Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
GT vs RR Qualifier 2: లగే రహో బేటా.. వైభవ్ సూర్యవంశీకి గవాస్కర్ ప్రత్యేక సందేశం!

GT vs RR Qualifier 2: లగే రహో బేటా.. వైభవ్ సూర్యవంశీకి గవాస్కర్ ప్రత్యేక సందేశం!

NTV Telugu 1 week ago

పీఎల్ 2026లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన విధ్వంసక బ్యాటింగ్‌తో ప్రపంచ క్రికెట్‌ను ఆశ్చర్యపరుస్తున్నాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న బుడ్డోడు..

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో కేవలం 29 బంతుల్లో 97 పరుగులు చేసి క్రికెట్ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేశాడు. 5 ఫోర్లు, 12 భారీ సిక్సర్లతో చెలరేగిన వైభవ్.. మ్యాచ్‌కు ముందు భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆశీర్వాదాలు తీసుకోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

భారతీయ సంస్కృతిలో పెద్దలకు గౌరవం తెలుపుతూ కాళ్లు మొక్కడం సంప్రదాయం. వైభవ్ సూర్యవంశీ కూడా అదే సంప్రదాయాన్ని పాటిస్తూ.. మ్యాచ్ ప్రారంభానికి ముందు ముల్లాన్‌పూర్ మైదానంలో ప్రీ-మ్యాచ్ షో చేస్తున్న సునీల్ గవాస్కర్ వద్దకు వెళ్లి ఆయన కాళ్లు మొక్కాడు. ఈ ఘటన అభిమానులను ఆకట్టుకుంది. అనంతరం ఈ విషయంపై స్పందించిన గవాస్కర్.. వైభవ్‌కు తనతో చెప్పిన వ్యాఖ్యలు వెల్లడించాడు. ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గవాస్కర్ మాట్లాడుతూ.. ‘మ్యాచ్‌కు ముందు వైభవ్ వచ్చి నా కాళ్లు మొక్కాడు. అప్పుడు నేను అతడికి ఒక్క మాటే చెప్పాను.. లగే రహో బేటా లగే రహో (ఇదే జోరు కొనసాగించు). నేను అతడితో కలిసి బ్యాటింగ్ చేస్తున్నా కూడా ఇదే చెప్పేవాడిని’ అని అన్నాడు. గవాస్కర్ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వైభవ్ సూర్యవంశీపై గవాస్కర్ ప్రశంసలు కురిపించడం ఇదే మొదటిసారి కాదు. ఇటీవల ఓ యూట్యూబ్ షోలో మాట్లాడిన గవాస్కర్.. ‘2026 సంవత్సరం వైభవ్ సూర్యవంశీ ఏడాదిగా గుర్తుండిపోతుంది’ అని వ్యాఖ్యానించాడు. అంతేకాకుండా ఈ యువ బ్యాటర్‌ను త్వరలోనే భారత టీ20 జట్టులోకి తీసుకోవాలని కూడా సూచించాడు. ‘ఇంగ్లండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు అతడిని ఎంపిక చేయాలి. ఇంత అద్భుత ప్రదర్శన చేసిన తర్వాత అవకాశం ఇవ్వకపోతే ఇంకెప్పుడు ఇస్తారు?’ అని ప్రశ్నించాడు.

వైభవ్ వయసు గురించి చర్చలు జరుగుతున్న నేపథ్యంలో గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘అతడి వయసు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అతడు తనకంటే 15 ఏళ్లు ఎక్కువ అంతర్జాతీయ అనుభవం ఉన్న బౌలర్లపై సిక్సర్లు కొడుతున్నాడు. అతడి నిర్భయమైన ఆట తీరు అద్భుతం’ అని ప్రశంసించాడు. ప్రస్తుతం వైభవ్ ఆట చూస్తుంటే.. భారత క్రికెట్‌కు మరో సూపర్ స్టార్ దొరికాడనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే వైభవ్‌ను భారత టీ20 జట్టులోకి తీసుకోవాలంటే ప్రస్తుత ఓపెనర్లలో ఎవరికైనా చోటు కోల్పోవాల్సి రావొచ్చు. ముఖ్యంగా అభిషేక్ శర్మ లేదా సంజూ శాంసన్‌లో ఒకరిని తప్పించాల్సి వచ్చే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. అయినప్పటికీ వైభవ్ ప్రస్తుతం చూపిస్తున్న ఫామ్, దూకుడు చూస్తుంటే.. అతడు త్వరలోనే టీమిండియా జెర్సీ ధరించడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu