Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Annamalai: బీజేపీతో అన్నామలైకి ఎక్కడ చెడింది, కారణాలేంటి.?

Annamalai: బీజేపీతో అన్నామలైకి ఎక్కడ చెడింది, కారణాలేంటి.?

NTV Telugu 3 weeks ago

Annamalai: బీజేపీతో తెగదెంపులు చేసుకునేందుకే అన్నామలై సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆయన తన రాజీనామా ఇచ్చేందుకు మంగళవారం ఢిల్లీకి వెళ్లారు. ఇప్పటికే, జాతీయాధ్యక్షుడు నితిన్ నబీన్, అమిత్ షా, బీఎల్ సంతోష్ వంటి అగ్రనేతలతో భేటీ అయ్యారు.

తన రాజీనామా ఇప్పటికే సమర్పించినట్లు వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు అన్నామలై పార్టీలో కొనసాగేలా ఒప్పించేందుకు బీజేపీ పెద్దలు ప్రయత్నిస్తున్నారు. బుధవారం వరకు ఆయన ఢిల్లీలోనే ఉండనున్నారు.

బీజేపీకి తమిళనాడులో ఆశాకిరణంగా కనిపించిన అన్నామలై, రాష్ట్రంలో పార్టీని పటిష్టం చేసేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. పాదయాత్రతో గ్రామాల నుంచి పట్టణాల వరకు బీజేపీకి ఊపు తెచ్చారు. అయితే, ఎన్నికల ముందు అగ్ర నాయకత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలతో అన్నామలై అసంతృప్తికి గురైనట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే సొంత పార్టీ ఏర్పాటు చేసి, రాజకీయాల్లో ముందుకు సాగాలని ఆయన నిర్ణయించుకున్నట్లు సమాచారం.

అన్నాడీఎంకేతో పొత్తుతో అసంతృప్తి:

కర్ణాటక కేడర్ ఐపీఎస్ అధికారి అయిన అన్నామలై, ''సింగం''గా పేరు తెచ్చుకున్నారు. 2020లో బీజేపీలో చేరారు. అనతికాలంలోనే బీజేపీ తమిళనాడు అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు. ఈయన హాయాంలో బీజేపీ ఓట్ బ్యాంక్ గణనీయంగా పెరిగింది. కానీ, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకోవడంతోనే అన్నామలై అసంతృప్తికి గురయ్యారు. ఇదే సమయంలో, పొత్తులో భాగం కావాలంటే అన్నామలైని జాతీయాధ్యక్షుడి పదవి నుంచి తొలగించాలని ఎడప్పాడి పళనిస్వామి బీజేపీపై ఒత్తిడి తెచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే అన్నామలైని తొలగించి నైనార్ నాగేంద్రన్‌ను బీజేపీ తమిళనాడు అధ్యక్షుడిగా నియమించింది.

ఇంత చేసినా అన్నాడీఎంకే ఈ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది. ఇదే కాకుండా బీజేపీ మొత్తం 234 సీట్లలో కేవలం ఒక స్థానం మాత్రమే సాధించింది. పార్టీ ఓటు శాతం కూడా గణనీయంగా తగ్గిపోయింది. ఇదే సమయంలో విజయ్ టీవీకే పార్టీ తమిళనాడు రాజకీయాల్లో ప్రధాన శక్తిగా అవతరించింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే అన్నామలై కొత్త పార్టీ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఆయన ఏర్పాటు చేసే కొత్త పార్టీ ద్రావిడ రాజకీయాలకు ప్రత్యామ్నాయంగా, జాతీయవాద రాజకీయాలు చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu