Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Indian Railways Food Prices: రైల్వే ప్రయాణికులకు షాక్.. వాటి ధరల పెంపు.! జూన్ 1 నుంచి అమల్లోకి..

Indian Railways Food Prices: రైల్వే ప్రయాణికులకు షాక్.. వాటి ధరల పెంపు.! జూన్ 1 నుంచి అమల్లోకి..

NTV Telugu 2 weeks ago

Indian Railways Food Prices Hiked: దేశంలో పెరుగుతున్న ఇంధన ధరల ప్రభావం ఇప్పుడు రైల్వే స్టేషన్లలో కూడా కనిపించనుంది. భారతీయ రైల్వేలోని సెంట్రల్ రైల్వే జోన్ స్టేషన్లలో విక్రయించే ఆహార పదార్థాల ధరలను పెంచేందుకు అనుమతి ఇచ్చింది.

కొత్త ధరలు 2026 జూన్ 1 నుంచి అమల్లోకి రానున్నట్లు రైల్వే శాఖ అధికారికంగా ప్రకటించింది. సెంట్రల్ రైల్వే సోమవారం ఆహార పదార్థాల ధరల పెంపుకు ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన కొత్త మెనూ జాబితాను కూడా విడుదల చేసింది. మొత్తం 33 రకాల ఆహార పదార్థాలకు కొత్త ధరలను నిర్ణయించగా, మరో 16 వంటకాల ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదని తెలిపింది.

రైల్వే విడుదల చేసిన నోటిఫికేషన్‌లో, "స్టాటిక్ క్యాటరింగ్ యూనిట్లలో విక్రయించే 'అలా కార్ట్' ఆహార పదార్థాల ధరలను సవరించేందుకు సంబంధిత అధికార సంస్థ ఆమోదం తెలిపింది. కొత్త మెనూ, ధరలు 2026 జూన్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. అన్ని లైసెన్సుదారులు కొత్త ధరల జాబితాను రెండు భాషల్లో స్పష్టంగా ప్రదర్శించాలి" అని పేర్కొంది. అదేవిధంగా.. ధరల పెంపుతో పాటు ఆహార నాణ్యత కూడా మెరుగుపడాలని రైల్వే శాఖ స్పష్టం చేసింది. ఫుడ్ క్వాలిటీ, పరిమాణంపై తరచుగా తనిఖీలు నిర్వహించాలని అధికారులను ఆదేశించింది. ప్రయాణికుల నుంచి అధిక ధరలు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులపై కూడా విచారణలు చేపట్టాలని సూచించింది.

సెంట్రల్ రైల్వే తీసుకున్న ఈ నిర్ణయం తర్వాత దేశంలోని ఇతర రైల్వే జోన్లు కూడా ఆహార ధరలను పెంచే అవకాశం ఉందని సమాచారం. పెరుగుతున్న ముడిసరుకు ధరలు, రవాణా ఖర్చులు, ఇంధన ధరల ప్రభావంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొత్త ధరల ప్రకారం ఆలూ వడ ఒక్కటి రూ.15, వెజ్ సమోసా రూ.20, వెజ్ శాండ్విచ్ రూ.35గా నిర్ణయించారు. అలాగే మసాలా దోసా రూ.35, పవ్ భాజీ రూ.50, చోలే పూరీ రూ.40, వెజ్ పిజ్జా రూ.50గా ధరలు ఖరారు చేశారు. వీటితోపాటు ఫ్రెష్ జ్యూసుల ధరలు కూడా పెరిగాయి. క్యారెట్, పైనాపిల్, మామిడి, పుచ్చకాయ జ్యూస్ 200 మిల్లీలీటర్లకు రూ.25గా ఉండగా, స్వీట్ లైమ్, ఆరెంజ్, ఆపిల్ జ్యూస్ రూ.40గా నిర్ణయించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu