Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Afghan Women: 'అమ్మాయి మౌనం పెళ్లికి అంగీకారమే'.. తాలిబన్ కొత్త చట్టంపై ఆగ్రహజ్వాలలు

Afghan Women: 'అమ్మాయి మౌనం పెళ్లికి అంగీకారమే'.. తాలిబన్ కొత్త చట్టంపై ఆగ్రహజ్వాలలు

NTV Telugu 6 days ago

మ్మాయి పెళ్లి నిర్ణయంపై ఆప్ఘనిస్థాన్‌లో తాలిబన్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టంపై తీవ్ర ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. ''పెళ్లికి అమ్మాయి మౌనం కూడా అంగీకారంగానే పరిగణిస్తాం.'' అనే కొత్త నిబంధనను తాలిబన్ తీసుకొచ్చింది.

అయితే ఈ చట్టంపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహజ్వాలలు వ్యక్తమవుతున్నాయి. మహిళల హక్కులను పూర్తిగా అణగదొక్కే మరో చర్యగా మానవ హక్కుల సంస్థలు అభివర్ణిస్తున్నాయి.

తాలిబాన్ సుప్రీం లీడర్ హిబతుల్లా అఖుంద్‌జాదా ఆమోదించిన కొత్త చట్టాన్ని ఆఫ్ఘనిస్థాన్ అధికారిక గెజిట్‌లో ప్రచురించారు. కుటుంబ వివాదాలు, వివాహాలు, విడాకులు, సంరక్షణ హక్కులు వంటి అంశాలపై మొత్తం 31 ఆర్టికల్స్‌తో ఈ నిబంధనలు రూపొందించారు.

మౌనం పెళ్లికి అంగీకారమా?
ఈ చట్టంలోని అత్యంత వివాదాస్పద అంశం వివాహ అంగీకారానికి సంబంధించినది. నివేదికల ప్రకారం.. "కన్య"గా పేర్కొన్న అమ్మాయి పెళ్లి ప్రతిపాదన వచ్చినప్పుడు మౌనంగా ఉంటే.. దానిని పెళ్లికి అంగీకరించినట్టుగా పరిగణించవచ్చని పేర్కొన్నారు. అయితే ఇదే నిబంధన అబ్బాయిలకు లేదా అప్పటికే వివాహమైన మహిళలకు వర్తించదని తెలిపింది. ఈ నిబంధనపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా సంప్రదాయవాద, పేద కుటుంబాల్లో అమ్మాయిలపై బలవంతపు వివాహాల ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉందని మహిళా హక్కుల కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు.

బాల్య వివాహాలకు చట్టబద్ధత?
కొత్త నిబంధనల ప్రకారం మైనర్ బాలికల వివాహాల్లో తండ్రి, తాతలకు అధిక అధికారం ఇచ్చినట్లు సమాచారం. వరుడు "సామాజికంగా సరైన వ్యక్తి"గా భావిస్తే.. అలాగే కట్నం మతపరమైన ప్రమాణాలకు అనుగుణంగా ఉంటే బాల్య వివాహాలను కూడా చట్టబద్ధంగా పరిగణించే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. అయితే "ఖియార్ అల్ బులూఘ్" అనే ఇస్లామిక్ నిబంధనను కూడా ఇందులో చేర్చారు. దీని ప్రకారం చిన్న వయసులో పెళ్లి జరిగిన అమ్మాయి యౌవనంలోకి వచ్చిన తర్వాత ఆ వివాహాన్ని రద్దు చేయాలని కోరవచ్చు. కానీ ఆ నిర్ణయం తాలిబాన్ నియంత్రిత మతపరమైన కోర్టుల ఆధీనంలోనే ఉంటుంది. దీంతో బాలికలకు నిజంగా స్వేచ్ఛ ఉంటుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

తాలిబాన్ జడ్జిలకు అధికారాలు
కొత్త చట్టంతో తాలిబాన్ జడ్జిల అధికారాలను కూడా విస్తరించారు. వ్యభిచారం ఆరోపణలు, మత మార్పిడి, భర్తలు దీర్ఘకాలం కనిపించకపోవడం, "జిహార్" వంటి కుటుంబ వివాదాల్లో జడ్జిలు జోక్యం చేసుకుని విడాకులు, శిక్షలు, జైలు శిక్షలు విధించే అధికారం కల్పించారు.

సోషల్ మీడియాలో ఆగ్రహం
ఈ చట్టంపై సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. "ఇది సంస్కృతి కాదు.. చిన్నారులపై దారుణమైన దౌర్జన్యం" అంటూ పలువురు మండిపడుతున్నారు. "పిల్లల మౌనాన్ని అంగీకారంగా ఎలా భావిస్తారు?" అంటూ ప్రశ్నిస్తున్నారు. మరికొందరు "మహిళలను, చిన్నారులను వస్తువుల్లా చూస్తున్నారు" అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదరికం కారణంగా బాల్య వివాహాలు పెరిగే ప్రమాదం ఉందని కూడా పలువురు అభిప్రాయపడ్డారు.

ప్రపంచవ్యాప్తంగా ఆందోళన
2021లో తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత తాలిబాన్ ప్రభుత్వం మహిళలపై అనేక ఆంక్షలు విధించింది. ఆరో తరగతి తర్వాత బాలికల విద్య నిషేధం, మహిళలకు యూనివర్సిటీల్లో ప్రవేశాల రద్దు, ఉద్యోగ అవకాశాలపై ఆంక్షలు, ప్రయాణాలపై పరిమితులు విధించింది. ఇప్పుడు వచ్చిన కొత్త కుటుంబ చట్టం మహిళల స్వేచ్ఛను మరింత పరిమితం చేసే చర్యగా అంతర్జాతీయ వర్గాలు భావిస్తున్నాయి.

తాలిబాన్ ప్రభుత్వం ఇప్పటికీ అంతర్జాతీయ గుర్తింపు కోసం ప్రయత్నిస్తోంది. కానీ మహిళల హక్కులు, విద్య, స్వేచ్ఛలపై ఆంక్షల కారణంగా అనేక దేశాలు అధికారిక గుర్తింపు ఇవ్వలేదు. తాజా చట్టం వల్ల తాలిబాన్‌పై అంతర్జాతీయ ఒత్తిడి మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu