Dailyhunt
Amba's Revenge: తెలుగు సినీ పరిశ్రమలో సంచలనం.. తొలి ఏఐ చిత్రంగా 'అంబ's రివెంజ్'!

Amba's Revenge: తెలుగు సినీ పరిశ్రమలో సంచలనం.. తొలి ఏఐ చిత్రంగా 'అంబ's రివెంజ్'!

NTV Telugu 1 week ago

తెలుగు సినీ పరిశ్రమలో సరికొత్త అధ్యాయానికి నాంది పలికే విధంగా.. కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో రూపొందుతున్న తొలి ఫీచర్ ఫిల్మ్ ‘అంబ's రివెంజ్’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

సాంకేతిక విప్లవాన్ని తెరపైకి తీసుకువస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. హనుమాన్ విజయోత్సవం సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

ఈ చిత్రాన్ని నిర్మాత శ్రీకాంత్ రెడ్డి కుందూరు నిర్మిస్తుండగా.. రాణి మాడిసన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక జయవర్ధన్ మాడి క్రియేటివ్ డైరెక్టర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. శ్రీ లలితకళా ఫిలిమ్స్, నక్క తోక ఫిల్మ్స్ నిర్మాణ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. పౌరాణిక ఇతిహాసమైన మహాభారతంలోని శక్తివంతమైన పాత్ర అంబ కథను ఆధారంగా తీసుకుని ఈ చిత్రాన్ని వినూత్నంగా తెరకెక్కిస్తున్నారు. ఆధునిక సాంకేతికతతో పాటు ఏఐ టూల్స్ వినియోగంతో విజువల్స్, పాత్రల రూపకల్పన, కథన నిర్మాణం వంటి అంశాలను కొత్త శైలిలో ఆవిష్కరించనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది.

ఈ సందర్భంగా నిర్మాత శ్రీకాంత్ రెడ్డి కుందూరు మరియు క్రియేటివ్ డైరెక్టర్ జయవర్ధన్ మాడి మాట్లాడుతూ… ‘తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టాం. అంబ's రివెంజ్ ద్వారా అత్యాధునిక ఏఐ టెక్నాలజీని వినియోగిస్తూ సినిమా నిర్మాణంలో కొత్త ప్రమాణాలను స్థాపించబోతున్నాం. త్వరలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటిస్తాం’ అని తెలిపారు. పౌరాణిక కథను ఆధునిక సాంకేతికతతో మిళితం చేస్తూ రూపొందుతున్న ఈ చిత్రం తెలుగు సినీ పరిశ్రమలో కొత్త దిశగా అడుగులు వేస్తోందని చెప్పవచ్చు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu