Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
First Time Review : ఫస్ట్ టైం రివ్యూ

First Time Review : ఫస్ట్ టైం రివ్యూ

NTV Telugu 2 days ago

ర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) హవా నడుస్తున్న నేటి రోజుల్లో, దానికి ఎక్కడా తావివ్వకుండా కేవలం మానవ మేధస్సు (HI – Human Intelligence)తో, అది కూడా పరిమిత బడ్జెట్‌లో విజువల్ వండర్‌గా తెరకెక్కిన చిత్రం 'ఫస్ట్ టైం'.

హేమంత్ ఆర్ట్స్ పతాకంపై హేమంత్ ఇప్పలపల్లి కథ, ఎడిటింగ్, వీఎఫ్‌ఎక్స్ బాధ్యతలతో పాటు దర్శక-నిర్మాతగా వన్ మ్యాన్ షోగా ఈ చిత్రాన్ని అద్భుతమైన టెక్నికల్ వాల్యూస్‌తో రూపొందించారు. పాయల్ రాజ్ పుత్ ప్రేమికుడు సౌరబ్ ధింగ్ర హీరోగా పరిచయం అవుతున్న ఈ న్యూ ఏజ్ మూవీ, నేడు (మే 22, శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ ప్రతిష్టాత్మక సైన్స్ ఫిక్షన్ పౌరాణిక చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం…

ఫస్ట్ టైం కథ:
సినిమా 2304 AD బ్యాక్‌డ్రాప్‌లో ఏలియన్స్ (గ్రహాంతరవాసులు) ఎంట్రీతో చాలా ఆసక్తికరంగా ప్రారంభమవుతుంది. అసలు ఈ కలియుగం ఎలా అంతమైంది? ఆ తర్వాత ఒక కొత్త సృష్టి, సరికొత్త భారత ప్రపంచం ఎలా ఆవిర్భవించింది? అనే ప్రధానాంశం చుట్టూ ఈ కథను అల్లారు. ఆ ఏలియన్లకు, అప్పటి సృష్టిలో బతికి ఉన్న మానవులు ఈ కలియుగంలో జరిగిన వింత సంఘటనల గురించి వివరిస్తూ.. ఒక పవిత్రమైన స్త్రీ ఈ నూతన సృష్టికి ఎలా నాంది పలికింది అనే ఫ్లాష్‌బ్యాక్ కథను చెప్తారు.

కాలేజీలో ఆద్య (అనిక విక్రమన్‌)కు విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది. ప్రతి ఒక్కడూ ఆమెను ప్రేమించాలని, ఎలాగైనా దక్కించుకోవాలని తపిస్తుంటారు. చివరకు ఆమె సొంత బావ (భూపాల్ రాజు) కూడా ఆమెను తన సొంతం చేసుకోవాలని చూస్తుంటాడు. కానీ, ఆద్య మాత్రం ఈ ఆర్భాటాలకు లొంగకుండా తన మనసుకు నచ్చిన, తనకు పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యే ఒక 'సోల్ మేట్' కోసం వెతుకుతుంటుంది. ఈ సోల్ మేట్ అన్వేషణలో ఆద్యకు తన క్లోజ్ ఫ్రెండ్ (గాయత్రి గుప్తా) సహాయం చేస్తుంది. అయితే, ఇక్కడే కథ ఊహించని మలుపు తిరుగుతుంది. నమ్మిన స్నేహితురాలే ఆద్యకు తీవ్రమైన ద్రోహం చేసి, ఒక అపరిచిత వ్యక్తి ఉచ్చులోకి నెట్టేస్తుంది. ఆ ప్రమాదం నుంచి ఆద్య ఎంతో చాకచక్యంగా తప్పించుకుని ప్రాణాలతో బయటపడుతుంది. ఆ తర్వాత ఇలాంటి క్లిష్ట పరిస్థితుల నుంచి అనికా విక్రమన్ ఎలా తప్పించుకుంది? ఈ క్రమంలో ఆమెకు సౌరబ్ ధింగ్ర ఎలా పరిచయమయ్యాడు? చివరికి ఈ కలియుగాంతం తర్వాత కొత్త ప్రపంచం ఎలా తయారయింది? అనేదే ఈ సినిమా కథ.

విశ్లేషణ:
ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్‌కు మన సనాతన ధర్మాన్ని, సృష్టి పునరాగమనాన్ని ముడిపెడుతూ దర్శకుడు హేమంత్ ఇప్పలపల్లి ఎంచుకున్న పాయింట్ చాలా వినూత్నంగా ఉంది. ఒక మైండ్ బ్లోయింగ్ సైన్స్ ఫిక్షన్ కథకు పౌరాణిక టచ్ ఇవ్వడం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సినిమా ప్రారంభంలో ఏలియన్స్ సీన్లు, 2304 AD విజువల్స్ ప్రేక్షకుడిని ఒక కొత్త లోకంలోకి తీసుకెళ్తాయి. అయితే ఫస్టాఫ్‌లో కథ అసలు పాయింట్‌కు రావడానికి కొంత సమయం తీసుకోవడం, అక్కడక్కడా కొన్ని సీన్లు కాస్త సాగదీసినట్టు (ల్యాగ్) అనిపించడం మైనస్ పాయింట్. సెకండ్ హాఫ్‌లోకి అడుగుపెట్టాక సినిమా వేగం పుంజుకుంటుంది. ఒకదాని తర్వాత ఒకటి వచ్చే థ్రిల్లింగ్ సన్నివేశాలు, కొత్త ప్రపంచం ఎలా ఏర్పడబోతోందనే విజువల్స్ ప్రేక్షకుడిని కట్టిపడేస్తాయి. క్లైమాక్స్ విజువల్స్ అద్భుతంగా ఉండి, మంచి అనుభూతిని ఇస్తాయి.

నటీనటుల విషయానికి వస్తే కనుక సౌరబ్ కి హీరోగా ఇది మొదటి సినిమా అయినప్పటికీ, ఎక్కడా తడబడకుండా చాలా పరిణతి చెందిన నటనను కనబరిచాడు. యాక్షన్ సీన్లలో, ఎమోషనల్ సీన్లలో మంచి ఈజ్ చూపించాడు. అనిక విక్రమన్ నటన పరంగానే కాకుండా గ్లామర్ పరంగానూ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కథను మలుపుతిప్పే పవిత్రమైన స్త్రీ పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. అఖిల్ సార్థక్, భూపాల్ రాజు, శివకుమార్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో వీరంతా ఎవరి పరిధి మేరకు వారు అద్భుతంగా నటించి మెప్పించారు. సీనియర్ నటులు మైమ్ గోపి, అజయ్ రత్నం, అన్నపూర్ణమ్మ, గాయత్రి గుప్తా తమ అనుభవంతో పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

సాంకేతిక విభాగం విషయానికి వస్తే దర్శకుడు హేమంత్ ఇప్పలపల్లిని ప్రత్యేకంగా అభినందించాలి. ఏఐ (AI) వాడకుండా, కేవలం తనకున్న వీఎఫ్‌ఎక్స్ అనుభవంతో తక్కువ బడ్జెట్‌లోనే హాలీవుడ్ స్థాయి విజువల్స్ అందించారు. ప్రతి ఫ్రేమ్‌లోనూ ఆయన ప్యాషన్ స్పష్టంగా కనిపిస్తుంది. వేణు మురళీధర్, రామ్ అందించిన కెమెరా వర్క్ సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్. ప్రతి విజువల్ చాలా గ్రాండ్‌గా, రిచ్‌గా ఉంది. శ్రీ వెంకట్, సూరజ్ ఎస్ కురుప్ అందించిన పాటలు పర్వాలేదనిపించినా.. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) మాత్రం సీన్లను నెక్స్ట్ లెవెల్‌కు ఎలివేట్ చేసింది.

ఓవరాల్‌గా చెప్పాలంటే.. ‘ఫస్ట్ టైం’ అనేది ఒక సరికొత్త ప్రయోగం. కొత్త తరహా సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు నచ్చొచ్చు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu