Hyderabad Crime: ప్రేమ పేరుతో ప్రియుడు చేసిన మానసిక, శారీరక వేధింపులు భరించలేక ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఉప్పల్ పరిధిలోని రామంతాపూర్‌లో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రామంతాపూర్‌లోని ఇందిరానగర్‌కు చెందిన గండమళ్ల చందన (23) మేడిపల్లిలోని ఓ ప్రైవేట్ కంటి ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తోంది. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారానికి చెందిన తుడుము శివ అనే యువకుడితో ఆమె గత ఏడాదిన్నర కాలంగా ప్రేమలో ఉంది. అయితే కొంతకాలంగా వీరిద్దరి మధ్య తరచూ మనస్పర్థలు, తీవ్ర వివాదాలు జరుగుతున్నాయి.
శివ వేధింపులు.. కుటుంబసభ్యులు హెచ్చరించినా మారని వైనం ప్రేమ వ్యవహారంలో విభేదాలు రావడంతో శివ చందనను మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురిచేసేవాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. శివ తీరుతో విసిగిపోయిన బాధిత కుటుంబం అతడిని పలుమార్లు హెచ్చరించినప్పటికీ ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. శివ వేధింపులు రోజురోజుకూ మితిమీరిపోవడంతో తట్టుకోలేకపోతున్నానని, చనిపోవాలనే ఆలోచనలు వస్తున్నాయని చందన గతంలోనే తన అక్క వద్ద వాపోయి కన్నీరు పెట్టుకుంది.
ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన చందన.. అక్టోబర్ 22న తన నివాసంలో ఫ్యానుకు ఉరివేసుకుంది. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఆమెను సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. తన కుమార్తె ప్రాణాలు కోల్పోవడానికి తుడుము శివ వేధింపులే కారణమని మృతురాలి తల్లి ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

