Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Drishyam 3 Telugu review: దృశ్యం 3 మూవీ రివ్యూ

Drishyam 3 Telugu review: దృశ్యం 3 మూవీ రివ్యూ

NTV Telugu 4 days ago

లయాళంలో 'దృశ్యం' సిరీస్ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మోహన్ లాల్ హీరోగా, మీనా హీరోయిన్‌గా ఈ సినిమాను జీతూ జోసెఫ్ రూపొందించారు.

మొదటి భాగంతో పాటు రెండో భాగం కూడా సూపర్ హిట్ కావడంతో, ఈ సినిమాకి సంబంధించి మూడో భాగాన్ని అట్టహాసంగా అనౌన్స్ చేశారు. ముందు భాగాలకు జరిగిన విధంగానే ఈ సినిమాను కూడా వెంకటేష్‌తో రీమేక్ చేస్తారేమో అని అందరూ అనుకున్నారు. కానీ వెంకటేష్ డేట్లు కుదరకపోవడంతో, నేరుగా మోహన్ లాల్ నటించిన 'దృశ్యం 3' మలయాళ సినిమాను తెలుగులో అదే పేరుతో డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.

దృశ్యం 3 కథ:
తన కుటుంబం ఇబ్బంది పడకూడదని భావించి, వరుణ్ హత్య కేసు నుంచి బయటపడే ప్రయత్నం చేసిన జార్జ్‌కుట్టి (మోహన్ లాల్), ఆ బయటపడటం కోసం ఏకంగా ఒక సినీ రచయితతోనే ప్లాన్ చేయించి ఒక కథ సిద్ధం చేయిస్తాడు. అయితే ఎలాగో డబ్బు ఖర్చు పెట్టి కథ సిద్ధం చేయించాం కదా అనే ఉద్దేశంతో, ఆ సినిమాను స్వయంగా తనే నిర్మాతగా మారి నిర్మిస్తాడు. ఇక ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో అతని దశ తిరిగిపోతుంది.
తన పెద్ద కుమార్తెకు పెళ్లి చేయాలని సంబంధాలు చూస్తుంటే, వచ్చిన ప్రతి సంబంధం ఏదో ఒక కారణంతో తప్పిపోతూ ఉంటుంది. అయితే తన కుమార్తె సంబంధాలను కావాలని ఎవరో చెడగొడుతున్నారనే విషయం తెలుసుకున్న జార్జ్, వారు ఎవరో కనిపెట్టే పనిలో పడతాడు. ఈ క్రమంలో ఎన్నో విషయాలు జార్జ్ దృష్టికి వస్తాయి. మరి జార్జ్ అనుకున్నట్టుగానే తన కుమార్తె పెళ్లి చేశాడా? కుమారుణ్ణి పోగొట్టుకున్న గీతా ప్రభాకర్, ప్రభాకర్ దంపతులు మళ్లీ జార్జ్ లైఫ్‌లోకి ఎంట్రీ ఇచ్చారా? తమ కుమారుడి హత్యకు పగ తీర్చుకున్నారా? చివరికి ఏం జరిగింది? అనే విషయాలు తెలియాలంటే సినిమాను బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.

విశ్లేషణ
నిజానికి 'దృశ్యం' మొదటి భాగం వచ్చినప్పుడే తెలుగు ప్రేక్షకులు ఆ ట్విస్టులకు మెస్మరైజ్ అయ్యారు. ఇప్పటికీ ఏదైనా మర్డర్ కేస్ అన్‌సాల్వ్‌డ్‌గా ఉందంటే, "ఇదేదో దృశ్యం మర్డర్ కేస్ లాగే ఉంది" అంటూ పోలికలు సైతం పెడుతూ ఉంటారు. అయితే ఈ మూడవ భాగం కూడా మొదటి రెండు భాగాలకు కొనసాగింపుగానే రాసుకున్నారు. వాస్తవానికి ఈ మధ్యకాలంలో వస్తున్న ఎక్కువ సినిమాల్లో మొదటి భాగానికి, రెండో భాగానికి ఏమాత్రం సంబంధం ఉండటం లేదు. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం సెకండ్ పార్ట్‌కు కంటిన్యూషన్‌గా థర్డ్ పార్ట్ ఉంటుంది.

కేసు నుంచి తప్పించుకున్న జార్జ్, దాని ఆధారంగా ఒక సినిమా చేయడం, ఆ సినిమా ద్వారా కోట్లలో ఆదాయం రావడంతో అతని జీవనశైలి పెరుగుతుంది. అయితే కూతురికి పెళ్లి చేయాలని ప్రయత్నిస్తున్న క్రమంలో ఎదురయ్యే పరిస్థితులను సినిమా ఫస్ట్ హాఫ్‌లో చూపించారు. ఫస్ట్ హాఫ్‌లో ఎలాంటి విషయాలను రివీల్ చేయకుండా, జార్జ్ వెనుక ఎవరో పడుతున్నారు అని అనుమానం కలిగించే ప్రయత్నం చేశారు.
ఇక అసలు కథ సెకండ్ హాఫ్‌లోనే మొదలవుతుంది. ఈ కేసు ద్వారా ఇబ్బంది పడిన సహదేవ్ అనే ఒక పోలీస్ కానిస్టేబుల్, ఎందుకు ఇంకా జార్జ్ వెంట పడుతున్నాడు అనే విషయాన్ని ఆసక్తికరంగా చూపించారు. సెకండ్ హాఫ్‌లో కూడా చాలా వరకు సాగదీస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. "ఎందుకు అదే కేసును ఇంకా సాగదీస్తున్నారు?" అనే ఫీలింగ్ కలుగుతున్న సమయంలోనే, అసలైన ట్విస్టులు రాసుకుని ప్రేక్షకులను మెస్మరైజ్ చేసే ప్రయత్నం చేశాడు దర్శకుడు జీతూ జోసెఫ్.

అయితే మొదటి రెండు భాగాలు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసినంతగా, ఎంగేజ్ చేసినంతగా ఈ భాగం మాత్రం ఎంగేజ్ చేయలేకపోయింది. దానికి తోడు తెలుగు డబ్బింగ్ కూడా వరస్ట్‌గా అనిపించింది. ఈ మధ్యకాలంలో డబ్బింగ్ విషయంలో చాలా సినిమాలు కేర్ తీసుకుంటున్నా, ఈ సినిమా విషయంలో మాత్రం ఎందుకో లైట్ తీసుకున్నట్లు అనిపిస్తుంది. కొన్ని సంభాషణలు మరీ కామెడీగా అనిపిస్తే, మరికొన్ని మాత్రం "ఈ మాత్రం కూడా దృష్టి పెట్టలేరా?" అనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే, మొదటి రెండు పార్ట్‌లతో పోలిస్తే ఈ మూడవ పార్ట్ ప్రేక్షకులను పూర్తిస్థాయిలో ఎంగేజ్ చేయలేకపోయింది. అలా అని పూర్తిస్థాయిలో తీసి పక్కన పెట్టేదగ్గ సినిమా కాదు, కొంతవరకు ఎంగేజింగ్‌గా తీసుకురావడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.

నటీనటుల నటన & సాంకేతిక వర్గం
జార్జ్ పాత్రలో మోహన్ లాల్ ఒదిగిపోయాడు. ఎప్పటిలాగే తనదైన శైలిలో సైలెన్స్‌తో కూడిన యాక్టింగ్‌తో ఆకట్టుకున్నాడు. మీనా పాత్ర పర్వాలేదు. కుమార్తెల పాత్రల్లో నటించిన ఇద్దరు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. ఇక సహదేవ్ పాత్రధారి భయపెట్టేలా నటించాడు. మిగిలిన పాత్రధారులు అందరూ తమ తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు.

ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. సింపుల్‌గా, చాలా సిల్లీ లైన్ అయినా కూడా సెకండ్ హాఫ్‌లో నడిపించిన స్క్రీన్‌ప్లేతో కొంతవరకు ఎంగేజింగ్‌గా రాసుకున్నాడు డైరెక్టర్. అయితే ఇలాంటి లైనే కాకుండా ఇంకా బెటర్ గా చేసే అవకాశం ఉన్నా కూడా, ఎందుకో కావాలని కథను బయటకు వెళ్లకుండా అక్కడక్కడే తిప్పిన ఫీలింగ్ కలుగుతుంది. దానికి తోడు తెలుగు డబ్బింగ్ కూడా వరస్ట్ అని చెప్పొచ్చు, ఈ విషయంలో ఇంకా కేర్ తీసుకుని ఉంటే బెటర్ రిజల్ట్స్ వచ్చేవేమో. ఇక సినిమాటోగ్రఫి మాత్రం టాప్ క్వాలిటీతో ఉంది. మ్యూజిక్ సినిమాకి తగ్గట్టుగా ఉంది, అనవసరమైన పాటలేవీ లేకపోవడం కొంతవరకు ఊరటనిచ్చే విషయం. అయితే ఈ సినిమా ఎడిటింగ్ విషయంలో కూడా ఇంకా కేర్ తీసుకుని ఉండవచ్చు, ఇంకొంచెం ట్రిమ్ చేసి ఉండాల్సింది.

ఫైనల్ వర్డిక్ట్: ఈ 'దృశ్యం 3'.. కొంతవరకు ఎంగేజింగ్ థ్రిల్లరే.. కానీ మొదటి రెండు భాగాలను దృష్టిలో పెట్టుకుని, భారీ అంచనాలతో థియేటర్‌కు వెళ్ళే వారు మాత్రం నిరాశ పడతారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu