Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Hyderabad Water Board : ఏసీబీ దాడుల్లో షాక్.. బయటపడ్డ కోట్ల సామ్రాజ్యం.!

Hyderabad Water Board : ఏసీబీ దాడుల్లో షాక్.. బయటపడ్డ కోట్ల సామ్రాజ్యం.!

NTV Telugu 6 days ago

Hyderabad Water Board : భాగ్యనగరంలో అవినీతి నిరోధక శాఖ (ACB) మరో భారీ తిమింగలాన్ని బుట్టలో వేసుకుంది. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే పక్కా సమాచారంతో హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ స్వరేజ్ Board (HMWS & SB) జనరల్ మేనేజర్ నివాసాలపై ఏసీబీ అధికారులు సంచలన దాడులు నిర్వహించారు.

ఈ సోదాల్లో కిలోల కొద్దీ బంగారం, టన్నుల కొద్దీ వెండి, కోట్లలో నగదు బయటపడటం నగరంలో తీవ్ర కలకలం రేపుతోంది.

రెడ్ హిల్స్‌లోని ప్రాజెక్ట్ డివిజన్-VIII లో జనరల్ మేనేజర్ (ఇంజినీరింగ్)గా పనిచేస్తున్న సాగ్గం అనంత లక్ష్మీ కుమార్, తన అధికారిక ఆదాయ వనరులకు మించి అవినీతి మార్గాల్లో కోట్లాది రూపాయల ఆస్తులు సంపాదించినట్లు ఏసీబీకి ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో నిఘా పెట్టిన అధికారులు, ప్రాథమిక ఆధారాలు సేకరించిన అనంతరం అవినీతి నిరోధక చట్టం 1988 (2018 సవరణ)లోని సెక్షన్ 13(1)(b), 13(2) కింద కేసు నమోదు చేశారు.

ఈ క్రమంలోనే మంగళవారం తెల్లవారుజాము నుంచే ఏసీబీ తెలంగాణ అధికారులు రంగంలోకి దిగారు. ఏఎల్‌ కుమార్ నివాసంతో పాటు ఆయన బంధువులు, స్నేహితులు, బినామీలకు చెందిన మొత్తం 9 ప్రదేశాల్లో ఒకేసారి ఏకకాలంలో సోదాలు ప్రారంభించారు. అధికారులు ఇళ్లలోకి అడుగుపెట్టాక అక్కడ లభించిన ఆస్తులు, నగదు చూసి నోరెళ్లబెట్టాల్సిన పరిస్థితి వచ్చింది.

ఈ దాడుల్లో నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో కలిపి ఏకంగా 18 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటితో పాటు వివిధ ప్రాంతాల్లో 6 ఓపెన్ ప్లాట్లు, హైదరాబాద్ మహానగరంలో 3 లగ్జరీ ఫ్లాట్లు, ఒక సొంత ఇల్లు ఉన్నట్లు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక ఇళ్లలో కట్టల కొద్దీ దాచి ఉంచిన సుమారు రూ. 1.10 కోట్ల లిక్విడ్ క్యాష్, ఏకంగా 2.1 కిలోల బంగారు ఆభరణాలు, 9.2 కిలోల వెండి వస్తువులతో పాటు ఒక మారుతి రిట్జ్ కారు, ఒక బజాజ్ మోటార్ బైక్‌ను ఏసీబీ కనుగొంది.

ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లు, రిజిస్ట్రేషన్ పత్రాల ప్రభుత్వ విలువ ప్రకారం ఈ ఆస్తుల విలువ రూ. 5,88,55,490 (రూ. 5.88 కోట్లు)గా లెక్కగట్టారు. అయితే, ప్రస్తుత ఓపెన్ మార్కెట్ రేట్ల ప్రకారం వీటి విలువ వంద కోట్ల రూపాయలకు పైనే ఉండే అవకాశం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఈ అక్రమాస్తుల కేసు దర్యాప్తు ప్రాథమిక దశలో ఉందని, సదరు అధికారికి చెందిన మరికొన్ని లాకర్లు, ఇతర అదనపు ఆస్తులపై విచారణ కొనసాగుతోందని ఏసీబీ ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ దాడి అవినీతి అధికారుల గుండెల్లో మరోసారి వణుకు పుట్టించింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu