Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
CM Revanth Reddy: మన్మోహన్ సింగ్ గొప్ప రాజనీతిజ్ఞుడు.. 'భారతరత్న' ఇవ్వాల్సిందే..

CM Revanth Reddy: మన్మోహన్ సింగ్ గొప్ప రాజనీతిజ్ఞుడు.. 'భారతరత్న' ఇవ్వాల్సిందే..

NTV Telugu 15 hrs ago

హైదరాబాద్‌లోని విప్రో సర్కిల్‌లో దివంగత మాజీ ప్రధాన మంత్రి, దేశమే గర్వించదగిన గొప్ప రాజనీతిజ్ఞుడు మన్మోహన్ సింగ్ విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… మన్మోహన్ సింగ్ దేశానికి అందించిన సేవలను, ఆర్థిక సంస్కరణలను కొనియాడారు. పీవీ నరసింహారావుతో కలిసి ఆయన చేపట్టిన సరళీకృత ఆర్థిక విధానాలే దేశాన్ని తీవ్ర ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించి, నేడు భారత ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడానికి పునాది వేశాయని గుర్తుచేశారు. దేశ జీడీపీలో ఐదు శాతం ఆదాయాన్ని సమకూర్చే సంస్థలు అన్నీ హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచే వస్తున్నాయని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మన్మోహన్ సింగ్ పాత్రను స్మరించుకుంటూ.. రాష్ట్ర స్వరాష్ట్ర ఆకాంక్షను నిజం చేస్తూ తెలంగాణ బిల్లుపై ఆయన చేసిన సంతకం సువర్ణాక్షరాలతో లిఖించదగినదని, విగ్రహం వద్ద ఆ సంతకాన్ని కూడా నిక్షిప్తం చేశామని తెలిపారు. జాతీయ స్థాయిలో నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ కాంబినేషన్ దేశానికి స్వేచ్ఛను ఇస్తే.. సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ కాంబినేషన్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో పాటు పేదలకు ఉపాధి హామీ పథకం, విద్యా హక్కు చట్టం, పకడ్బందీ పునరావాస చట్టాలను తెచ్చిందని కొనియాడారు.

మౌనమే భాషగా మార్చుకుని దేశాభివృద్ధికి నిస్వార్థంగా సేవలందించిన మన్మోహన్ సింగ్‌కు కేంద్ర ప్రభుత్వం వెంటనే 'భారతరత్న' ప్రకటించాలని, ఢిల్లీలో ఆయన పేరు మీద ఒక స్మారక భవనం, విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ సాధన కోసం కాంగ్రెస్ ఎంపీలు, అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలతో కలిసి పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తామని స్పష్టం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu