Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు పండగలాంటి న్యూస్.. ఇకపై నిమిషాల్లోనే జేబుల్లోకి క్యాష్!

EPFO: పీఎఫ్ ఖాతాదారులకు పండగలాంటి న్యూస్.. ఇకపై నిమిషాల్లోనే జేబుల్లోకి క్యాష్!

NTV Telugu 5 days ago

పీఎఫ్ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం పండగలాంటి న్యూస్ చెప్పింది. ఒకప్పుడు పీఎఫ్ విత్‌డ్రా చేసుకోవాలంటే ఇంటర్నెట్ సెంటర్‌కు వెళ్లడం. వాళ్లకు కొంత డబ్బు ముట్టజెప్పడం.

మళ్లీ డబ్బులు రావడానికి మరికొన్ని రోజులు పట్టడం.. ఈ తతంగమంతా ఉండేది. ఇక సామాన్యుల పరిస్థితి మరో ఘోరంగా ఉండేది. ఇప్పుడు అలాంటి బాధలేమీ లేకుండా నిమిషాల్లోనే మీ జేబుల్లోకి మనీ చేరేలా కేంద్ర ప్రభుత్వం చక్కని ఏర్పాట్లు చేసింది.

త్వరలోనే యూపీఐ (UPI) ద్వారా నేరుగా పీఎఫ్ డబ్బులను బ్యాంక్ ఖాతాల్లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకునే సదుపాయం అందుబాటులోకి రానుంది. ఈ కొత్త విధానం పరీక్షలను పూర్తి చేసినట్లు కేంద్ర కార్మికశాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా తాజాగా వెల్లడించారు. దీంతో పీఎఫ్ డబ్బులు నిమిషాల్లోనే సభ్యుల బ్యాంక్ ఖాతాల్లోకి చేరనున్నాయి.

మంగళవారం మాండవియా మీడియాతో మాట్లాడారు.. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (EPFO) సేవలను మరింత సులభతరం చేసేందుకు పలు కీలక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ''యూపీఐ పేమెంట్ గేట్‌వే ద్వారా EPF ఉపసంహరణ సదుపాయం పరీక్షలను పూర్తిచేశాం. సభ్యులు తమ EPF డబ్బులను నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి బదిలీ చేసుకునే అవకాశం ఉంటుంది'' అని చెప్పారు.

ఈ సేవలను వచ్చే నెలలో ప్రారంభించే అవకాశం ఉందని మంత్రి మాండవియా వెల్లడించారు. మరోవైపు ఈపీఎఫ్‌వోలో పెండింగ్‌లో ఉన్న న్యాయపరమైన కేసులను కూడా తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం పెండింగ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు వెల్లడించారు.

ప్రస్తుతం ఖాతాదారులు తమ పీఎఫ్ డబ్బులు తీసుకోవాలంటే క్లెయిమ్ దరఖాస్తు చేసుకోవాలి. ఈ ప్రక్రియకు కొంత సమయం పడుతోంది. కానీ కొత్త యూపీఐ వ్యవస్థ అమల్లోకి వస్తే.. సభ్యులు తమ ఖాతాలో అందుబాటులో ఉన్న ఉపసంహరణ అర్హత గల పీఎఫ్ మొత్తాన్ని చూసి.. UPI PIN ద్వారా సురక్షితంగా నేరుగా బ్యాంక్ ఖాతాలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. అనంతరం ఆ డబ్బును డిజిటల్ చెల్లింపులు చేయడానికి లేదా ATM ద్వారా విత్‌డ్రా చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు.

ఈ కొత్త విధానం వల్ల దేశవ్యాప్తంగా 7 కోట్లకు పైగా పీఎఫ్ ఖాతాదారులకు ప్రయోజనం చేకూరనుంది. ప్రస్తుతం ఆటో సెటిల్‌మెంట్ విధానంలో పీఎఫ్ క్లెయిమ్‌లు దాఖలు చేసిన మూడు రోజుల్లోగా పరిష్కారం అవుతున్నాయి. ఇటీవలే ఈ ఆటో సెటిల్‌మెంట్ పరిమితిని రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచారు. అనారోగ్యం, విద్య, వివాహం, గృహ అవసరాల కోసం సభ్యులు త్వరగా పీఎఫ్ డబ్బులు పొందేందుకు ఇది సహాయపడుతోంది.

ఇక సభ్యుల సేవలను మరింత సులభతరం చేసేందుకు ఈపీఎఫ్‌వో వాట్సాప్ సేవలను కూడా ప్రారంభించనుంది. సభ్యులు ఈపీఎఫ్‌వో అధికారిక వాట్సాప్ నంబర్‌కు "Hello" అని మెసేజ్ పంపితే సేవలు పొందగలుగుతారు. గ్రీన్ టిక్‌తో ధృవీకరించిన అధికారిక నంబర్ ద్వారానే ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. వాట్సాప్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్, చివరి 5 లావాదేవీలు, క్లెయిమ్ స్టేటస్ వంటి వివరాలు తెలుసుకోవచ్చు. స్థానిక భాషల్లో కూడా ఈ సేవలు అందుబాటులో ఉండనున్నాయి. 24 గంటలపాటు ఆటోమేటెడ్ సేవలు పనిచేస్తాయని అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఆధార్ ఫేస్ ఆథెంటికేషన్ లేదా DBT లింకింగ్ పూర్తి చేయని సభ్యులకు వాట్సాప్ ద్వారానే సహాయం అందించనున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu