Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Gannavaram Bus Accident: గన్నవరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌పై బోల్తా పడిన ప్రైవేట్ బస్సు!

Gannavaram Bus Accident: గన్నవరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌పై బోల్తా పడిన ప్రైవేట్ బస్సు!

NTV Telugu 5 days ago

కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర కలకలం రేపింది. ఉంగుటూరు మండలం తేలప్రోలు వద్ద జాతీయ రహదారి-16పై చెన్నై నుంచి విశాఖపట్నం వైపు ప్రయాణికులతో వెళ్తున్న వైబీఎం ట్రావెల్స్‌కు చెందిన బస్సు అదుపుతప్పి..

రోడ్డుకు మధ్యలో ఉన్న డివైడర్‌పై బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 26 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.

బస్సు ఒక్కసారిగా బోల్తా పడటంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో 12 మంది ప్రయాణికులకు తీవ్ర రక్తగాయాలు కాగా.. మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను బస్సులో నుంచి బయటకు తీసి అవుటపల్లిలోని పిన్నమనేని సిద్ధార్థ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స కొనసాగుతోంది.

ఇదే సమయంలో బస్సు వెనుక నుంచి వస్తున్న ఓ లారీ.. బోల్తా పడిన బస్సును తప్పించుకునే ప్రయత్నంలో దానిని ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ కాళ్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. అతడిని కూడా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమాచారం అందుకున్న గన్నవరం డీఎస్పీ ధర్మేంద్రతో పాటు ఆత్కూరు పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. అనంతరం ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదం కారణంగా జాతీయ రహదారి-16పై కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడగా.. పోలీసులు చర్యలు తీసుకుని ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu