Dailyhunt
IPL 2026 Final: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్‌ షెడ్యూల్ విడుదల.. ఫైనల్‌ మ్యాచ్ ఎక్కడో తెలుసా?

IPL 2026 Final: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్‌ షెడ్యూల్ విడుదల.. ఫైనల్‌ మ్యాచ్ ఎక్కడో తెలుసా?

NTV Telugu 1 week ago

పీఎల్ 2026 ప్లేఆఫ్స్‌ మ్యాచ్‌ల షెడ్యూల్ వచ్చేసింది. ప్లేఆఫ్స్‌ మ్యాచ్‌ల వేదికలను ఈరోజు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఫైనల్‌ మ్యాచ్‌కు బెంగళూరు కాకుండా..

అహ్మదాబాద్‌ను ఎంపిక చేయడం విశేషం. దక్షిణ భారతంలో ఒక్క నాకౌట్‌ మ్యాచ్‌ లేకపోవడం అభిమానులను నిరాశకు గురిచేసింది. ప్లేఆఫ్స్‌ మ్యాచ్‌లకు రెండు వేదికలను (ధర్మశాల, చండీగఢ్‌) మాత్రమే బీసీసీఐ కేటాయించింది.

సాధారణంగా ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌ను గత సీజన్ విజేత జట్టు హోమ్ గ్రౌండ్‌లో నిర్వహించడం ఆనవాయితీ. ఈసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) గత సీజన్ విజేతగా నిలవడంతో.. చిన్నస్వామి స్టేడియం ఫైనల్‌కు వేదిక కావాల్సింది. అయితే అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఫైనల్‌ మ్యాచ్‌కు వేదిక అయింది. కొన్ని పరిపాలనా, లాజిస్టిక్ కారణాల వల్ల ఈ మార్పు చేయాల్సి వచ్చిందని బీసీసీఐ వెల్లడించింది. స్థానిక అసోసియేషన్, అధికారుల నుంచి వచ్చిన కొన్ని అవసరాలు తమ మార్గదర్శకాల పరిధికి బయట ఉండటంతో బెంగళూరులో ఫైనల్ నిర్వహించడం సాధ్యపడలేదని పేర్కొంది. దీంతో ఫైనల్‌ను అహ్మదాబాద్‌కు మార్చినట్లు స్పష్టం చేసింది. ఇక ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా పేరుగాంచిన నరేంద్ర మోదీ స్టేడియం వరుసగా రెండో ఏడాది ఐపీఎల్ ఫైనల్‌కు ఆతిథ్యం ఇస్తోంది.

ఐపీఎల్ 2026 లీగ్ దశలో 70 మ్యాచ్‌లు ఉన్నాయి. ఇప్పుడు టోర్నమెంట్ కీలక దశలోకి అడుగుపెడుతోంది. ఈ నేపథ్యంలోనే ప్లేఆఫ్స్ షెడ్యూల్‌ను బీసీసీఐ విడుదల చేసింది. టాప్-2 జట్లు తలపడే క్వాలిఫయర్-1 మ్యాచ్ మే 26న ధర్మశాలలోని హెచ్పీసీఎల్ మైదనంలో జరగనుంది. ఈ మ్యాచ్ విజేత నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది. మే 27న న్యూ చండీగఢ్‌లోని స్టేడియంలో ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది. పాయింట్ల పట్టికలో మూడో, నాలుగో స్థానాల్లో నిలిచిన జట్లు ఈ మ్యాచ్‌లో తలపడతాయి. ఇదే వేదికపై మే 29న క్వాలిఫయర్-2 కూడా ఉంటుంది. క్వాలిఫయర్-1లో ఓడిన జట్టు, ఎలిమినేటర్ విజేతతో పోటీ పడుతుంది.

ఇక ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ మే 31న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియంలో జరిగే ఈ ఫైనల్ మ్యాచ్ అభిమానులకు మరింత ఉత్సాహాన్ని అందించనుంది. ఈసారి ఐపీఎల్ ప్లేఆఫ్స్ మూడు వేర్వేరు వేదికల్లో నిర్వహించబడటం ప్రత్యేకతగా నిలుస్తోంది. బెంగళూరులో ఫైనల్ జరగకపోయినా.. అహ్మదాబాద్‌లో జరిగే గ్రాండ్ ఫినాలే మరోసారి క్రికెట్ అభిమానులకు విశేష అనుభూతిని అందించనుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu