Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Ajit Doval: స్వేచ్ఛ అంటే ఇష్టానుసారంగా ప్రవర్తించడం కాదు.. జెన్‌-జీపై అజిత్ దోవల్ కీలక వ్యాఖ్యలు

Ajit Doval: స్వేచ్ఛ అంటే ఇష్టానుసారంగా ప్రవర్తించడం కాదు.. జెన్‌-జీపై అజిత్ దోవల్ కీలక వ్యాఖ్యలు

NTV Telugu 2 weeks ago

జెన్‌-జీ ఉద్యమంపై జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్వేచ్ఛ అంటే ఇష్టానుసారంగా ప్రవర్తించడం కాదని.. యువత జాతీయ ప్రయోజనాల గురించి కూడా ఆలోచించాలని హితవు పలికారు.

లోకమాన్య బాల గంగాధర్ తిలక్ వర్ధంతిని పురస్కరించుకుని మహారాష్ట్రలోని పూణెలో శనివారం ఒక ప్రత్యేక కార్యక్రమం జరిగింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అజిత్ దోవల్‌కు 2026 లోకమాన్య తిలక్ జాతీయ అవార్డును ప్రదానం చేశారు. దోవల్‌కు సాంప్రదాయ పూణేరి తలపాగా, జ్ఞాపిక, చెక్కు, గీతా రహస్య ప్రతిని అందజేశారు.

అవార్డు స్వీకరించిన అనంతరం దోవల్ ప్రసంగించారు. యువత స్వేచ్ఛ యొక్క నిజమైన అర్థాన్ని గ్రహించాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రధాని మోడీ, అమిత్ షాల నాయకత్వాన్ని బహిరంగంగా ప్రశంసించారు. మోడీ, అమిత్ షా వంటి బలమైన నాయకత్వం మనకు ఉండటం మన అదృష్టమని తెలిపారు. భారతదేశం ప్రస్తుతం అంతర్గత, బాహ్య సవాళ్లను ఎదుర్కొంటోందని… దేశం వేగంగా అభివృద్ధి చెందుతుండగా.. అనేక వ్యతిరేక శక్తులు దాని పురోగతి గురించి ఆందోళన చెందుతున్నాయన్నారు. ఇటువంటి సమయంలో ప్రతి పౌరుడు అన్నింటికన్నా ముందుగా జాతీయ ప్రయోజనాల గురించి ఆలోచించాలని కోరారు.

యువతకు సందేశం ఇస్తే.. ''నేటి తరం స్వేచ్ఛ యొక్క నిజమైన అర్థాన్ని అర్థం చేసుకోవడం చాలా కీలకం. స్వేచ్ఛ అంటే తమకు నచ్చింది చేసుకునే హక్కు అని కొందరు భావిస్తారు. కానీ అలాంటి ఆలోచన పూర్తిగా తప్పు.'' జాతీయ ప్రయోజనాలకు వ్యతిరేకమైన మార్గంలో మనం అడుగు కూడా పెట్టకూడదని హితవు పలికారు. భారతదేశాన్ని శక్తివంతం చేయడమే మన మొదటి కర్తవ్యంగా ఉండాలన్నారు.

ఈ సందర్భంగా చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. పూణెలో తన ప్రాథమిక విద్య సమయంలోనే లోకమాన్య తిలక్ ఆలోచనల గురించి మొదటిసారిగా వివరంగా తెలుసుకున్నానని వివరించారు. బ్రిటిష్ పాలనలో ప్రజలు భయంతో మౌనంగా ఉన్నప్పుడు.. తిలక్ నిర్భయంగా మాట్లాడారని.. జైలులో ఉన్న తర్వాత కూడా ఆయన తన సాంఘిక సేవను ఎన్నడూ విడిచిపెట్టలేదన్నారు. తిలక్ జీవితం, పోరాటాల నుంచి స్ఫూర్తి పొంది దేశ నిర్మాణానికి తోడ్పడాలని యువతకు దోవల్ విజ్ఞప్తి చేశారు.

ఇటీవల నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళన చేపట్టారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులపై లాఠీఛార్జ్ జరిగింది. అనంతరం ఆందోళనలు తీవ్రం కావడంతో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu