Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Ajit Doval: ఉగ్ర పోరులో ద్వంద్వ వైఖరి ఉండకూడదు.. అలాంటి దేశాలను క్షమించకూడదన్న అజిత్ దోవల్

Ajit Doval: ఉగ్ర పోరులో ద్వంద్వ వైఖరి ఉండకూడదు.. అలాంటి దేశాలను క్షమించకూడదన్న అజిత్ దోవల్

NTV Telugu 1 week ago

గ్రవాదంపై పోరాటంలో దేశాలు ద్వంద్వ వైఖరి అవలంబించకూడదని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ స్పష్టం చేశారు. ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇచ్చే నిధులు సమకూర్చే దేశాలపై బాధ్యతాయుతమైన దేశాలు కఠిన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.

మాస్కోలో జరుగుతున్న తొలి అంతర్జాతీయ భద్రతా ఫోరం, భద్రతా వ్యవహారాలకు బాధ్యత వహిస్తున్న ఉన్నతాధికారుల 14వ అంతర్జాతీయ సమావేశంలో అజిత్ దోవల్ పాల్గొని ప్రసంగించారు.

"ప్రతి దేశానికీ ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే బాధ్యత ఉంది. ఉగ్రవాదంపై పోరులో ద్వంద్వ ప్రమాణాలకు తావు ఉండకూడదు. బాధ్యతగల దేశాలు తమ వైఖరిని స్పష్టం చేయాలి. ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే దేశాల వెంట నిలుస్తాయా? లేక ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు కఠిన చర్యలు తీసుకుంటాయా? అన్నది తేల్చుకోవాలి" అని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా 2025 ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిని దోవల్ ప్రస్తావించారు. భారత్ ఎన్నాళ్లుగానో ప్రభుత్వ ప్రోత్సాహంతో నడిచే ఉగ్రవాదానికి బలవుతోందని అన్నారు. "2025 ఏప్రిల్‌లో ప్రపంచం దారుణ ఘటనను చూసింది. జమ్మూకాశ్మీర్‌లో 26 మంది అమాయక పౌరులను, వారి కుటుంబాల ముందే హత్య చేశారు. మతం ఆధారంగా వారిని వేరు చేసి చంపారు" అని తెలిపారు.

దోషులపై భారత్ కఠిన చర్యలు
ఉగ్రదాడి అనంతరం దోషులపై భారత్ కఠిన చర్యలు తీసుకుందని దోవల్ పేర్కొన్నారు. ఈ విషయంలో ఐక్యరాజ్యసమితి భద్రతామండలి (UNSC) చేసిన ప్రకటనను భారత్ సమర్థిస్తోందన్నారు. "ఉగ్రదాడులకు పాల్పడినవారు, కుట్రదారులు, నిధులు సమకూర్చినవారు, మద్దతుదారులందరినీ బాధ్యులుగా నిలబెట్టి శిక్షించాలన్న UNSC అభిప్రాయాన్ని భారత్ పూర్తిగా సమర్థిస్తోంది. అదే నేపథ్యంలో పహల్గామ్ దాడి నిందితులపై భారత్ నిర్ణయాత్మక చర్యలు తీసుకుంది" అని తెలిపారు.

ప్రపంచ రాజకీయాల్లో మార్పులు
ప్రపంచ రాజకీయ, ఆర్థిక పరిస్థితులపై కూడా దోవల్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ప్రపంచం భౌగోళిక, ఆర్థిక అస్థిరతను ఎదుర్కొంటోందని చెప్పారు. యుద్ధాలు, ఆర్థిక అనిశ్చితి, వాణిజ్య, సాంకేతిక రంగాల్లో సవాళ్లు ప్రపంచ సమీకరణాలను ప్రభావితం చేస్తున్నాయని అన్నారు. "ప్రపంచ శక్తి ఇప్పుడు కొద్ది దేశాల చేతుల్లో మాత్రమే లేదు. అభివృద్ధి చెందుతున్న దేశాలు తమ ఆర్థిక, సైనిక సామర్థ్యాలను పెంచుకుంటున్నాయి. గ్లోబల్ సౌత్ దేశాలకు సమాన భాగస్వామ్యం లభించేలా బహుళ ధృవ ప్రపంచ వ్యవస్థ ఏర్పడుతోంది. అదే ప్రపంచ శాంతి, స్థిరత్వానికి మార్గం" అని పేర్కొన్నారు.

మే 26 నుంచి 29 వరకు మాస్కోలో జరుగుతున్న ఈ అంతర్జాతీయ సమావేశంలో 140కిపైగా దేశాలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు పాల్గొంటున్నారు. భద్రతా మండళ్ల కార్యదర్శులు, జాతీయ భద్రతా సలహాదారులు, నిఘా సంస్థల ఉన్నతాధికారులు ఈ వేదికపై చర్చలు జరుపుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu