Dailyhunt
Arshdeep Singh: అర్ష్‌దీప్ సింగ్‌కు షాకిచ్చిన బీసీసీఐ..! ఇక, కుదరదు..

Arshdeep Singh: అర్ష్‌దీప్ సింగ్‌కు షాకిచ్చిన బీసీసీఐ..! ఇక, కుదరదు..

NTV Telugu 1 week ago

Arshdeep Singh: ఐపీఎల్ 2026 సీజన్‌లో ఆటగాళ్ల ప్రవర్తన, సోషల్ మీడియా కార్యకలాపాలపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కఠిన వైఖరి అవలంబిస్తోంది.

ఈ నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ స్టార్ ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్‌పై బోర్డు కీలక ఆంక్షలు విధించినట్లు సమాచారం. టోర్నమెంట్ పూర్తయ్యే వరకు ఎలాంటి వ్లాగ్‌లు, తెరవెనుక వీడియోలు చిత్రీకరించవద్దని అతనికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

వివాదాస్పద వీడియోలే కారణమా?
ఐపీఎల్ 2026 సందర్భంగా అర్ష్‌దీప్ సింగ్ తన సహచర ఆటగాళ్లతో కలిసి పలు వ్లాగ్‌లు రూపొందించి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. పంజాబ్ కింగ్స్ డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం, జట్టు ప్రయాణాలు, ఆటగాళ్ల సరదా క్షణాలను వీడియోల రూపంలో అభిమానులతో పంచుకున్నాడు. అయితే, ఈ వీడియోల్లోని కొన్ని సన్నివేశాలు వివాదాస్పదంగా మారాయి. ఒక వీడియోలో సహచర ఆటగాడు శశాంక్ సింగ్ పట్టిన క్యాచ్‌పై అర్ష్‌దీప్ సరదాగా వ్యాఖ్యలు చేయడం చర్చకు దారితీసింది. మరో వీడియోలో స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ విమానంలో వేపింగ్ చేస్తున్నట్లు కనిపించాడనే ఆరోపణలు రావడం మరింత వివాదాన్ని రేకెత్తించింది. ఈ పరిణామాలను బీసీసీఐ తీవ్రంగా పరిగణించినట్లు సమాచారం.

బీసీసీఐ కఠిన ఆదేశాలు
మే 7న బీసీసీఐ జారీ చేసిన అంతర్గత సలహా ప్రకారం, టోర్నమెంట్ ముగిసే వరకు జట్టుకు సంబంధించిన ఎలాంటి వీడియోలు, వ్లాగ్‌లు లేదా సోషల్ మీడియా కంటెంట్ పోస్ట్ చేయవద్దని అర్ష్‌దీప్ సింగ్‌కు సూచించినట్లు తెలుస్తోంది. కేవలం ఆటగాళ్లకే కాకుండా, ఫ్రాంచైజీలు, కుటుంబ సభ్యులు కూడా హోటల్ గదులు, డ్రెస్సింగ్ రూమ్‌లు, జట్టు ప్రయాణాలు లేదా మ్యాచ్ వేదికల వెనుక జరిగే కార్యకలాపాలను సోషల్ మీడియాలో పంచుకోవద్దని బోర్డు ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ వీడియోలు చిత్రీకరించినా, వాటిని ఐపీఎల్ ముగిసిన తర్వాత మాత్రమే విడుదల చేయాలని సూచించింది.

భద్రత, గోప్యతపై బోర్డు ఫోకస్
ఈ సీజన్‌లో తలెత్తిన పలు వివాదాల నేపథ్యంలో బీసీసీఐ భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేసింది. అనధికార వ్యక్తులు జట్లతో కలిసి ప్రయాణించడం, హోటళ్లలో ఉండడాన్ని నిషేధిస్తూ కొత్త మార్గదర్శకాలు తీసుకొచ్చింది. అలాగే జట్టు యజమానులు, సపోర్ట్ స్టాఫ్ ఆటగాళ్లను నిర్ణయించిన పరిమితికి మించి కలవకుండా పర్యవేక్షణ పెంచినట్లు సమాచారం. ఇక, కొంతమంది ఆటగాళ్లు తమ ప్రియురాళ్లతో కలిసి ప్రయాణించడం, జట్టు హోటళ్లలోనే బస చేయడం వంటి అంశాలు అవినీతి నిరోధక విభాగం (ACU) దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో హనీ ట్రాప్‌లు లేదా ఇతర వివాదాల నుంచి ఆటగాళ్లను రక్షించేందుకు ఫ్రాంచైజీలకు బీసీసీఐ ప్రత్యేక హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం.

ఇప్పటికే పలు వివాదాలు
ఐపీఎల్ 2026 ప్రారంభంలోనే రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ డ్రెస్సింగ్ రూమ్‌లో వేపింగ్ చేస్తూ కనిపించాడని వార్తలు వచ్చాయి. అదేవిధంగా టీమ్ మేనేజర్ రోమీ భిందర్ డగౌట్ సమీపంలో మొబైల్ ఫోన్ ఉపయోగించడం కూడా చర్చనీయాంశమైంది. ఈ సంఘటనలన్నింటి తర్వాత టోర్నమెంట్‌లో క్రమశిక్షణ, గోప్యత, భద్రతను కచ్చితంగా అమలు చేయాలని బీసీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu