Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..

Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..

NTV Telugu 1 week ago

థాయిలాండ్‌లోని సుంగై గోలోక్‌లోని శాంతిపాప్ స్టేడియంలో ఘోర ప్రమాదం జరిగింది. స్థానిక 'గోలోక్ ఎఫ్‌ఏ కప్' టోర్నీలో భాగంగా సామ్ కోల్ట్స్, అబు x నాంగ్ సిరిన్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుండగా హఠాత్తుగా మైదానంలో పిడుగు పడింది.

ఈ విషాదకర సంఘటనలో సామ్‌కోల్ట్స్ జట్టుకు చెందిన 24 ఏళ్ల యంగ్ ఫుట్‌బాలర్ సొఫ్వాన్ అవాయే ప్రాణాలు కోల్పోగా, మరో 12 మంది ఆటగాళ్లు తీవ్రంగా గాయపడ్డారు.

మైదానంలో మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పిడుగుపడటాన్ని ప్రత్యక్షంగా చూసిన వారందరూ భయాందోళనకు గురయ్యారు. పిడుగు పడిన వెంటనే అవాయే తీవ్రంగా గాయపడి కిందపడిపోయాడు. ఆ సమయంలో నలుపు, తెలుపు రంగుల జెర్సీలు ధరించిన అతని సహచర ఆటగాళ్లు వెంటనే అతని వద్దకు పరిగెత్తి, అతనికి సీపీఆర్ (CPR) అందిస్తూ కాపాడేందుకు ప్రయత్నించారు. అత్యవసర వైద్య సిబ్బంది అతడిని ఆసుపత్రికి తరలించి కాపాడేందుకు తీవ్రంగా శ్రమించినప్పటికీ, పరిస్థితి విషమించడంతో అతను మరణించినట్లు పోలీసులు ధృవీకరించారు.

ఈ ప్రమాదంలో గాయపడిన 12 మంది ఆటగాళ్లలో ఒక మలేషియా క్రీడాకారుడు కూడా ఉన్నాడని, ప్రస్తుతం వారంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని స్థానిక పోలీస్ చీఫ్ థున్ సిరిఖుంట్ తెలిపారు. మరణించిన వింగర్ సొఫ్వాన్ అవాయే ఇటీవలే థాయ్ థర్డ్-టియర్ క్లబ్ అయిన ‘యాలా ఎఫ్‌సీ’కి సైన్ చేశాడు. అతని హఠాన్మరణం పట్ల యాలా ఎఫ్‌సీ యాజమాన్యం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, అతని కుటుంబ సభ్యులకు తమ సంతాపాన్ని ప్రకటించింది.

థాయిలాండ్‌లో ఇలాంటి పిడుగుపాటు ప్రమాదాలు జరగడం కొత్తేమీ కాదు. డిసీజ్ కంట్రోల్ డిపార్ట్‌మెంట్ నివేదిక ప్రకారం.. 2020 నుండి 2024 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా దాదాపు 283 మంది పిడుగుపాటుకు గురయ్యారు, వారిలో చాలా మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది మే నెలలోనే లంపాంగ్, ఉథాయ్ థానీ ప్రావిన్సులలో వేర్వేరు ఘటనల్లో పిడుగుపడి గర్భిణి సహా ముగ్గురు మరణించారు. ఇక ఇదే రోజున భారతదేశంలోని జార్ఖండ్ రాష్ట్రంలో కూడా పిడుగులు పడి పొలాల్లో పనిచేస్తున్న 14 మంది వ్యవసాయ కూలీలు మరణించడం గమనార్హం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu