Daayra: కరీనా కపూర్ ఖాన్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటించిన హిందీ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా 'దాయ్‌రా' (Daayra). జాతీయ అవార్డు గ్రహీత మేఘ్నా గుల్జార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జంగ్లీ పిక్చర్స్, పెన్ స్టూడియోస్ పతాకాలపై వినీత్ జైన్, ధవల్ గడా సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా 2026 సెప్టెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.
ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్ డీసీపీ రామన్ కుమార్ పాత్రలో, కరీనా కపూర్ డీసీపీ అజూని కోహ్లీ పాత్రలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్లుగా నటిస్తున్నారు.
నిజజీవిత సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా ప్రమోషనల్ ట్రైలర్‌ను నిన్ననే (సెప్టెంబర్ 15న) విడుదల చేశారు. అయితే ఈ క్రైమ్ థ్రిల్లర్ ట్రైలర్, ప్రోమోలలో కనిపిస్తున్న కొన్ని సన్నివేశాలు 2019లో హైదరాబాద్‌లో జరిగిన వెటర్నరీ డాక్టర్ పై అఘాయిత్యం, హత్య కేసుతో పాటు ఆ తర్వాత జరిగిన పోలీస్ ఎన్‌కౌంటర్‌ను గుర్తు చేస్తున్నాయి. దీంతో అసలు 'దాయరా' కథ దిశ కేసు ఆధారంగానే తెరకెక్కిందా? అనే చర్చ మొదలైంది. సినిమా ట్రైలర్ చూశాక 'దాయరా' 2019 హైదరాబాద్ దిశా (వెటర్నరీ డాక్టర్) పై అఘాయిత్యం, పోలీస్ ఎన్‌కౌంటర్ ఆధారంగా మాత్రమే వస్తోందని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.
అయితే ఇటీవల జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో దర్శకురాలు మేఘ్నా గుల్జార్ ఈ విషయంపై స్పష్టతనిచ్చారు. 'దాయరా' 2019 హైదరాబాద్ అత్యాచారం, హత్య కేసును నేరుగా ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన సినిమా మాత్రం కాదని మేఘనా గుల్జార్ స్పష్టం చేశారు. సినిమా ట్రైలర్ విడుదల సందర్భంగా ఈ విషయంపై మాట్లాడిన ఆమె, కథను ఒకే ఘటనకు పరిమితం చేయలేదని చెప్పారు. దేశవ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు అనేకం జరిగాయని, వాటిలోని వివిధ అంశాలను తీసుకుని 'దాయరా' కథను రూపొందించినట్లు వెల్లడించారు. అందుకే ఈ సినిమాను ఒక సిటీ, రాష్ట్రం, పోలీస్ విభాగానికి సంబంధించిన కథగా చూడకూడదని ఆమె వివరించారు.
ఇక 2019లో హైదరాబాద్ శివార్లలో జరిగిన ఆ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. 26 ఏళ్ల వెటర్నరీ వైద్యురాలిపై అఘాయిత్యం చేసి హత్య చేసిన కేసులో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం 2019 డిసెంబర్ 6న నిందితులను చటాన్‌పల్లికి తీసుకెళ్లిన సమయంలో వారు పోలీసులపై దాడి చేసి పారిపోవడానికి ప్రయత్నించారని, ఈ క్రమంలో జరిగిన కాల్పుల్లో నలుగురూ మరణించారని పోలీసులు అప్పట్లో వెల్లడించారు. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించింది. దర్శకురాలు చెబుతున్నట్టు.. నిజ జీవిత ఘటనల నుంచి ప్రేరణ పొందిన ఈ క్రైమ్ థ్రిల్లర్ నిజంగానే దిశ కేసు ఆధారంగా తెరకెక్కిందా ? లేక మరో కోణంలో కథ నడుస్తుందా ? అనేది సెప్టెంబర్ 18 థియేటర్లలో ఈ సినిమా విడుదల అయ్యాకే క్లారిటీ రానుంది.

