Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Bengal Police: మమతా గూండాల బట్టలూడదీసి..! పశ్చిమబెంగాల్‌లో రౌడీల భరతం పడుతున్న సువెందు అధికారి

Bengal Police: మమతా గూండాల బట్టలూడదీసి..! పశ్చిమబెంగాల్‌లో రౌడీల భరతం పడుతున్న సువెందు అధికారి

NTV Telugu 1 week ago

కప్పుడు రాజకీయ నాయకుల చుట్టూ వీళ్లంతా దర్జాగా తిరిగేవారు… ఇప్పుడు వారిని పోలీసుల లోదుస్తుల్లో వీధుల్లో తిప్పుతున్నారు. ఒకప్పుడు ప్రజలు వీరిని చూసి భయపడేవారు… ఇప్పుడు అదే ప్రజలు వీరిని చూసి చప్పట్లు కొడుతున్నారు.

ఒకప్పుడు అధికార పార్టీ అండతో ప్రాంతాలను శాసించిన స్థానిక దాదాలు… ఇప్పుడు లోదుస్తులతో రోడ్ల మీద నడవాల్సిన పరిస్థితి వచ్చింది. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ప్రస్తుతం కనిపిస్తున్న దృశ్యాలు సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడి పోలీసుల తీరు పూర్తిగా మారిపోయింది.

పశ్చిమ బెంగాల్ అంటే చాలా కాలంగా మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్‌కు కంచుకోటగా పేరుంది. కానీ అదే బెంగాల్‌లో ఇప్పుడు తృణమూల్‌కు చెందిన స్థానిక నేతలు, కార్యకర్తలు, గూండాలు అంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులను పోలీసులు ప్రజల మధ్యలో ఊరేగించడం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.

ఆకాష్‌ సింగ్ ఎవరు?

ముఖ్యంగా ఆకాష్ సింగ్ పేరు మారుమోగుతోంది. ఉత్తర హౌరాలో డాన్ ఆకాష్ సింగ్‌గా పేరున్న ఈ వ్యక్తిపై దాదాపు 20కి పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. 2021లో పోలీసులపై కాల్పులు జరపడం, పేలుడు పదార్థాలు విసరడం లాంటి కేసులు కూడా అతడిపై నమోదయ్యాయి. మే 14న అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు తర్వాత ఆకాశ్‌ చేతులకు బేడీలు వేసి, కేవలం బాక్సర్ షార్ట్‌తో వీధుల్లో తిప్పారు. అంతేకాదు అతడి తల, గడ్డం పూర్తిగా కట్‌ చేశారు. పోలీసులు దీన్ని క్రైమ్ సీన్ రీకన్‌స్ట్రక్షన్ అని చెబుతున్నారు.

షమీమ్‌ అహ్మద్ ఎవరు?

షమీమ్ అహ్మద్ గురించి కూడా బాగా చర్చ నడుస్తోంది. స్థానికంగా గబ్బర్‌గా పిలవబడే ఈ వ్యక్తి హౌరాలోని తృణమూల్ కాంగ్రెస్ వార్డ్ అధ్యక్షుడిగా పనిచేశాడు. మే 7న బీజేపీ మైనారిటీ వింగ్ ర్యాలీపై జరిగిన బాంబు, తుపాకీ దాడి కేసులో ప్రధాన నిందితుడిగా అతడిపై ఆరోపణలు ఉన్నాయి.


ముంబైలోని చెంబూర్ ప్రాంతంలో అరెస్ట్ అయిన అతడిని తిరిగి బెంగాల్‌కు తీసుకొచ్చిన తర్వాత పోలీసులు చేతులకు బేడీలు వేసి ప్రజల మధ్య నడిపించారు. అతడిపై అక్రమ నిర్మాణాలు, వసూళ్లు, స్థానిక గూండాగిరి ఆరోపణలు కూడా ఉన్నాయి. అతడి ఇంట్లో ఐదు అంతస్తుల భవనం, రహస్య మెట్లు, జూదం కేంద్రం, పైకప్పుపై వందలాది మేకల పెంపకం లాంటి విషయాలు బయటపడటంతో ఈ కేసు మరింత సంచలనంగా మారింది.

ఇక మూడో వ్యక్తి సాహిన్ మొల్లా అలియాస్ సన్నీ. ఒకప్పుడు హోం గార్డ్‌గా పనిచేసిన ఈ వ్యక్తిపై స్థానిక వ్యాపారుల నుంచి బలవంతపు వసూళ్లు చేసిన ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు అతడి నడుముకు తాడు కట్టి ప్రాంతమంతా నడిపించిన వీడియో కూడా వైరల్ అయింది. గతంలో కూడా ఇలాంటి ఆరోపణల కారణంగానే అతడు ఉద్యోగం కోల్పోయాడని సమాచారం. స్థానిక ప్రజలు మాత్రం రాజకీయ అండతో అతడు ప్రాంతాన్ని భయపెట్టాడని ఆరోపిస్తున్నారు.

అయితే ఈ అరెస్టులు కేవలం నేరస్థులపై చర్యలా? లేక రాజకీయ శక్తి మార్పు తర్వాత జరిగే అధికార ప్రదర్శనా? ఎందుకంటే పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో చాలా కాలంగా ఒక ఆరోపణ వినిపిస్తూ వచ్చింది. అధికార పార్టీ అండతో కొందరు స్థానిక నేతలు, కార్యకర్తలు, దాదాలు ప్రజలపై ఆధిపత్యం చెలాయించారని, వసూళ్లు చేశారని, ఎన్నికల హింసలో పాల్గొన్నారని ప్రతిపక్షాలు పదేపదే ఆరోపించాయి. ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత అదే వ్యక్తులపై చర్యలు ప్రారంభమయ్యాయి.

మరోవైపు తృణమూల్ కాంగ్రెస్ మాత్రం ఈ మొత్తం వ్యవహారాన్ని తీవ్రంగా ఖండిస్తోంది. పార్టీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ ఈ చర్యలను రాజ్యాంగ విరుద్ధమని, మానవ హక్కుల ఉల్లంఘనగా అభివర్ణించారు. నేరం చేసిన వారిని శిక్షించవచ్చు కానీ వారిని బజార్లలో తాళ్లతో కట్టి ఊరేగించడం చట్టబద్ధ పాలన కాదని వాదిస్తున్నారు. ఒక ప్రభుత్వం సర్కస్ కంపెనీలా వ్యవహరించకూడదని కూడా ఆయన వ్యాఖ్యానించారు.

అయితే మరో వాదన కూడా ఉంది. సంవత్సరాలుగా రాజకీయ రక్షణలో తిరిగిన నేరగాళ్లకు ఇప్పుడు చట్టం ఎలా ఉంటుందో చూపిస్తున్నామని ప్రభుత్వ అనుకూల వర్గాలు చెబుతున్నాయి. పోలీసులపై దాడులు చేసినా, స్థానిక ప్రజలను భయపెట్టినా, రాజకీయ అండతో తప్పించుకున్నవారికి ఇప్పుడు భయం అంటే ఏంటో తెలుస్తోందని వారు అంటున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu