Monday, 12 Apr, 8.10 pm NTV Telugu

హోమ్
అంతా ఒట్టిదే.. అలా కధ చెప్పి ఇలా దొరికేశాడు !

తుపాకీ కాల్పులకు ఓ మహిళ ప్రాణాలు వదిలింది. కట్టుకున్న భర్త క్షణికావేశంలో తన దగ్గర ఉన్నఉన్నతాధికారి తుపాకితో భార్యపై ఈ కాల్పులు జరపటం సంచలనంగా మారింది. పోలీస్ శాఖలో పనిచేస్తున్న హోంగార్డు కావటంతో ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టి కేసు విచారణ చేపట్టారు. తొలుత గన్ మిస్ ఫైర్ అవటంతో తన భార్య చనిపోయిందని కట్టు కథలు చెప్పిన హోంగార్డు వినయ్ ఆ తర్వాత పోలీసుల విచారణలో తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. దీంతో అతన్ని కటకటాల వెనక్కి నెట్టారు పోలీసులు.

ఎఎస్పీ గన్ తో ఫైరింగ్ :

విజయవాడ భవానీపురంలో ఉన్న మౌలా నగర్ లో వినోద్, సూర్య రత్న ప్రభ నివసిస్తున్నారు. పోలీస్ శాఖలో హొంగార్డుగా వినోద్ పనిచేస్తున్నారు. ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ విభాగంలో ఎఎస్పీ శశిభూషన్ దగ్గర వినోద్ హోం గార్డుగా పని చేస్తున్నారు. శశిభూషణ్ తో కలిసి మూడు రోజుల పాటు అనంతపురం పర్యటనకు వెళ్లి నిన్న రాత్రి ఇంటికి చేరుకున్నాడు వినోద్. అయితే శశిభూషణ్ కు సంబంధించి డిపార్ట్మెంట్ రివాల్వర్ హోంగార్డు వినోద్ దగ్గర ఉండిపోయింది. దీనిపై నిన్న రాత్రి 10 గంటల సమయంలో శశిభూషన్ వినోద్ కు ఫోన్ చేయగా ఉదయాన్నే తీసుకువస్తానని సమాధానం చెప్పాడు. అయితే రాత్రి 11 గంటల తర్వాత ఈ రివాల్వర్ పేలటం, వినోద్ భార్య సూర్య రత్న ప్రభ అక్కడిక్కడే ప్రాణాలు వదలడం జరిగిపోయాయి. దీనిపై ఘటనా స్థలానికి వెళ్ళిన పోలీసులకు వినోద్ ఓ కట్టుకథ వినిపించాడు.

ముందు కట్టు కధ, చూపిస్తుండగా ఫైర్ అయిందంటూ :

రివాల్వర్ ను తన భార్య రత్నప్రభకు సరదాగా చూపిస్తుండగా ప్రమాదవశాత్తు మిస్ ఫైర్ అవటంతో ప్రాణాలు పోయాయని తొలుత వినోద్ పోలీసులకు చెప్పాడు. రత్నప్రభ, వినోద్ తల్లిదండ్రులను పిలిపించి విచారించిన పోలీసులు కూడా వారిద్దరి మధ్య ఎటువంటి విభేదాలు లేవని సఖ్యతగానే ఉంటున్నారని పోలీసులకు చెప్పారు. రత్నప్రభ తల్లిదండ్రులు కూడా తమ అల్లుడు మంచివాడని ఏ గొడవలు లేవనటంతో పోలీసులు కూడా వినోద్ మాటలు తొలుత నమ్మారు. అయితే తూటా రత్న ప్రభ గుండెల్లోకి అత్యంత దగ్గర నుంచి దూసుకుపోవడంతో కావాలనే చేశారనే అనుమానాలు వ్యక్తం కావడంతో ఆ దిశగా విచారణ చేపట్టడంతో అసలు విషయం బయటపడింది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వినోద్, రత్నప్రభలు వేర్వేరు కులాలైనప్పటికీ ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఓ పాప పుట్టి చనిపోయినట్లు గుర్తించారు.

గుండెల్లో సరిగ్గా దిగడంతో :

వినోద్ కావాలనే కట్టు కథలు చెబుతున్నాడని భావించిన పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టగా అసలు నిజాన్ని నిందితుడు ఒప్పుకున్నాడు. తన భార్యకు చెందిన 2.50 లక్షల విలువైన బంగారు ఆభరణాలు మణపురం ఫైనాన్స్ లో వినోద్ తాకట్టు పెట్టాడు. ఈ నగలను విడిపించాలని ఇద్దరి మధ్య తగువు జరుగుతోంది. తన అన్న పెళ్లి ఉందని బంగారం విడిపించాలని గొడవ పడుతోంది భార్య రత్నప్రభ. అనంతపురం నుంచి ఇంటికి వచ్చిన వెంటనే భర్త వినోద్ తో ఇదే విషయమై గొడవ మొదలైంది. దీంతో ఆగ్రహానికి గురైన వినోద్ తన దగ్గర ఉన్న ఎఎస్పీ శశిభూషణ్ పిస్టల్ తీసి అతి దగ్గర నుంచి రత్నప్రభ పై కాల్పులు జరిపాడు. దీనితో బుల్లెట్ ఆమె చేతి నుంచి చాతిలోకి దూసుకెళ్ళి బయటకు వచ్చి తలుపుకు తగిలింది. ఆ బుల్లెట్ కే రత్నప్రభ ప్రాణాలు వదిలింది. దీంతో అనుమానాస్పద మృతిగా నమోదు చేసిన కేసును హత్య కేసుగా మార్చారు పోలీసులు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించటానికి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు వినోద్ ను అరెస్టు చేయనున్నారు. 9 ఎంఎం పిస్టల్ గా గుర్తించారు. వెపన్ హోంగార్డు దగ్గర వదిలివెళ్లిన ఏఏస్పీ పై శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నట్టు సీపీ బత్తిన శ్రీనివాసులు తెలిపారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: ntvtelugu
Top