Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Dal Ki Dulhan : రొటీన్ గా రొట్టెలు తిని విసిగిపోయారా ? అయితే నోరూరించే నార్త్ స్పెషల్ 'దాల్ కీ దుల్హన్' ట్రై చేయండి.

Dal Ki Dulhan : రొటీన్ గా రొట్టెలు తిని విసిగిపోయారా ? అయితే నోరూరించే నార్త్ స్పెషల్ 'దాల్ కీ దుల్హన్' ట్రై చేయండి.

NTV Telugu 4 months ago

Dal Ki Dulhan: మే నెల ఎండలు మండిపోతున్న వేళ… కడుపుకు భారంగా కాకుండా, తిన్నాక కూడా తేలికగా అనిపించే ఆహారం కోసం చాలామంది వెతుకుతుంటారు. ప్రతిరోజూ అదే రొట్టె, అదే కూర, అదే పప్పు తింటూ బోర్ కొట్టేసినప్పుడు… ఒక్కసారి ఉత్తరప్రదేశ్, బీహార్ ప్రాంతాల సంప్రదాయ వంటకాల వైపు చూపు తిప్పితే అక్కడి గ్రామీణ వంటల్లో దాగి ఉన్న అసలైన రుచులు ఆశ్చర్యపరుస్తాయి.

అలాంటి వంటకాల్లో ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో, ఫుడ్ బ్లాగుల్లో వైరల్ అవుతున్న పేరు 'దాల్ కీ దుల్హన్'. పేరు వినగానే ఆసక్తి కలిగించే ఈ వంటకం… అసలు చూస్తే పప్పులో మునిగిన చిన్న చిన్న పిండి ముద్దల కథ. కానీ రుచి మాత్రం ఒకసారి తింటే మళ్లీ మళ్లీ గుర్తొచ్చేలా ఉంటుంది.

బీహార్, ఉత్తరప్రదేశ్ గ్రామీణ కుటుంబాల్లో తరతరాలుగా వండుతున్న ఈ వంటకం అక్కడి సాంప్రదాయ ఆహార సంస్కృతిలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. కొన్ని ప్రాంతాల్లో దీనిని 'దాల్ పిఠా', మరికొన్ని చోట్ల 'దాల్ ధోక్లీ' అని కూడా పిలుస్తారు. అయితే 'దాల్ కీ దుల్హన్' అనే పేరు మాత్రం ఈ వంటకానికి మరింత ప్రత్యేకత తీసుకొచ్చింది. పప్పులో ఉడికే పిండి ముక్కలు చిన్న పెళ్లికూతురు లెహంగా ఆకారంలో కనిపించడంతో ఈ పేరు వచ్చిందని అక్కడి పెద్దలు చెబుతుంటారు. గ్రామీణ భారతీయ వంటల్లో పేర్ల వెనుక కూడా కథలు ఉంటాయనే విషయం ఈ డిష్ మరోసారి గుర్తు చేస్తుంది.

ఈ వంటకం ప్రత్యేకత ఏంటంటే… చాలా తక్కువ నూనె, నెయ్యితో తయారవుతుంది. కందిపప్పు, గోధుమ పిండి ప్రధాన పదార్థాలు కావడంతో ఇది పోషకాహారంగా కూడా గుర్తింపు పొందింది. వేసవిలో జీర్ణక్రియ మందగించే సమయంలో భారమైన ఫ్రైలు, మసాలా కూరల కంటే ఇలాంటి తేలికపాటి వంటకాలు శరీరానికి మేలు చేస్తాయని పోషకాహార నిపుణులు కూడా చెబుతున్నారు. కందిపప్పులో ఉండే ప్రోటీన్ శరీరానికి బలం ఇస్తే, గోధుమపిండి తగిన కార్బోహైడ్రేట్లు అందిస్తుంది. ముఖ్యంగా ఇంట్లో కూరగాయలు లేని సమయంలో కూడా ఈ ఒక్క వంటకం పూర్తి భోజనంలా సరిపోతుంది.

దీన్ని తయారు చేసే విధానం కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ముందుగా కందిపప్పును పసుపు, ఉప్పుతో మెత్తగా కాకుండా కొద్దిగా పలుచగా ఉడికిస్తారు. మరోవైపు గోధుమపిండిలో వాము, ఉప్పు కలిపి ముద్దలా చేసి పెద్ద రొట్టెలా ఒత్తుతారు. తర్వాత చిన్న చిన్న గుండ్రని ముక్కలుగా కట్ చేసి, చేతులతో నాలుగు మూలలను కలిపి పువ్వు ఆకారంలో మలుస్తారు. ఈ చిన్న పిండి ముక్కలనే ఉడుకుతున్న పప్పులో వేసి మెల్లగా ఉడికిస్తారు. ఆ తర్వాత జీలకర్ర, ఇంగువ, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటాలతో చేసిన తాలింపు వేసినప్పుడు మొత్తం వంటగది ఒక అద్భుతమైన వాసనతో నిండిపోతుంది.

బీహార్, యూపీల్లో ఈ వంటకాన్ని సాధారణంగా బంగాళదుంప చోఖా, వంకాయ భర్తా, పచ్చి మిర్చి చట్నీ, మామిడి ఊరగాయతో వడ్డిస్తారు. పైన ఒక చెంచా నెయ్యి వేసుకుంటే రుచి మరింత పెరుగుతుంది. గ్రామీణ భారతదేశం ఎంత సరళమైన పదార్థాలతో కూడా అద్భుతమైన వంటకాలు సృష్టించగలదో 'దాల్ కీ దుల్హన్' మరోసారి నిరూపిస్తోంది. ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావంతో ఈ సంప్రదాయ వంటకం మళ్లీ యువతలోకి వస్తుండటం విశేషం. బయట ఫాస్ట్ ఫుడ్‌లకు అలవాటు పడిన తరం కూడా ఇప్పుడు ఇలాంటి దేశీ వంటకాల వైపు తిరిగి చూస్తోంది. ఇక ఈ వంటకాన్ని తయారు చేసి మీ ఇంటిని పండుగ వాతావరణం చేసుకోవచ్చు కూడా.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu