ఇరాన్ అంతు తేలుస్తామంటూ అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన తర్వాత పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత తీవ్రంగా మారాయి. 2, 3 వారాల్లో ఇరాన్‌పై కఠిన చర్యలుంటాయని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు.
ఈ ప్రసంగం తర్వాత ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి. యుద్ధం ముగించబోతున్నట్లుగా ట్రంప్ ప్రకటిస్తారని ప్రపంచమంతా భావించింది. కానీ అందుకు భిన్నంగా ఇరాన్ అంతు తేలుస్తామంటూ ప్రకటించడంతో ప్రపంచ నాయకులు షాక్ అయ్యారు. ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో తీవ్ర పరిణామాలు చోటుచేసుకున్నాయి.
ట్రంప్ ప్రకటన అలా వెలువడిందో.. లేదో వెంటనే ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. ఇప్పుడు ప్రతీకారంగా ఇజ్రాయెల్ కూడా భీకర దాడులు చేస్తోంది. ఐఆర్‌జీసీ స్థావరాలు, క్షిపణి స్థావరాలపై ఐడీఎఫ్ దాడులు చేస్తోంది. దక్షిణ లెబనాన్‌లో హిజ్బుల్లా స్థావరాలపై కూడా ఇజ్రాయెల్ తీవ్రంగా దాడులు చేస్తోంది.
ఇక ఇరాన్ కూడా గల్ఫ్ ఇంధన ఆస్తులు, నౌకా మార్గాలపై దాడులు చేస్తోంది. అంతేకాకుండా హార్ముజ్ జలసంధిపై కూడా ఒత్తిడి పెంచింది. ఇరాక్‌పై ఇరాన్‌కు చెందిన షాహెద్ డ్రోన్‌ను అడ్డుకోవడంలో అమెరికా ఎఫ్-15 విఫలమైంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక షిరాజ్‌పై ప్రయోగించిన ఇజ్రాయెల్ హెర్మెస్ 900 డ్రోన్‌ను కూల్చివేసినట్లు ఐఆర్‌జీసీ ప్రకటించింది. ఇరాన్ మీడియా ప్రకారం.. ఫార్స్ ప్రావిన్స్‌లోని షిరాజ్ నగరంపై ఇజ్రాయెల్‌కు చెందిన హెర్మెస్ 900 డ్రోన్‌ను వాయు రక్షణ వ్యవస్థలు కూల్చివేశాయని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ప్రకటించింది. నగరంపై ఎగురుతున్న మానవరహిత వైమానిక వాహనాన్ని అడ్డగించి, ధ్వంసం చేసినట్లు ప్రకటనలో పేర్కొంది. అయితే ఈ ప్రకటనపై ఇజ్రాయెల్ అధికారుల ఇంకా అధికారికంగా స్పందించలేదు.
హెర్మెస్ 900 అనేది ఇజ్రాయెల్‌కు చెందిన ఎల్బిట్ సిస్టమ్స్ అభివృద్ధి చేసిన ఒక మధ్యస్థ-ఎత్తు గల డ్రోన్. ఇది సుదీర్ఘ కాల మానవరహిత వైమానిక వ్యవస్థ. ఇది 30 గంటలకు పైగా ఎగరగలదు. అధునాతన నిఘా పేలోడ్‌లను మోయగలదు.
ఇరాన్ శపథం
ఇక సుదీర్ఘ యుద్ధానికి ఇరాన్ శపథం చేసింది. అమెరికాకు ''శాశ్వత అవమానం'' కలిగిస్తామని ఇరాన్ హెచ్చరించింది. ఇక అమెరికాపై యుద్ధాన్ని కొనసాగిస్తామని వార్నింగ్ ఇచ్చింది. వాషింగ్టన్ పశ్చాత్తాపం పొంది లొంగిపోయేంత వరకు సంఘర్షణ కొనసాగుతుందని హెచ్చరించింది.

