కేంద్ర ఎన్నికల సంఘం దేశంలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటర్ సర్వే ఎంత దుమారం రేపిందో అందరికీ తెలిసిందే. ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగిన సమయంలో ఈసీ 'సర్' నిర్వహించింది.
అయితే దీనిపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. అధికార పార్టీకి మద్దతుగా ఎన్నికలు సంఘం ఈ సర్వే చేస్తోందని ఆరోపించాయి. పబ్లిక్‌గా.. పార్లమెంట్ వేదికగా చాలా ఆందోళనలు, నిరసనలు నిర్వహించారు. అయినా కూడా తగ్గేదేలే అంటూ ఎన్నికల సంఘం తన పని కాచ్చేసింది.
తాజాగా ఇదే అంశంపై న్యాయవాదుల కోసం నిర్వహించిన రెండో జాతీయ సదస్సులో జ్ఞానేశ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. 18 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రతి భారత పౌరుడిని ఓటరు జాబితాలో చేర్చేందుకు ఎన్నికల యంత్రాంగం చురుకుగా పనిచేస్తోందని తెలిపారు. అదే సమయంలో మరణించినవారు, డూప్లికేట్ పేర్లు ఉన్నవారు, చిరునామా మార్చినవారు, గైర్హాజరు ఓటర్లు, విదేశీ పౌరులు వంటి అర్హత లేని వ్యక్తుల పేర్లను ఓటరు జాబితాల నుంచి క్రమబద్ధంగా తొలగిస్తున్నట్లు వెల్లడించారు.
ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (Special Intensive Revision - SIR) కార్యక్రమం భారత అత్యున్నత న్యాయస్థానం పరిశీలనను విజయవంతంగా ఎదుర్కొనడమే కాకుండా.. రాజ్యాంగబద్ధ, చట్టబద్ధ బాధ్యతలను సమర్థవంతంగా నెరవేర్చిందని పేర్కొన్నారు. ఈ ప్రత్యేక సవరణ ప్రక్రియను దేశవ్యాప్తంగా 15 లక్షలకుపైగా బూత్ స్థాయి ఏజెంట్లు, అలాగే అన్ని జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీల జిల్లా, రాష్ట్ర అధ్యక్షుల పర్యవేక్షణలో నిర్వహిస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా 11 లక్షలకుపైగా బూత్ స్థాయి అధికారులు (BLOలు), సహాయ ఎన్నికల నమోదు అధికారులు (AEROలు) ఈ ప్రక్రియలో పాల్గొంటున్నారని చెప్పారు. వీరంతా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులేనని, ఎన్నికల సంఘానికి డిప్యూటేషన్‌పై పనిచేస్తూ దేశానికి అత్యంత కచ్చితమైన ఓటరు జాబితాలను రూపొందించేందుకు కృషి చేస్తున్నారని వివరించారు. ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయమైన, కచ్చితమైన ఓటరు జాబితాలను సిద్ధం చేయడం ఎన్నికల సంఘం లక్ష్యమని జ్ఞానేశ్ కుమార్ స్పష్టం చేశారు.

