Dailyhunt
Bengal: రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లపై బీజేపీ కీలక ప్రకటన

Bengal: రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లపై బీజేపీ కీలక ప్రకటన

NTV Telugu 1 week ago

సోమవారం వెలువడిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 294 స్థానాలకు గాను 207 స్థానాలు గెలుచుకుని అతి పెద్ద శక్తిగా నిలిచింది.

అయితే ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రాష్ట్రంలో అల్లర్లు జరుగుతున్నాయి. టీఎంసీ కార్యాలయాలు, ఇళ్లు ధ్వంసం అవుతున్నాయి. రోడ్లపై కొన్ని గుంపులు రణరంగం సృష్టిస్తున్నాయి. అయితే బీజేపీనే ఈ దాడులకు ఉసిగొల్పుతోందని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపిస్తోంది.

ఈ నేపథ్యంలో బీజేపీ కీలక ప్రకటన విడుదల చేసింది. తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన 'గుండా వాహిని' పేరుతో కొంతమంది వ్యక్తులు బీజేపీ కార్యకర్తలుగా నటిస్తూ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని బీజేపీ ఆరోపించింది. ''అశాంతిని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఇది నిస్సందేహంగా తెలియజేస్తున్నాము. ఇటువంటి మోసాన్ని బీజేపీ సహించదు.'' అని ఈ మేరకు పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

ఇలాంటి మోసపూరిత చర్యలను ఏ మాత్రం సహించబోమని తెలిపింది. బీజేపీ పేరుతో వేషధారణ చేసి, భయభ్రాంతులకు గురిచేయడం, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం వంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. నేర కార్యకలాపాల్లో పాల్గొనే వారిపై చట్టం తన సంపూర్ణ శక్తితో పనిచేస్తుందని బీజేపీ పేర్కొంది. కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వం చట్టపాలనను పునరుద్ధరించేందుకు, బాధ్యతను నిర్ధారించేందుకు, ప్రతి పౌరుడిని భయభ్రాంతులు లేకుండా రక్షించేందుకు కట్టుబడి ఉందని వెల్లడించింది.

పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. బీజేపీ 207 స్థానాల్లో గెలిచింది. టీఎంసీ 80 సీట్లలో విజయం సాధించింది. అయితే ఓటమి తర్వాత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేందుకు మమతా బెనర్జీ నిరాకరించారు. ఇక ప్రస్తుత ప్రభుత్వం మే 7తో ముగియనుంది. అనంతరం గవర్నర్ ప్రభుత్వాన్ని రద్దు చేసి కొత్త ప్రభుత్వాన్ని ఆహ్వానించే అవకాశం ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu