Dailyhunt
Indian Rupee: రికార్డు స్థాయిలో రూపాయి పతనం.. సామాన్యుడిపై ధరల భారం!

Indian Rupee: రికార్డు స్థాయిలో రూపాయి పతనం.. సామాన్యుడిపై ధరల భారం!

NTV Telugu 1 week ago

Indian Rupee: అంతర్జాతీయ పరిణామాలు భారత ఆర్థిక వ్యవస్థను గడగడలాడిస్తున్నాయి. భారత కరెన్సీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూపాయి విలువ భారీగా పతనమైంది.

పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, పెరుగుతున్న ముడి చమురు ధరల నేపథ్యంలో మంగళవారం రూపాయి రికార్డు స్థాయి కనిష్టానికి చేరుకుంది. ఈ రోజు ట్రేడింగ్‌లో యూఎస్ డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ మునుపెన్నడూ లేని విధంగా 95.42 వద్దకు పడిపోయింది. గత వారం నమోదైన 95.33 కనిష్ట స్థాయిని ఇది అధిగమించి, సరికొత్త రికార్డును సృష్టించింది.

ముంచుకొస్తున్న చమురు సంక్షోభం..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేపట్టిన “ప్రాజెక్ట్ ఫ్రీడమ్” (హోర్ముజ్ జలసంధిని తెరిపించే చర్య) కారణంగా అమెరికా – ఇరాన్ మధ్య సైనిక ఘర్షణలు తీవ్రమయ్యాయి. ప్రపంచ చమురు సరఫరాలో 20 శాతం వాటా కలిగిన హోర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు తలెత్తడంతో చమురు ధరలకు రెక్కలొచ్చాయి. బ్రెంట్ క్రూడ్ 5.45 శాతం పెరిగి $114.06 వద్దకు చేరింది. డబ్ల్యూటీఐ (WTI) బ్యారెల్ ధర $105.02 వద్ద ట్రేడవుతోంది.

భారత్‌పై పడే ప్రభావం ఇదే..
భారతదేశం తన చమురు అవసరాల కోసం అత్యధికంగా దిగుమతులపైనే ఆధారపడుతుంది. చమురు ధరలు పెరగడం వల్ల విదేశీ మారక ద్రవ్యం భారీగా వెచ్చించాల్సి రావడంతో లోటు పెరుగుతుంది. అలాగే రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతాయి. ఇదే సమయంలో భౌగోళిక అనిశ్చితి వల్ల విదేశీ ఇన్వెస్టర్లు భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి సుమారు 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. నిజానికి రూపాయి విలువ పతనాన్ని అడ్డుకోవడం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)కు కత్తిమీద సాములా మారింది. డాలర్ నిల్వలను ఖర్చు చేసి కరెన్సీని కాపాడాలా? లేక పెరుగుతున్న చమురు ధరలను తట్టుకునేలా విధానాలు మార్చాలా? అనే డైలమాలో ప్రస్తుతం కేంద్ర బ్యాంకు ఉంది. కేవలం రూపాయి మాత్రమే కాకుండా ఇండోనేషియా రూపియా, ఫిలిప్పీన్స్ పెసో వంటి ఇతర ఆసియా కరెన్సీలు కూడా ఇదే తరహా ఒత్తిడిని ఎదుర్కుంటున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu