ఈ రాష్ట్రాలే రిస్క్‌లో ఎందుకు?
ఉత్తరప్రదేశ్‌తో పాటు ఆంధ్రప్రదేశ్ ఎందుకు రిస్క్ జోన్‌లో ఉన్నాయో తెలుసుకోవాలి. దీనికి సమాధానం వాతావరణ మార్పుల్లో దాగి ఉంది. భూమి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి… సముద్రాల వేడి పెరుగుతోంది… ముఖ్యంగా బంగాళాఖాతంలో ఉష్ణోగ్రతలు పెరగడంతో గాల్లో తేమ విపరీతంగా పెరుగుతోంది. వేడి గాలి పైకి ఎగురుతుంది… చల్లని గాలి దాన్ని ఢీకొంటుంది. ఈ రెండు గాలుల మధ్య ఏర్పడే భారీ విద్యుత్ ఘర్షణే పిడుగు. మేఘాల మధ్య లక్షల కోట్ల వోల్టుల విద్యుత్ చేరినప్పుడు అది ఒక్కసారిగా భూమిపై పడుతుంది. అదే మెరుపు… అదే పిడుగు…!
ఒక్క డిగ్రీ పెరిగినా అంతేసంగతి:
భూమి ఉష్ణోగ్రత ఒక్క డిగ్రీ పెరిగినా పిడుగుల తీవ్రత 10 నుంచి 12 శాతం వరకు పెరిగే అవకాశం ఉందంటున్నారు సైంటిస్టులు. అడవుల నరికివేత, కాలుష్యం, నగరాల వేడి లాంటి అంశాలు ఆకాశాన్ని మరింత ఆగ్రహంగా మార్చేస్తున్నాయి. మరోవైపు ఉత్తరప్రదేశ్ ఎక్కువ ఎఫెక్ట్ అవ్వడానికి కారణం అక్కడ జనాభానే. దేశంలోనే అత్యధిక జనాభా కలిగిన ఈ రాష్ట్రంలో లక్షలాది మంది రైతులు బహిరంగ ప్రదేశాల్లో పనిచేస్తుంటారు. వర్షం మొదలైతే చెట్టు కింద నిలబడటం, పొలాల్లో ఉండిపోవడం కారణంగా ఎక్కువ మంది పిడుగులకు బలవుతున్నారు. బీహార్, జార్ఖండ్ ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి. ముఖ్యంగా మాన్సూన్ ముందు వచ్చే ఉరుములు, ఈదురుగాలులతో కూడిన తుఫాన్లు అక్కడ మరింత ప్రమాదకరంగా మారుతున్నాయి.