Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Jitendra Mishra: ఆపరేషన్ సింధూర్‌ హీరోకి రామ మందిర సేవా భాగ్యం.. జితేంద్ర మిశ్రాపై బిగ్ రెస్పాన్సిబిలిటీ!

Jitendra Mishra: ఆపరేషన్ సింధూర్‌ హీరోకి రామ మందిర సేవా భాగ్యం.. జితేంద్ర మిశ్రాపై బిగ్ రెస్పాన్సిబిలిటీ!

NTV Telugu 1 week ago

Jitendra Mishra: అయోధ్య రామ మందిర ట్రస్ట్‌కు తొలి సీఈఓగా మాజీ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా నియమితులయ్యారు. దేశ రక్షణలో దాదాపు నాలుగు దశాబ్దాల పాటు సేవలందించిన ఆయన..

ఇప్పుడు అయోధ్య శ్రీరాముడి సేవలో కీలక బాధ్యతలు చేపట్టనున్నారు. బుధవారం అయోధ్యలోని మణి రామ్ దాస్ కంటోన్మెంట్‌లో జరిగిన సుదీర్ఘ సమావేశం అనంతరం శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఈ నియామకాన్ని అధికారికంగా ప్రకటించింది. సీఈఓ నియామకంపై కొంతకాలంగా అనేక పేర్లు ప్రచారంలోకి వచ్చినప్పటికీ.. చివరకు జితేంద్ర మిశ్రా పేరును ట్రస్ట్ ఖరారు చేసింది. దేశ రక్షణ రంగంలో ఆయనకున్న అపారమైన అనుభవం, పరిపాలనా సామర్థ్యం, కీలక మిషన్లలో ఆయన పోషించిన ప్రత్యేక పాత్రను దృష్టిలో ఉంచుకుని ఈ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది.

దేశ సేవ తర్వాత బాలరాముడి సేవ..

ఉత్తరప్రదేశ్‌లోని డియోరియాకు చెందిన జితేంద్ర మిశ్రా భారత వైమానిక దళంలో సుదీర్ఘ కాలం సేవలందించారు. దాదాపు 39 ఏళ్ల పాటు ఆయన భారత వైమానిక దళంలో వివిధ హోదాల్లో పనిచేసి.. ఈ ఏడాది ఏప్రిల్ 30న పదవీ విరమణ చేశారు. ఆయన ఫైటర్ కంబాట్ లీడర్, టెస్ట్ పైలట్, స్క్వాడ్రన్ కమాండర్ సహా పలు కీలక బాధ్యతలను నిర్వహించారు. కార్గిల్ యుద్ధ సమయంలో జరిగిన ఆపరేషన్ సఫేద్ సాగర్‌తో పాటు ఆపరేషన్ టైగర్ హిల్‌లోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. ఇటీవల ఆపరేషన్ సింధూర్‌లో వెస్ట్రన్ కమాండ్‌కు నాయకత్వం వహించిన అధికారిగా ఆయన పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. ఆయనకు సర్వోత్తమ్ యుద్ధ సేవా పతకం కూడా లభించింది. జితేంద్ర మిశ్రాకు 18 రకాల విమానాలను నడిపిన అనుభవం ఉండటంతో పాటు సుమారు 3,000 గంటల ఫ్లయింగ్ అనుభవం ఉంది. వైమానిక దళంలో అత్యంత సవాళ్లతో కూడిన బాధ్యతలను నిర్వహించిన ఆయన.. ఇప్పుడు అయోధ్య రామ మందిర ట్రస్ట్ పరిపాలనలో తన అనుభవాన్ని ఉపయోగించనున్నారు.

రెండు విమాన ప్రమాదాల నుంచి బయటపడిన అదృష్టవంతుడు..
జితేంద్ర మిశ్రా కెరీర్‌లో సాహసోపేతమైన ఘట్టాలతో పాటు ప్రమాదకరమైన అనుభవాలు కూడా ఉన్నాయి. 1987 ఆగస్టు 14న జరిగిన మిగ్-21 ఎఫ్ఎల్ ప్రమాదం నుంచి ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. అనంతరం 1991 జూన్ 11న మరో మిగ్-21 ఎం ప్రమాదం జరిగినప్పటికీ అందులోనూ ఆయన సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదాలు ఆయన వైమానిక దళ ప్రస్థానానికి అడ్డంకిగా మారలేదు. ఆ తర్వాత కూడా ఆయన దేశ సేవలో కొనసాగారు. టెస్ట్ పైలట్, స్క్వాడ్రన్ కమాండర్, వివిధ ఆపరేషనల్ హోదాల్లో పనిచేస్తూ ఉన్నత స్థాయికి ఎదిగారు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL)లో చీఫ్ టెస్ట్ పైలట్‌గా పనిచేసిన సమయంలో జితేంద్ర మిశ్రా సు-30 ఎంకేఐ ప్రాజెక్టులో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ప్రాజెక్ట్స్ డైరెక్టర్‌గా సు-30 ఎంకేఐ బ్లాక్ IV, బ్రహ్మోస్ ఇంటిగ్రేషన్ వంటి కీలక ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడంలో ఆయన భాగస్వామ్యమయ్యారు. ఎయిర్ ఫోర్స్ టెస్ట్ పైలట్స్ స్కూల్‌లో సీనియర్ టెస్ట్ ఫ్లయింగ్ ఇన్‌స్ట్రక్టర్‌గా, మిగ్-21 స్క్వాడ్రన్ కమాండింగ్ ఆఫీసర్‌గా, ఎయిర్‌బేస్ చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్‌గా కూడా పనిచేశారు. అమెరికాలోని ఎయిర్ యూనివర్శిటీకి చెందిన ఎయిర్ కమాండ్ అండ్ స్టాఫ్ కాలేజీలోనూ ఆయన శిక్షణ పొందారు.

రామ మందిర ట్రస్ట్‌లో కీలక మార్పులు
జితేంద్ర మిశ్రాను సీఈఓగా నియమించడంతో పాటు ట్రస్ట్‌లో మరికొన్ని కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు కోశాధికారిగా పనిచేసిన గోవింద్ దేవ్ గిరి మహారాజ్‌ను ట్రస్ట్ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. మహేష్ భగచంద్కాకు కొత్త కోశాధికారి బాధ్యతలు అప్పగించారు. ఇదే సమయంలో ముగ్గురు కొత్త ట్రస్టీల నియామకం కూడా జరిగింది. వారిలో అయోధ్యకు చెందిన ప్రముఖ న్యాయవాది మదన్ మోహన్ పాండే ఉన్నారు. రామ జన్మభూమి వివాదానికి సంబంధించిన న్యాయపోరాటంలో రామ్ లల్లా తరఫున ఆయన వాదించారు. మరో కొత్త సభ్యుడిగా ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త, సామాజిక కార్యకర్త మహేష్ భగచంద్కా నియమితులయ్యారు. రామ మందిర ఉద్యమంతో అనుబంధం ఉన్న ఆయన.. భగచంద్కా ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మూడో కొత్త సభ్యురాలిగా డాక్టర్ నిర్మలా యాదవ్‌ను నియమించారు. షికోహాబాద్‌కు చెందిన ఆమె సుమారు 19 ఏళ్ల పాటు కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేసి పదవీ విరమణ చేశారు.

సీఈఓ పదవి కోసం వేలాది దరఖాస్తులు
రామ మందిర ట్రస్ట్ తొలి సీఈఓ పదవిపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఈ పదవి కోసం ఏకంగా 5,585 దరఖాస్తులు వచ్చినట్లు ట్రస్ట్ వర్గాలు వెల్లడించాయి. సుదీర్ఘంగా పరిశీలించిన అనంతరం జితేంద్ర మిశ్రా పేరును ఖరారు చేసినట్లు తెలిపారు. బుధవారం జరిగిన ట్రస్ట్ సమావేశానికి అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్ దాస్, గోవింద్ దేవ్ గిరి మహారాజ్, కృష్ణ మోహన్ సహా తొమ్మిది మంది సభ్యులు హాజరయ్యారు. అయోధ్య జిల్లా మేజిస్ట్రేట్ శశాంక్ త్రిపాఠి కూడా సమావేశంలో పాల్గొన్నారు. కొందరు సభ్యులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశానికి హాజరయ్యారు. ట్రస్ట్ సమావేశంలో రామ మందిరానికి వస్తున్న విరాళాల లెక్కింపు ప్రక్రియలో సిబ్బంది జోక్యాన్ని తగ్గించే అంశంపైనా చర్చ జరిగినట్లు సమాచారం. రెండు బ్యాంకులు, ఐటీ సంస్థల నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి.. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి విరాళాల నిర్వహణను మరింత పారదర్శకంగా మార్చాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అలాగే ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్, ప్రత్యేక దర్యాప్తుపై కూడా సమావేశంలో చర్చ జరిగినట్లు సమాచారం.

జితేంద్ర మిశ్రా నియామకంపై పొలిటికల్ కామెంట్స్ ఇవే..
రామ మందిర ట్రస్ట్‌లో జరిగిన తాజా మార్పులపై రాజకీయ వర్గాల్లో పలువురు నాయకులు స్పందించారు. యూపీ బీజేపీ అధ్యక్షుడు పంకజ్ చౌదరి.. కొత్త సీఈఓ నియామకంతో భవిష్యత్తులో పరిపాలనా లోపాలు పునరావృతం కాకుండా చూడొచ్చని అభిప్రాయపడ్డారు. అయితే సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మాత్రం రామ మందిర విరాళాల నిర్వహణపై గతంలో వచ్చిన ఆరోపణలను ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కొత్త నియామకాలతో గత వ్యవహారాలను మర్చిపోలేమని కామెంట్స్ చేశారు. యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ కూడా సీఈఓ నియామకంపై భిన్నాభిప్రాయం వ్యక్తం చేశారు. రామ మందిర నిర్వహణలో మతపరమైన అనుభవం ఉన్న వ్యక్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన అభిప్రాయపడ్డారు. మొత్తంగా.. దేశ రక్షణలో దాదాపు నాలుగు దశాబ్దాల అనుభవం ఉన్న మాజీ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా ఇప్పుడు అయోధ్య రామ మందిర ట్రస్ట్ తొలి సీఈఓగా కొత్త బాధ్యతలు చేపట్టడం ఆసక్తికరంగా మారింది. సరిహద్దుల్లో దేశ సేవ చేసిన ఆయన.. ఇక బాలరాముడి సన్నిధిలో సేవా బాధ్యతలు నిర్వర్తించనుండటం ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu