమహల్ రహస్యం' ఆయన తొలి చిత్రం.

11వ తేదీ ప్రముఖ సంగీత దర్శక ద్వయం రాజన్ - నాగేంద్రలోని ఒకరైన రాజన్ (87) బెంగళూర్ లో కన్నుమూశారు. తమ్ముడు నాగేంద్రతో కలిసి రాజన్ 370 కన్నడ, 60 తెలుగు చిత్రాలకు స్వరాలు అందించారు. హిందీ, మలయాళ, సింహళ, కొంకణ భాషా చిత్రాలకూ రాజన్ పనిచేశారు.

15 వ తేదీ భారతదేశపు మొట్టమొదటి ఆస్కార్ విజేత, కాస్ట్యూమ్ డిజైనర్ భాను అథ్థయ్య (91) ముంబైలో కన్నుమూశారు. 1956లో సీఐడీ చిత్రంతో కాస్ట్యూమ్ డిజైనర్ గా మారిన భాను.. 1983లో రూపుదిద్దుకున్న 'గాంధీ' చిత్రానికి గానూ ఆస్కార్ ను అందుకున్నారు. 'లేకిన్, లగాన్' చిత్రాలు ఆమెకు జాతీయ అవార్డులను ఇప్పించాయి.

31 వ తేదీ తొలి జేమ్స్ బాండ్, సర్ షాన్ కనరీ (90) అనారోగ్యంతో బహామాస్ లోని నసావూలో కన్నుమూశారు. 1962లో తొలిసారి 'డాక్టర్ నో' చిత్రంలో షాన్ కనరీ జేమ్స్ బాండ్ గా నటించారు. 'ది అన్ టచబుల్స్' సినిమాలోని నటనకు ఆయన ఆస్కార్ ను అందుకున్నారు.

నవంబర్

3 వ తేదీ తారకప్రభు ఫిలిమ్స్, సిరి మీడియా, సౌభాగ్య ఎంటర్ టైన్ మెంట్స్ నిర్వాహకులు కొండపల్లి రామకృష్ణ ప్రసాద్ అనారోగ్యంతో కన్నుమూశారు. దాసరితో 'మేస్త్రి'తో పాటు పలు చిత్రాలను ఆయన నిర్మించారు.

4వ తేదీ సీనియర్ ఎడిటర్ కోలా భాస్కర్ (55) గొంతు క్యాన్సర్ తో కన్నుమూశారు. కుమారుడు బాలకృష్ణను హీరోగా పరిచయం చేస్తూ, 'నన్ను వదిలి నీవు పోలేవులే' ద్విభాషా చిత్రాన్ని ఆయన నిర్మించారు. ఇదే రోజున హిందీ నటుడు ఫరాజ్ ఖాన్ గుండె సంబంధిత వ్యాధితో తుదిశ్వాస విడిచారు. ఫరీల్, మెహందీ చిత్రాలలో ఫరాజ్ హీరోగా నటించాడు. బాలీవుడ్ నటుడు యూసఫ్‌ ఖాన్ కొడుకు ఫరాజ్‌.

10 వ తేదీ ప్రముఖ రచయిత, నటుడు వరుణ్ సందేశ్ తాతయ్య జీడిగుంట రామచంద్రమూర్తి (80) కన్నుమూశారు. 'అమెరికా అబ్బాయి' చిత్రానికి రచన చేసిన ఆయన 'ఈ ప్రశ్నకు బదులేది? పెళ్ళిళ్లోయ్ పెళ్ళిళ్ళు' సినిమాలకు, 'మనోయజ్ఞం' టీవీ సీరియల్ కు మాటలు రాశారు.

12 వ తేదీ ఆకాశవాణి న్యూస్ రీడర్, నాటక రంగ కళాకారుడు ఏడిద గోపాలరావు కన్నుమూశారు. 'కరుణామయుడు' సినిమాలో ఆయన నటించాడు. రంగస్థల గాంధీగా ఆయనకు గుర్తింపు ఉంది. ఇదే రోజున బాలీవుడ్ నటుడు ఆసిఫ్ బాస్రా (53) హిమాచల్ ప్రదేశ్ కాంగ్రా జిల్లాలోని ధర్మశాల సమీపంలోని గెస్ట్ హౌస్ లో ఆత్మహత్య చేసుకున్నాడు.

15 వ తేదీ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ గ్రహీత, బెంగాలీ నటుడు సౌమిత్ర ఛటర్జీ (85) కోల్ కతాతో కన్నుమూశారు. సత్యజిత్ రే తెరకెక్కించిన 14 చిత్రాలలో సౌమిత్ర ఛటర్జీ నటించారు.

డిసెంబర్

2వ తేదీ పలు తెలుగు చిత్రాలలో కథానాయకుడిగా నటించిన యాదాకృష్ణ (61) గుండెపోటుతో మరణించాడు.

9వ తేదీ తమిళ నటి, వీజే చిత్ర చెన్నైలోని హోటల్ గదిలో ఆత్మహత్య చేసుకుంది. దీనికి కొద్ది రోజుల క్రితమే ఆమెకు వ్యాపారవేత్త హేమంత్ తో నిశ్చితార్థం జరిగింది.

13 వ తేదీ ప్రముఖ మలయాళ కళాదర్శకుడు, కాస్ట్యూమ్ డిజైనర్ పి. కృష్ణమూర్తి (77) కన్నుమూశారు. ఆర్ట్ డైరెక్టర్ గా మూడుసార్లు, కాస్ట్యూమ్ డిజైనర్ గా రెండు సార్లు ఆయన జాతీయ అవార్డును అందుకున్నారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: ntvtelugu
Top