Dailyhunt
Fire Accident: పల్లెవెలుగు బస్సులో మంటలు.. బస్సులో 21 మంది ప్రయాణికులు.

Fire Accident: పల్లెవెలుగు బస్సులో మంటలు.. బస్సులో 21 మంది ప్రయాణికులు.

NTV Telugu 3 weeks ago

వైఎస్సార్ కడప జిల్లాలో ఆర్టీసీ ప్రయాణికులు తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. వేంపల్లి మండల పరిధిలోని వీరన్నగట్టుపల్లె సమీపంలో ఆదివారం ఒక పల్లెవెలుగు బస్సు ప్రమాదానికి గురైంది.

ప్రయాణికులతో వెళ్తున్న ఈ బస్సు ఒక్కసారిగా అగ్నిప్రమాదానికి గురవ్వడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.

అసలేం జరిగింది.. ?
స్థానిక సమాచారం ప్రకారం.. వీరన్నగట్టుపల్లె వద్ద అప్రోచ్ రోడ్డు పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రోడ్డుపై మట్టిని ఎక్కువగా ఎత్తుగా పోయడంతో.. రోడ్డు పైనుంచి వెళ్తున్న హైటెన్షన్ విద్యుత్ తీగలు కిందికి వేలాడుతున్నాయి. బస్సు ఆ దారి గుండా వెళ్తున్న క్రమంలో, బస్సు పైభాగం ఆ విద్యుత్ వైర్లకు బలంగా తగిలింది. దీనివల్ల భారీగా షార్ట్ సర్క్యూట్ జరిగి, క్షణాల వ్యవధిలోనే మంటలు చెలరేగాయి.

అప్రమత్తమైన ప్రయాణికులు.
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో డ్రైవర్, కండక్టర్‌తో సహా మొత్తం 21 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు పైనుంచి మంటలు రావడం గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బస్సును నిలిపివేశారు. ప్రయాణికులందరూ ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాణభయంతో బస్సు దిగి సురక్షిత ప్రాంతానికి పరుగులు తీశారు. అందరూ దిగిపోయిన కొద్దిసేపటికే మంటలు బస్సు మొత్తానికి వ్యాపించాయి.

సహాయక చర్యలు..
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అదృష్టవశాత్తూ ప్రయాణికులు సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్ల ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అధికారులు రోడ్డుపై ఎత్తుగా వేసిన మట్టిని తొలగించి, విద్యుత్ తీగలను సరిచేసే పనులు చేపట్టారు. నిర్లక్ష్యంగా మట్టి పోయడం వల్లే ఈ ముప్పు వాటిల్లిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu