Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Chandrababu: 'అప్పుడు మూడు రాజధానులు.. ఇప్పుడు మావిగన్'.. జగన్‌పై చంద్రబాబు సెటైర్లు

Chandrababu: 'అప్పుడు మూడు రాజధానులు.. ఇప్పుడు మావిగన్'.. జగన్‌పై చంద్రబాబు సెటైర్లు

NTV Telugu 2 weeks ago

Chandrababu: తిరుపతి జిల్లా ముక్కాపారిపల్లెలో నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి, అమరావతి నిర్మాణం, కూటమి ప్రభుత్వ లక్ష్యాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా ప్రతిపక్షం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించిన ఆయన, ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత మరో మాట చెప్పడం వారి రాజకీయ విధానంగా మారిందన్నారు. గతంలో మూడు రాజధానుల పేరుతో ప్రజలను గందరగోళానికి గురిచేశారని విమర్శించిన చంద్రబాబు, ఇప్పుడు “మావిగన్” అంటూ కొత్త నినాదం తీసుకొచ్చారని ఎద్దేవా చేశారు. “మావిగన్ అంటే ఏమిటో ఎవరికైనా అర్థమైందా?” అని ప్రశ్నించారు. అమరావతిని అడ్డుకోవడం ఎవరి వల్ల కాదని, రాజధాని నిర్మాణ పనులు కేంద్ర సహకారంతో వేగంగా కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు.

రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి బాటలోకి తీసుకొస్తామని ఇచ్చిన హామీని రెండేళ్లలోనే నిలబెట్టుకున్నామని చంద్రబాబు అన్నారు. గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన 93 కేంద్ర పథకాలను తిరిగి పునరుద్ధరించామని, జల్ జీవన్ మిషన్ సహా పలు అభివృద్ధి కార్యక్రమాలకు రూ.28 వేల కోట్లు వెచ్చిస్తున్నామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టును గోదావరి పుష్కరాల కంటే ముందే పూర్తి చేసి దేశానికి అంకితం చేస్తామని సీఎం ప్రకటించారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను నిలబెట్టడంతో పాటు రైల్వే జోన్ సాధించామని, రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తీసుకొస్తున్నామని చెప్పారు. గూగుల్ డేటా సెంటర్, పుట్టపర్తిలో యుద్ధ విమానాల తయారీ యూనిట్, తిరుపతిలో బుల్లెట్ మోటార్‌సైకిల్ తయారీ ప్లాంట్ వంటి ప్రాజెక్టులు రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి దోహదం చేస్తాయని తెలిపారు.

ఇక, రాయలసీమను ఉద్యాన పంటల కేంద్రంగా మరింత అభివృద్ధి చేస్తామని, మదనపల్లిలో త్వరలో హార్టికల్చర్ హబ్‌కు శంకుస్థాపన చేస్తామని వెల్లడించారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల నుంచి భారీ పెట్టుబడులతో రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఇచ్చిన ప్రతి హామీ ఇప్పటికే నెరవేర్చామని చెప్పడం లేదని, అయితే వాటి అమలుకు శుభారంభం చేశామని చంద్రబాబు పేర్కొన్నారు. “దేశం ముందు.. ఆ తర్వాత మనం” అనే స్ఫూర్తితో ప్రజలందరూ ప్రభుత్వానికి సహకరించాలని పిలుపునిచ్చారు. వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యాలతో రాష్ట్ర అభివృద్ధి నిరంతరం కొనసాగుతుందని, స్వర్ణాంధ్రప్రదేశ్ ఇక “అన్‌స్టాపబుల్” అని వ్యాఖ్యానించారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu