Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Chamari Athapaththu: కెప్టెన్‌ సంచలనం.. 5 పరుగులిచ్చి 7 వికెట్లు డౌన్..! హ్యాట్రిక్‌ కూడాను..

Chamari Athapaththu: కెప్టెన్‌ సంచలనం.. 5 పరుగులిచ్చి 7 వికెట్లు డౌన్..! హ్యాట్రిక్‌ కూడాను..

NTV Telugu 3 days ago

Chamari Athapaththu: మహిళల ఆసియా కప్‌లో శ్రీలంక జోరు కొనసాగుతోంది. బుధవారం (సెప్టెంబర్‌ 2) జరిగిన మ్యాచ్‌లో ఇండోనేషియాపై శ్రీలంక 75 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.

తొలుత బ్యాటింగ్‌లో తడబడిన శ్రీలంక.. నీలాక్షిక సిల్వా చేసిన అర్ధ శతకంతో గౌరవప్రదమైన స్కోరు సాధించింది. ఆ తర్వాత కెప్టెన్‌ చమరి అటపట్టు సంచలన బౌలింగ్‌తో ఇండోనేషియా బ్యాటింగ్‌ లైనప్‌ను కుప్పకూల్చింది.

మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్‌ గెలిచిన ఇండోనేషియా తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఆ జట్టు బౌలర్లు ఆరంభంలో శ్రీలంక బ్యాటర్లపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. రెండో ఓవర్లోనే ఇమేషా దులానీ వికెట్‌ను పడగొట్టి ఇండోనేషియా తొలి దెబ్బ కొట్టింది. ఆ తర్వాత స్పిన్నర్లు కూడా వరుసగా వికెట్లు తీస్తూ శ్రీలంకను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టారు.

ఒక దశలో శ్రీలంక కేవలం 36 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కూడా పరిస్థితి మెరుగుపడలేదు. 68 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న శ్రీలంకను నీలాక్షిక సిల్వా ఆదుకుంది. దాదాపు 43 బంతుల పాటు ఒక్క బౌండరీ కూడా లేకుండా జాగ్రత్తగా ఆడిన ఆమె.. చివరి దశలో కాస్త బ్యాట్‌ ను ఝుళిపించింది. ఆ తర్వాత సిక్సర్‌ బాది అర్ధ శతకాన్ని పూర్తి చేసుకుంది. టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో సిల్వాకు ఇది మూడో అర్ధ శతకం. 50 పరుగులు చేసిన వెంటనే ఆమె ఔటైనా.. శ్రీలంక 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది.

125 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండోనేషియాకు శ్రీలంక బౌలర్లు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. ముఖ్యంగా కెప్టెన్‌ చమరి అటపట్టు తన స్పిన్‌ బౌలింగ్‌తో ఇండోనేషియా బ్యాటర్లను వణికించింది. మొదట ఓపెనర్‌ పాంగెస్టుటి వికెట్‌ను పడగొట్టిన అటపట్టు.. ఆ తర్వాత కూడా వరుసగా వికెట్లు తీస్తూ ఇండోనేషియా ఇన్నింగ్స్‌ను దెబ్బతీసింది. పదో ఓవర్‌ ముగిసే సమయానికి ఇండోనేషియా 29 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కూడా పరుగులు రావడం కష్టంగా మారింది. రెండో ఓవర్‌ నుంచి 15వ ఓవర్‌ వరకు ఇండోనేషియా బ్యాటర్ల నుంచి కేవలం ఒక బౌండరీ మాత్రమే వచ్చింది. శ్రీలంక బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఇండోనేషియా బ్యాటింగ్‌ పూర్తిగా చేతులెత్తేసింది.

ఇక చివరి దశలో అటపట్టు మరోసారి విజృంభించింది. వరుసగా అరియాని, మాయ్‌ప్రియాని, పరమితి వికెట్లు తీసి హ్యాట్రిక్‌ సాధించింది. మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో శ్రీలంక తరఫున ఇదే తొలి హ్యాట్రిక్‌ కావడం విశేషం. అంతేకాదు, అంతర్జాతీయ క్రికెట్‌లో అటపట్టుకు ఇదే తొలి 5 వికెట్ల ప్రదర్శన. దీనితో చివరకు ఇండోనేషియా 18.3 ఓవర్లలో 49 పరుగులకే ఆలౌటైంది. అటపట్టు కేవలం 5 పరుగులు ఇచ్చి ఏకంగా 7 వికెట్లు పడగొట్టింది. ఇది ఆమె కెరీర్‌లోనే అత్యుత్తమ బౌలింగ్‌ ప్రదర్శన. శ్రీలంక తరఫున మహిళల టీ20ల్లో ఇదే అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు.

సంక్షిప్త స్కోర్లు:

శ్రీలంక మహిళలు 20 ఓవర్లలో 124/7 (నీలాక్షిక సిల్వా 50, సంజన కవిందీ 15; దేవి 3/23, మాయ్‌ప్రియాని 2/19). ఇండోనేషియా మహిళలు 18.3 ఓవర్లలో 49 ఆలౌట్‌ (సువాండేవి 12, పాంగెస్టుటి 10; చమరి అటపట్టు 7/5, కుమారి 1/3). శ్రీలంక 75 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu