Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
CBSE: త్రిభాషా విధానంపై సీబీఎస్‌ఈ సంచలన నిర్ణయం

CBSE: త్రిభాషా విధానంపై సీబీఎస్‌ఈ సంచలన నిర్ణయం

NTV Telugu 1 week ago

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. 2026-27 విద్యాసంవత్సరం నుంచి 9, 10 తరగతుల విద్యార్థులకు మూడు భాషలు తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది.

జూలై 1, 2026 నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి రానుంది. ఈ మేరకు మే 15న సీబీఎస్‌ఈ సర్క్యులర్ విడుదల చేసింది. జాతీయ విద్యా విధానం (NEP) 2020, నేషనల్ కరికులం ఫ్రేమ్‌వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ (NCF-SE) 2023కు అనుగుణంగా ఈ మార్పులు చేపట్టినట్లు బోర్డు వెల్లడించింది.

మూడు భాషలు తప్పనిసరి
కొత్త నిబంధనల ప్రకారం 9, 10 తరగతుల విద్యార్థులు R1, R2, R3 పేర్లతో మూడు భాషలను తప్పనిసరిగా అభ్యసించాలి. వీటిలో కనీసం రెండు భారతీయ స్థానిక భాషలే ఉండాలని సీబీఎస్‌ఈ స్పష్టం చేసింది. విద్యార్థులు విదేశీ భాషను ఎంపిక చేసుకోవాలంటే.. మిగతా రెండు భాషలు భారతీయ భాషలే కావాలి. అలాగే విదేశీ భాషను అదనపు నాలుగో భాషగా కూడా తీసుకునే అవకాశం కల్పించారు.

ఎన్‌సీఈఆర్టీ సిలబస్ ఆధారంగా నిర్ణయం
2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించిన 9, 10 తరగతుల ఎన్‌సీఈఆర్టీ సిలబస్‌ను సమీక్షించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీబీఎస్‌ఈ తెలిపింది. ప్రస్తుతం విద్యాసంవత్సరం ఇప్పటికే ప్రారంభమైనందున మార్పులను దశలవారీగా అమలు చేస్తామని పేర్కొంది.

తాత్కాలిక ఏర్పాట్లు
కొత్త R3 పాఠ్యపుస్తకాలు అందుబాటులోకి వచ్చే వరకు 2026-27 విద్యాసంవత్సరంలో 9వ తరగతి విద్యార్థులు 6వ తరగతి R3 పుస్తకాలను ఉపయోగించాల్సి ఉంటుంది. అదనంగా స్థానిక, రాష్ట్ర స్థాయి సాహిత్యాన్ని కూడా బోధనలో భాగం చేయాలని పాఠశాలలకు సూచించింది. ఇందులో కవితలు, చిన్న కథలు, కథా సాహిత్యం వంటివి ఉండొచ్చని తెలిపింది. సప్లిమెంటరీ మెటీరియల్ ఎంపిక, బోధనా విధానాలపై పూర్తి మార్గదర్శకాలను జూన్ 15, 2026లోగా విడుదల చేస్తామని సీబీఎస్‌ఈ వెల్లడించింది. అలాగే 19 షెడ్యూల్డ్ భారతీయ భాషలకు సంబంధించిన 6వ తరగతి R3 పాఠ్యపుస్తకాలను జూలై 1, 2026కు ముందే పాఠశాలలకు అందుబాటులో ఉంచుతామని సీబీఎస్‌ఈ ప్రకటించింది.

ప్రత్యేక వెసులుబాటు
కొన్ని పాఠశాలల్లో భారతీయ భాషల బోధనకు అర్హత కలిగిన ఉపాధ్యాయులు అందుబాటులో లేకపోవచ్చని సీబీఎస్‌ఈ అంగీకరించింది. ఈ నేపథ్యంలో తాత్కాలికంగా కొన్ని ప్రత్యేక చర్యలకు అనుమతి ఇచ్చింది. సహోదయ క్లస్టర్ల ద్వారా పాఠశాలల మధ్య ఉపాధ్యాయుల భాగస్వామ్యం. ఇక రిటైర్డ్ భాషా ఉపాధ్యాయుల సేవలు వినియోగించడం.. అర్హత కలిగిన పీజీ అభ్యర్థులను నియమించడం వంటి చర్యలను చేపట్టవచ్చని తెలిపింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu