Dailyhunt
IPL 2026 Coincidences: ఐపీఎల్ 2026లో అరుదైన సంఘటనలు.. అభిమానులను ఆశ్చర్యపరుస్తోన్న ఫలితాలు!

IPL 2026 Coincidences: ఐపీఎల్ 2026లో అరుదైన సంఘటనలు.. అభిమానులను ఆశ్చర్యపరుస్తోన్న ఫలితాలు!

NTV Telugu 1 week ago

పీఎల్ 2026 సీజన్ ఆరంభం నుంచే ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లు క్రికెట్ అభిమానులకు అసలైన మజాను అందిస్తున్నాయి. బ్యాటర్ల ధనాధన్​ ఇన్నింగ్స్​, బౌలర్ల మ్యాజిక్​ బౌలింగ్​, సూపర్​ క్యాచ్​లతో ఫీల్డర్ల విన్యాసాలు అభిమానులను కట్టిపడేశాయి.

అయితే తొలి నాలుగు మ్యాచ్‌లలో చోటుచేసుకున్న కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఈ నాలుగు మ్యాచ్‌లలో ఒకే తరహా ఫలితాలు రావడంపై అభిమానుకు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఐపీఎల్ 2026లోని మొదటి నాలుగు మ్యాచ్‌ల్లో ఓ ట్రెండ్ స్పష్టంగా కనిపించింది. అన్ని మ్యాచ్‌ల్లో హోమ్ జట్లు విజయం సాధించాయి. అదే సమయంలో చేజింగ్ చేసిన జట్లే గెలిచాయి. అంతేకాదు ప్రతి మ్యాచ్‌లో టాస్ గెలిచిన కెప్టెన్ ఫీల్డింగ్ ఎంచుకుని.. విజయం సాధించాడు. ఈ మూడు అంశాలు నాలుగు మ్యాచ్‌ల్లో ఒకేలా పునరావృతం కావడం విశేషం. ఈ మ్యాచ్‌ల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ జట్లు విజేతలుగా నిలిచాయి. ఓడిన జట్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ ఉన్నాయి.

ఈ తరహా అరుదైన ఫలితాలు క్రికెట్‌లో చాలా అరుదుగా కనిపిస్తాయి. సాధారణంగా ప్రతి మ్యాచ్‌లో పరిస్థితులు, పిచ్, జట్టు ప్రదర్శన మారుతూ ఉంటాయి. కానీ ఈసారి మాత్రం నాలుగు మ్యాచ్‌ల్లో ఒకే విధమైన ఫలితాలు రావడం అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. ఐపీఎల్ 2026 ప్రారంభమే ఇలా ఆసక్తికరంగా సాగుతుండటం ఈ సీజన్‌పై మరింత ఉత్కంఠను పెంచుతోంది. ఇక ముందు మ్యాచ్‌ల్లో కూడా ఇలాంటి ట్రెండ్స్ కొనసాగుతాయా లేదా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu